Begin typing your search above and press return to search.

నోటా విషయంలో ఈసీకి సుప్రీం కోర్టు కీలక నోటీసులు!

భారతదేశ రాజకీయాల్లో ఎన్నికల వేళ "నోటా" అనే అంశం కూడా తీవ్ర చర్చనీయాంశం అవుతుంటుంది.

By:  Tupaki Desk   |   26 April 2024 10:02 AM GMT
నోటా విషయంలో ఈసీకి సుప్రీం కోర్టు కీలక నోటీసులు!
X

భారతదేశ రాజకీయాల్లో ఎన్నికల వేళ "నోటా" అనే అంశం కూడా తీవ్ర చర్చనీయాంశం అవుతుంటుంది. ఆ నియోజకవర్గంలో పోటీకి నిలబడ్డ ఏ అభ్యర్థి తనకు నచ్చలేదనే విషయం పనిగట్టుకుని పోలింగ్ బూత్ కి వెళ్లీ మరీ ఓటరు చెబుతుంటాడు! ఇది ఒక అద్భుతమైన విషయం, అంతే అద్భుతమైన అవకాశం అని అంటుంటారు పరిశీలకులు. ఈ విషయంలో తాజాగా సుప్రీంలో ఒక పిల్ దాఖలైంది. దీనిపై ఈసీకి సుప్రీం నోటీసులు పంపించింది.

అవును... ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల్లో చాలా మందికి, కొన్ని సందర్భాల్లో కొన్ని పార్టీలకు కూడా కొన్ని చోట్ల నోటాకంటే తక్కువ ఓట్లు పోలవుతుంటాయి. కొన్ని ప్రాంతాల్లో.. జాతీయ పార్టీలకు కూడా ఆ పరిస్థితులు తప్పలేదు. ఈ క్రమంలో... ఈ నోట వ్యవహారంపై సుప్రీంలో పిల్ దాఖలైంది. ఈ సందర్భంగా ఆ పిల్ లో సదరు పిటిషనర్ లేవనెత్తిన అంశాలు వైరల్ గా మారాయి!

వివరాళ్లోకి వెళ్తే... ఒక నియోజకవర్గంలో అభ్యర్థులకంటే ఎక్కువగా నోటాకే ఓట్లు వస్తే... రెండో అత్యధిక ఓట్లు వచ్చిన అభ్యర్థిని విజేతగా ప్రకటిస్తుంటారు! అయితే... ఎన్నికల్లో నోటాకు అత్యధికంగా ఓట్లు వస్తే.. సదరు నియోజకవర్గం ఫలితాన్ని పూర్తిగా రద్దు చేసి కొత్తగా పోలింగ్‌ నిర్వహించాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలయ్యింది. ఇప్పుడు ఈ విషయం ఆసక్తిగా మారింది.

ఇలా... శివ్‌ ఖేరా అనే రచయిత పిల్‌ ద్వారా లేవనెత్తిన అంశాలను పరిశీలించేందుకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ నేతృత్వంలోని జస్టిస్‌ జేబీ పార్దీవాలా, జస్టిస్‌ మనోజ్‌ మిశ్రాల ధర్మాసనం అంగీకరించింది. ఈ అంశంపై భారత ఎన్నికల సంఘానికి నోటీసులు జారీ చేసింది. దీంతో... ఈ అంశంపై ఎలాంటి నిర్ణయాలు తెరపైకి వచ్చే అవకాశం ఉందనేది ఇప్పుడు ఆసక్తిక్గా మారింది.

ఇంకా ఈ పిటిషన్ లో పలు కీలక విషయాలను ప్రాస్థావించారు. ఇందులో భాగంగా... నోటా కంటే తక్కువ ఓట్లు సాధించిన అభ్యర్థులను ఐదేళ్ల పాటు ఏ ఎన్నికల్లోనూ పోటీ చేయకుండా చూసేలా నిబంధనలు రూపొందించాలని ఆ పిటిషన్‌ లో పేర్కొన్నారు. అంతేకాకుండా నోటాను "కల్పిత అభ్యర్థి"గా చెబుతూ విస్తృత ప్రచారం కల్పించాలని తెలిపారు. ఈ అంశాలకు సంబంధించి తగిన నిబంధనలను రూపొందించేలా ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని పిటిషనర్ విజ్ఞప్తి చేశారు.

కాగా... పీపుల్స్‌ యూనియన్‌ ఫర్‌ సివిల్‌ లిబర్టీస్‌ వేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) తో 2013లో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు ఈవీఎం లలో నోటా ఆప్షన్‌ కల్పించిన సంగతి తెలిసిందే. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల్లో ఎవ్వరూ నచ్చకపోతే.. ఈ "నోటా" బటన్ నొక్కే సదుపాయం ఉంది.