Begin typing your search above and press return to search.

నిన్నొదల ఎస్బీఐ.. బాండ్లపై సుప్రీం కోర్టు మళ్లీ అల్టిమేటం

ఎన్నికల బాండ్ల వ్యవహారంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ)ని సుప్రీం కోర్టు వదలడం లేదు.

By:  Tupaki Desk   |   18 March 2024 9:33 AM GMT
నిన్నొదల ఎస్బీఐ.. బాండ్లపై సుప్రీం కోర్టు మళ్లీ అల్టిమేటం
X

ఎన్నికల బాండ్ల వ్యవహారంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ)ని సుప్రీం కోర్టు వదలడం లేదు. తమ ఆదేశాల మేరకు కేంద్ర ఎన్నికల సంఘానికి (సీఈసీ) బాండ్ల నంబర్లను ఎందుకు ఇవ్వలేదని నిలదీసింది. నంబర్లతో సహా అన్ని వివరాలనూ ఈసీకి ఇచ్చి.. ఈ నెల 21లోగా తమకు అఫిడవిట్ సమర్పించాలని ఎస్బీఐని ఆదేశించింది.

సెలక్టివ్ నెస్ ఎందుకు?

ఎన్నికల బాండ్లను రద్దు చేస్తూ ఫిబ్రవరిలో సుప్రీం కోర్టు సంచలనతీర్పు వెలువరించింది. 2019లో మొదలైనప్పటి నుంచి ఐదేళ్లలో జారీ చేసిన బాండ్ల వివరాలను ఎన్నికల సంఘానికి అందించాలని ఎస్బీఐని ఆదేశించింది. ఎస్బీఐ జూన్ వరకు గడువు కోరినా.. నిరాకరించింది. సుప్రీం ఆదేశాలతో దిగొచ్చిన ఎస్బీఐ.. బాండ్ల సమాచారాన్ని కేంద్ర ఎన్నికల సంఘానికి సమర్పించింది. అయితే, ఇక్కడే కీలక విషయాన్ని విస్మరించింది. బాండ్ల ఆల్ఫా న్యూమరిక్‌ నంబర్లను బయటపెట్టలేదు. న్యూమరిక్ నంబర్లు ఉంటే.. ఏ వ్యక్తి/ ఏ సంస్థ బాండ్లను ఏ పార్టీకి విరాళంగా ఇచ్చారని తెలుస్తుంది. ఈ నంబర్లు లేకపోవడంపై సుప్రీం కోర్టులో మరో పిటిషన్‌ దాఖలైంది. దీంతో సుప్రీం.. బ్యాంకు తీరుపై అసహనం వ్యక్తం చేసింది. ఎస్బీఐ తీరును సెలక్టివ్ నెస్ గా అభివర్ణించింది. బాండ్లకు సంబంధించిన ప్రతి సమాచారం బయటకు రావాల్సిందేనని తేల్చిచెప్పింది. దేన్నీ అణచివేయకూడదనే ఉద్దేశమే తమ తీర్పు

సారాంశమని పేర్కొంది. సుప్రీం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డి.వై. చంద్రచూడ్‌ నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది.

యూనిక్ నంబర్లతో సహా ఎన్నికల బాండ్ల వివరాలను ఈసీకి ఇచ్చేశామంటూ వచ్చే గురువారం సాయంత్రం 5 గంటల్లోగా అఫిడవిట్‌ దాఖలు చేయాలని ఎస్‌బీఐ ఛైర్మన్‌ ను ఆదేశించింది. వివరాలు అందిన వెంటనే వాటిని ఎన్నికల సంఘం వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేయాలని నిర్దేశించింది.

కాగా, ఎన్నికల బాండ్ల రూపంలో బీజేపీకి అత్యధికంగా రూ.8,718.5 కోట్లు విరాళంగా వచ్చినట్లు సీఈసీ ఆదివారం పేర్కొంది. పథకం మొదలైన 2018 మార్చి నుంచి పార్టీలు నగదుగా మార్చుకున్న బాండ్ల వివరాలను వెల్లడించింది.