Begin typing your search above and press return to search.

బాలికలు కోరికలు అణచుకోవాలన్న కలకత్తా హైకోర్టు.. కొట్టేసిన సుప్రీం

వైద్య విద్యార్థినిపై హత్యాచారంతో కోల్ కతాతో పాటు యావత్ దేశం అట్టుడుకుతున్న సంగతి తెలిసిందే.

By:  Tupaki Desk   |   20 Aug 2024 11:30 AM GMT
బాలికలు కోరికలు అణచుకోవాలన్న కలకత్తా హైకోర్టు.. కొట్టేసిన సుప్రీం
X

వైద్య విద్యార్థినిపై హత్యాచారంతో కోల్ కతాతో పాటు యావత్ దేశం అట్టుడుకుతున్న సంగతి తెలిసిందే. ఈ అంశంపై పశ్చిమ బెంగాల్ రాజధానిలో రోజూ నిరసనలు, ఆందోళనలు జరుగుతున్నాయి. ఇదే సమయంలో గత ఏడాది ఓ బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడిన నిందితుడిని కలకత్తా హై కోర్టు నిర్దోషిగా ప్రకటిస్తూ ఇచ్చిన తీర్పును సుప్రీం కోర్టు మంగళవారం కొట్టివేసింది. ఈ సందర్భంగా కలకత్తా హైకోర్టు గతంలో తీర్పు సందర్భంగా చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. ఇంతకూ ఏం జరిగిందంటే..

బెంగాల్ కు చెందిన ఓ వ్యక్తి బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. కింద కోర్టు అతడికి 20 ఏళ్ల జైలు శిక్ష వేసింది. దీనిపై నిందితుడు కలకత్తా హై కోర్టుకు వెళ్లాడు. 2023 అక్టోబరులో విచారణ జరిపింది. వేధింపులకు గురైన బాలిక.. నిందితుడితో ఇష్టపూర్వకంగానే సాన్నిహిత్యం కొనసాగించిందంటూ కింది కోర్టు తీర్పును కొట్టివేసింది. నిందితుడిని నిర్దోషిగా ప్రకటించింది. అంతేగాక.. ‘కేవలం రెండు నిమిషాల లైంగిక ఆనందం చూసుకుంటే.. బాలికలు సమాజం దృష్టిలో పరాజితులుగా మిగిలిపోతారు. కిశోర ప్రాయ బాలికలు లైంగిక వాంఛలను నియంత్రించుకోవాలి’ అని వ్యాఖ్యానించింది. ఈ వ్యాఖ్యలు అప్పట్లోనే తీవ్ర దుమారం రేపాయి. అనంతరం కేసు సుప్రీం కోర్టుకు చేరింది. దీనిపై బుధవారం తీర్పు ప్రకటించింది. కలకత్తా హైకోర్టు తీర్పును కొట్టివేసింది. కింది కోర్టు.. నిందితుడికి వేసిన శిక్షను పునరుద్ధరించింది.

కలకత్తా హైకోర్టు తీర్పు అనంతరం పెద్దఎత్తున అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఆ కోర్టు ఇచ్చిన సూచనలను సవాల్‌ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. బాలికను వేధించిన నిందితుడిని నిర్దోషిగా ప్రకటిస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై బెంగాల్‌ ప్రభుత్వం కూడా సుప్రీంలో అప్పీలు చేసింది. గతంలో ఓసారి విచారణ జరిపిన సుప్రీం ధర్మాసనం.. కలకత్తా కోర్టు సూచనలపై అసహనం వ్యక్తంచేసింది. న్యాయమూర్తులు తీర్పుల్లో ప్రవచనాలు చెప్పరాదంది. తాజాగా కీలక తీర్పు వెలువరించింది. కోర్టులు తీర్పులు ఎలా రాయాలన్న దానిపై ఆదేశాలు జారీ చేసింది.

కిశోర ప్రాయం అంటే..

బాల్యం- యుక్త వయసు మధ్య ఉండేదే కౌమార దశ లేదా కిశోర ప్రాయం. ఇది వ్యక్తి పెరుగుదల, అభివృద్ధి పరివర్తన దశ. ప్రపంచ ఆరోగ్య సంస్థ.. కౌమార దశను 10-19 సంవత్సరాల మధ్య వయసుగా నిర్వచించింది. కిశోర లేక కౌమార దశలో పెరుగుదల చాలా వేగంగా ఉంటుంది. పెద్దయ్యాక ఉండే బరువులో 50%, ఎత్తులో 20% కౌమార దశలోనే పెరుగుతారు. జీవితంలోని అన్ని దశల్లో కంటే ఈ దశలో చలాకీగా ఆడుతూ, పాడుతూ, పరుగులు తీస్తూ, గంతులు వేస్తూ చురుకుగా ఉంటారు. ఈ నేపథ్యంలో పోషక పదార్థాల అవసరం కూడా పెరుగుతుంది. అందుకే వైద్యులు ఈ వయసులో అన్ని పోషక పదార్థాలు కలిగిన ఆహారం తీసుకోవాలని సూచిస్తుంటారు.