జగన్ కేసులపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కేసుల విచారణను తెలుగు రాష్ట్రాల నుంచి బదిలీ చేయాలని ఎంపీ రఘురామ సుప్రీంకోర్టులో పిటిషన్లు వేసిన సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 19 Jan 2024 10:06 AM GMTఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కేసుల విచారణను తెలుగు రాష్ట్రాల నుంచి బదిలీ చేయాలని ఎంపీ రఘురామ సుప్రీంకోర్టులో పిటిషన్లు వేసిన సంగతి తెలిసిందే. వీటిలో జగన్ బెయిల్ రద్దు గురించి కూడా ట్రిపుల్ ఆర్ పిటిషన్ వేశారు. ఈ సమయంలో తాజాగా ఈ పిటిషన్లపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా జగన్ కేసుల విచారణ ఎందుకు ఆలస్యమవుతోందని సుప్రీంకోర్టు ప్రశ్నించింది!
అవును... జగన్ కేసులకు సంబంధించిన విచారణ ఎందుకు ఆలస్యం అవుతుందంటూ ఈరోజు సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఈ సమయంలో అందుకు సమాధానంగా స్పందించిన సీబీఐ తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా... ఇందుకు తాము బాధ్యులం కాదని తెలిపారు. ఇదే సమయంలో... లోయర్ కోర్టులో వాయిదాలతో తమకు సంబంధం లేదని వెల్లడించారు!
ఈ సందర్భంగా స్పందించిన జగన్ తరఫు న్యాయవాదులు... ప్రజాప్రతినిధులపై దాఖలైన పిటిషన్ లను వేగంగా విచారించాలని సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు తెలంగాణ హైకోర్టు జారీ చేసిన ఉత్తర్వులను ప్రస్థావించారు.. అందువల్ల విచారణ ముగించాలని కోరారు. ఇదే సమయంలో... హైకోర్టు సుమోటోగా ఆదేశాలు ఇచ్చినందున 3 నెలల గడువు ఇవ్వాలని కోరారు!
దీంతో స్పందించిన అత్యున్నత న్యాయస్థానం... తాము ఈ పిటిషన్ లపై విచారణ ముగించడం లేదని స్పష్టం చేసింది. ఇదే సమయంలో ఇంత కాలయాపన ఏంటంటూ అసహనం వ్యక్తం చేసిందని తెలుస్తుంది. ఇదే సమయంలో పిటిషనర్ రఘురామ కృష్ణరాజు గురించి జగన్ తరఫు న్యాయవాది నిరంజన్ రెడ్డి స్పందించారు. ఇందులో భాగంగా... రాజకీయ దృక్పథంతో పిటిషన్ దాఖలు చేశారని అన్నారు!
ఇదే సమయంలో... వైఎస్సార్సీపీ రఘురామ కృష్ణంరాజుపై చర్యలు తీసుకోవడం వల్ల గత మూడేళ్లుగా పార్టీ కార్యకలాపాలకు ఆయన విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని జగన్ తరుపు న్యాయవాది తెలిపారు! ఆయనపై అనర్హత పిటిషన్ దాఖలు చేసినందునే జగన్ పై ఇక్కడ ఈ పిటిషన్లు దాఖలు చేశారని తెలిపారు!
ఈ సందర్భంగా స్పందించిన సుప్రీం... గత ఏడాది డిసెంబర్ 15న పలుకుబడి ఉన్న వ్యక్తులు కేసులను త్వరితగతిన విచారణ పూర్తి చేయాలని తెలంగాణ హైకోర్టు ఆదేశాలు ఇచ్చినందున.. ఏం జరుగుతుందో చూద్దామని పేర్కొన్న ధర్మాసనం... తదుపరి విచారణను ఏప్రిల్ లో చేపట్టనున్నట్లు తెలిపింది!