ఔను.. అన్నీ లెక్కించలేరు: వీవీప్యాట్‌లపై సుప్రీంకోర్టు తీర్పు
ప్రస్తుతం జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో ఈవీఎంలపై ఉన్న పార్టీల గుర్తుల బటన్‌ను నొక్కడం ద్వారా ఓటు వేస్తున్నాం.
By: Tupaki Desk | 26 April 2024 9:30 AM GMTప్రస్తుతం జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో ఈవీఎంలపై ఉన్న పార్టీల గుర్తుల బటన్‌ను నొక్కడం ద్వారా ఓటు వేస్తున్నాం. అయితే.. దీనిపై సందేహాలు రావడంతో.. వీవీప్యాట్‌లను తీసుకువచ్చారు. ఓటరు ఏ గుర్తుపై అయితే ఓటు వేశారో.. ఆ గర్తు ప్రింటు కాపీ... పక్కనే ఉన్న వీవీ ప్యాట్‌ల స్లిప్పుల ద్వారా బయటకు వస్తుంది. ఇంత వరకు బాగానే ఉంది. ఇక్కడ కూడా మతలబు ఉందని.. కాబట్టి.. ఈవీఎం ఓట్ల లెక్కింపుతో పాటు.. వీవీ ప్యాలెట్‌లో ముద్రణ అయ్యే స్లిప్పులు కూడా లెక్కించాలని పలు ప్రజాసంఘాల డిమాండ్.
దీనిపైనే కొందరు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అదేవిధంగా బ్యాలెట్ పత్రాల రూపంలో జరిగిన పాత ఎన్నికల పద్ధతినే తీసుకురావాలని మరికొందరు కోరారు. ఈ రెండు అంశాలపై సుదీర్ఘంగా విచారణ జరిపిన సుప్రీం కోర్టు.. తాజాగా తీర్పు వెలువరించింది. బ్యాలెట్ పత్రాల ద్వారా జరిపే ఎన్నికలు సాధ్యం కాదని.. కాలంమారిందని.. నైపుణ్యాలు, సాంకేతికతను ఎన్నికల రంగంలోనూ అమలు చేయడం తప్పుకాదని తేల్చి చెప్పింది. దీనిని కొనసాగించవచ్చని.. పాత రోజుల్లోకి వెళ్లలేమని పేర్కొంది.
ఇక, రెండో అంశం.. వీవీ ప్యాట్‌లలో నమోదయ్యే స్లిప్పులు లెక్కించడం. దీనిపై తాజాగా తీర్పు చెప్పిన సుప్రీంకోర్టు.. ఇది కూడా సాధ్యం కాదని తేల్చి చెప్పింది. ఇప్పటికే ఎన్నికల సంఘం దీనికి సంబంధించి పలు చర్యలు తీసుకుందని తెలిపింది. ఈ విధానం బాగానే ఉందని.. ఇప్పుడు మొత్తంగా వీవీ ప్యాట్‌ల స్లిప్పులు లెక్కిస్తూ.. కూర్చుంటే పుణ్యకాలం గడిచిపోతుందని వ్యాఖ్యానించింది. ఎన్నికల సంఘం ఇచ్చిన వివరణ(ఒక్కొక్క నియోజకవర్గంలో రెండేసి బూత్‌లలో స్లిప్పులు లెక్కిస్తున్నట్టు) సంతృప్తికరంగా ఉందని తెలిపింది.