Begin typing your search above and press return to search.

పిల్లల అశ్లీల వీడియోలు వీక్షణపై సుప్రీం కీలక వ్యాఖ్యలు!

తమిళనాడుకు చెందిన ఒక యువకుడు తన ఫోన్ లో చిన్నారుల అశ్లీల వీడియోల్ని చూస్తున్నారన్న ఆరోపణతో కేసు నమోదు చేసింది.

By:  Tupaki Desk   |   20 April 2024 4:52 AM GMT
పిల్లల అశ్లీల వీడియోలు వీక్షణపై సుప్రీం కీలక వ్యాఖ్యలు!
X

అశ్లీల వీడియోల వీక్షణ ఆరోగ్యానికి ఏ మాత్రం మంచిది కాదన్న సంగతి తెలిసిందే. అందుబాటులోకి వచ్చిన సెల్ ఫోన్ పుణ్యమా అని.. చౌకైన డేటా కారణంగా అశ్లీల వీడియోల్ని చూసే వారి సంఖ్య భారీ ఎత్తున పెరిగింది. మానసిక ఆరోగ్యాన్ని తీవ్రంగా ప్రభావితం చేసే అశ్లీల వీడియోల వీక్షణకు సంబంధించిన కేసు ఒకటి సుప్రీం ముందుకు వచ్చింది. దీనికి సంబంధించిన విచారణ సందర్భంగా సుప్రీం ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది.

తమిళనాడుకు చెందిన ఒక యువకుడు తన ఫోన్ లో చిన్నారుల అశ్లీల వీడియోల్ని చూస్తున్నారన్న ఆరోపణతో కేసు నమోదు చేసింది. దీనిపై మద్రాసు హైకోర్టు తీవ్రమైన శిక్షను విధిస్తూ తీర్పును ఇచ్చింది. దీనిపై ఆరోపణలు ఎదుర్కొంటున్న యువకుడు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ కేసు విచారణ సందర్భంగా నిందితుడు చిన్నారుల అశ్లీ వీడియోల్ని కావాలని చూడలేదని.. ఫోన్ లోకి వచ్చి.. ఆటోమేటిక్ గా డౌన్ లోడ్ అయినట్లుగా పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో నిందితుడిపై మద్రాస్ హైకోర్టు చర్యలను రద్దు చేయాలని కోరారు.

ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు స్పందిస్తూ.. చిన్నపిల్లల అశ్లీల వీడియోలు చూడటం నేరం కాకపోవచ్చన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. అదే సమయంలో పిల్లలను ఉపయోగించి అశ్లీల వీడియోల్ని తీయటం మాత్రం తీవ్రమైన ఆందోళన కలిగించే అంశంగా.. అది తీవ్రమైన నేరంగా పేర్కొంది. పిల్లల అశ్లీల వీడియోల్ని డౌన్ లోడ్ చేసుకొని చూడటాన్ని పోక్సో.. ఐటీ చట్టాల కింద నేరంగా పరిగణలోకి తీసుకోలేమన్న న్యాయస్థానం.. మద్రాసు హైకోర్టు జారీ చేసిన చర్యలను నిలిపివేసింది.

తన క్లయింట్ నిర్దోషిఅని.. అతడి వాట్సాప్ కు వచ్చిన వీడియోలు ఆటోమేటిక్ గా డౌన్ లోడ్ అయినట్లుగా పేర్కొన్నారు. ఇందులో తన క్లయింట్ చేసిన తప్పేంటి? అంటూ నిందితుడి తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. అయితే.. ఇలాంటి వీడియోలు ఇన్ బాక్సులోకి వచ్చి చేరితే.. వెంటనే డిలీట్ చేయాలని.. అలా చేయకుండా ఐటీ నిబంధనల్ని ఉల్లంఘిస్తే అప్పుడు నేరమవుతుందని సుప్రీం పేర్కొంది. మద్రాసు హైకోర్టు జారీ చేసిన చర్యల్ని నిలిపివేసిన సుప్రీంకోర్టు.. తన తీర్పును రిజర్వులో పెట్టింది. మరి.. దీనిపై ఎలాంటి తీర్పును సుప్రీం ఇస్తుందో చూడాలి.