తెలంగాణ గవర్నర్ కోటా ఎమ్మెల్సీల నియామకం.. సర్కారుకు లైన్ క్లియర్?
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక తెలంగాణ జన సమితి అధ్యక్షుడు, తెలంగాణ ఉద్యమకారుడు ప్రొఫెసర్ కోదండరాం, సియాసత్ పత్రికాధిపతి అమీర్ అలీఖాన్ లను నియమించడం కూడా నిలిచిపోయింది.
By: Tupaki Desk | 14 Aug 2024 8:05 AM GMTదాదాపు రెండేళ్లుగా అటుఇటు తిరుగుతున్న తెలంగాణ గవర్నర్ కోటా ఎమ్మెల్సీల వ్యవహారం ఓ కొలిక్కి వచ్చినట్లే కనిపిస్తోంది. బీఆర్ఎస్ హయాంలో.. ప్రస్తుత హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి నియామకం దగ్గర మొదలైన వివాదం.. ఆ తర్వాత దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణల వరకు సాగింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక తెలంగాణ జన సమితి అధ్యక్షుడు, తెలంగాణ ఉద్యమకారుడు ప్రొఫెసర్ కోదండరాం, సియాసత్ పత్రికాధిపతి అమీర్ అలీఖాన్ లను నియమించడం కూడా నిలిచిపోయింది. గమనార్హం ఏమంటే.. ఈ వ్యవధిలో ముగ్గురు (ఒక ఇంచార్జి గవర్నర్ సహా) గవర్నర్లు మారారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండగా చేసిన తమ నియామకాన్ని పక్కనపెట్టి వేరేవారిని గవర్నర్ కోటాలో ఎంపిక చేయడాన్ని సవాలు చేస్తూ బీఆర్ఎస్ నేతలు దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణలు సుప్రీం కోర్టుకు వెళ్లారు. కొత్తగా ఎమ్మెల్సీలను నియమించకుండా స్టే విధించాలని కోరారు. బుధవారం దీనిపై అత్యున్నత న్యాయస్థానం విచారణ చేపట్టింది. కాగా, కేసీఆర్ ప్రభుత్వ హయాంలో శ్రవణ్, కుర్ర సత్యనారాయణ నియామకాలను అప్పటి గవర్నర్ పక్కనపెట్టారు. రేవంత్ ప్రభుత్వం వచ్చాక వీరి స్థానంలో కోదండరాం, అమీర్ అలీఖాన్ ను నియమించగా గవర్నర్ ఆమోదం తెలిపారు. అయితే, ఇందులో గవర్నర్ పరిధి దాటి వ్యవహరించారని శ్రవణ్, సత్యనారాయణ హైకోర్టుకు వెళ్లారు. దీంతో ఎమ్మెల్సీల నియామకాన్ని కొట్టివేస్తూ.. కోదండ, అలీఖాన్ ల నియామకంపై స్టే విధించింది. హైకోర్టు ఇచ్చిన తీర్పుపైనే ఇప్పుడు సుప్రీంకోర్టు స్టే విధించింది.
గవర్నర్, సర్కారు హక్కులను హరించినట్లే..
విచారణ సందర్భంగా సుప్రీం కీలక వ్యాఖ్యలు చేసింది కొత్త ఎమ్మెల్సీల నియామకాన్ని అడ్డుకుంటే గవర్నర్, ప్రభుత్వం హక్కులు హరించినట్లేనని అభిప్రాయపడింది. ఎప్పటికప్పుడు నియామకాలు చేపట్టడం ప్రభుత్వం పని అని వ్యాఖ్యానించింది. తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు స్టే అమల్లో ఉంటుందని జస్టిస్ విక్రమ్‌నాథ్ నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది. పిటిషన్ పై విచారణను 4 వారాల పాటు వాయిదా వేసింది. ప్రతివాదులుగా ఉన్న గవర్నర్, తెలంగాణ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. కాగా, శ్రవణ్, సత్యనారాయణల తరఫున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ వాదించారు. కొత్తగా ఎమ్మెల్సీలను నియమించకుండా స్టేటస్ కో విధించాలని ఆయన కోరగా.. గవర్నర్ నామినేట్ చేయడాన్ని తాము అడ్డుకోలేమని ధర్మాసనం స్పష్టం చేసింది. ప్రభుత్వం, గవర్నర్ ఎలాంటి చర్యలు తీసుకున్నా, సుప్రీంకోర్టు తుది ఉత్తర్వులకు లోబడి ఉంటుందని ధర్మాసనం స్పష్టం చేసింది.
తమిళిసై నుంచి.. జిష్ణుదేవ్ వర్మ వరకు
తెలంగాణ గవర్నర్ గా తమిళిసై ఉన్న సమయంలో కౌశిక్ రెడ్డిని గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా నియమించేందుకు ఒప్పుకోలేదు. సామాజిక రంగంలో సేవ కోటాలో కౌశిక్ రెడ్డి నియామకానికి ప్రభుత్వం చేసిన ప్రతిపాదనను తిరస్కరించారు. ఆ తర్వాత కుర్రా సత్యనారాయణ, దాసోజు శ్రవణ్ పేర్లను ప్రతిపాదించినా.. ఆమోదం పొందలేదు. ఈలోగా తమిళిసై తమిళనాడు రాజకీయాల్లోకి వెళ్లిపోయారు. అంతకుముందే తెలంగాణలో ప్రభుత్వం మారింది. ఈ తర్వాత ఇంచార్జి గవర్నర్ వచ్చారు. కాంగ్రెస్ సర్కారు.. కోదండ, అలీఖాన్ ల పేర్లను ప్రతిపాదించింది. వీటికీ కోర్టు కేసు అడ్డంకి అయింది. ఇప్పుడు త్రిపురకు చెందిన జిష్ణు దేవ్ వర్మ గవర్నర్ గా వచ్చారు. ఇలా ముగ్గురు గవర్నర్ల మధ్యన ఎమ్మెల్సీల నియామక అంశం తిరిగింది.