Begin typing your search above and press return to search.

‘సుప్రీం’ సంచలన తీర్పు.. వాటిపై రాయల్టీ రాష్ట్రాలకే!

దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది.

By:  Tupaki Desk   |   25 July 2024 9:33 AM GMT
‘సుప్రీం’ సంచలన తీర్పు.. వాటిపై రాయల్టీ రాష్ట్రాలకే!
X

దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఖనిజాలు, గనులపై రాయల్టీ రాష్ట్రాలకే దక్కుతుందని విస్పష్టంగా ప్రకటించింది. తద్వారా ఖనిజాలు, గనులపై రాయల్టీ విధించే విషయంలో కేంద్రానికి సుప్రీంకోర్టులో భారీ షాక్‌ తగిలింది. గనులు, ఖనిజాలపై రాయల్టీ విధించే హక్కు రాష్ట్రాలకు ఉంటుందని కోర్టు తేల్చిచెప్పింది. ఈ మేరకు విస్తృత ధర్మాసనం 8:1తో విస్పష్ట తీర్పును వెలువరించింది.

2004లో పశ్చిమబెంగాల్‌ ప్రభుత్వం వర్సెస్‌ కేశోరాం ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ కేసులో సుప్రీంకోర్టు తాజాగా తీర్పు ఇచ్చింది. గతంలో 1989లో ఇలాంటి కేసులోనే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులో అచ్చుతప్పులు దొర్లాయని ధర్మాసనం తెలిపింది. రాయల్టీ.. పన్ను కాబోదని వివరించింది. అప్పట్లో ఈ వివాదాన్ని తొమ్మిది మంది సభ్యుల రాజ్యాంగ విస్తృత ధర్మాసనానికి కోర్టు నివేదించిన సంగతి విదితమే. దానిపైన ఎట్టకేలకు తీర్పు వెలువడింది.

ఈ సందర్భంగా ఖనిజాలపై పార్లమెంటుకున్న పన్ను విధించే అధికారం.. రాష్ట్రాలకున్న నియంత్రణాధికారాన్ని తొలగించేస్తోందని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌ నేతృత్వంలోని తొమ్మిది మంది సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం అభిప్రాయపడింది.

గనులు, ఖనిజాల నియంత్రణ, అభివృద్ధికి సంబంధించి పార్లమెంటుకు భారత రాజ్యాంగం ఏకపక్షంగా అధికారాన్ని కట్టబెట్టలేదని సుప్రీంకోర్టు కుండబద్దలు కొట్టింది. ఆయా రాష్ట్రాల్లో ఉన్న గనులు, ఖనిజాలపై ఆయా రాష్ట్రాలకే అధికారం, హక్కులు ఉంటాయని స్పష్టం చేసింది.

అలాగే వాటిపై నియంత్రణాధికారం, అభివృద్ధి హక్కులు కూడా ఉంటాయని పేర్కొంది.

కాగా మైనింగ్‌ కంపెనీల తరఫున ప్రముఖ న్యాయవాది హరీశ్‌ సాల్వే వాదనలు వినిపించారు. ఈ సందర్బంగా ఆయన తన వాదనలు వినిపిస్తూ.. గనులు, ఖనిజాల (అభివృద్ధి, నియంత్రణ) చట్టం–1957 ప్రకారం.. ఖనిజాలపై రాయల్టీని పన్నుగా నిర్దేశించవచ్చన్నారు. దీనిపై పార్లమెంటుకు గంపగుత్త అధికారం ఉంటుందని చెప్పారు.

హరీశ్‌ సాల్వే వాదలను సుప్రీంకోర్టు తిరస్కరించింది. 1989లో ఇండియా సిమెంట్స్‌ లిమిటెడ్‌ వర్సెస్‌ తమిళనాడు ప్రభుత్వం కేసులో ఏడుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం.. రాయల్టీని పన్నుగా గుర్తించవచ్చని తీర్పు చెప్పిందని గుర్తు చేసింది. అయితే పార్లమెంటుకు గంపగుత్త అధికారం ఉండదని స్పష్టం చేసింది.

సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో గనులు, ఖనిజాలు అధికంగా ఉన్న ఒడిశా, జార్ఖండ్, బెంగాల్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్‌ తదితర రాష్ట్రాలకు ప్రయోజనం కలగబోతోంది.