'ఆ ఐదు రోజులు' పై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు!
మహిళలను మానసికంగా, శారీకరంగా బాగా ఇబ్బంది పెట్టే సమస్య.. ‘ఆ ఐదు రోజులు’. అంటే.. స్త్రీలు బహిష్టు (నెలసరి) ఉండే సమయం
By: Tupaki Desk | 8 July 2024 2:30 PM GMTమహిళలను మానసికంగా, శారీకరంగా బాగా ఇబ్బంది పెట్టే సమస్య.. ‘ఆ ఐదు రోజులు’. అంటే.. స్త్రీలు బహిష్టు (నెలసరి) ఉండే సమయం. ప్రతి నెలా నెలసరి సమయంలో తరచూ రక్తస్రావంతోపాటు, తీవ్రమైన కడుపునొప్పికి కూడా గురయ్యే మహిళలు ఉన్నారు. ముఖ్యంగా గృహిణులతో పోలిస్తే ఉద్యోగాలు చేసే మహిళలు, పాఠశాల, కాలేజీ విద్యార్థినులు నెలసరి వస్తే సమస్యలను ఎదుర్కొంటున్నారు.
నెలసరి సమయంలో ఉద్యోగాలు చేసే మహిళలకు సెలవులు ఇవ్వాలని, వారికి ప్రత్యేక మినహాయింపులు ఉండాలని ఎప్పటినుంచో డిమాండ్లు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం దేశంలో రెండు రాష్ట్రాలు మహిళలకు నెలసరి సెలవులు ఇస్తున్నాయని.. ఇదే విధానాన్ని మిగతా రాష్ట్రాల్లోనూ అమలు చేసేలా ఆదేశాలు ఇవ్వాలని ఒక వ్యక్తి సుప్రీం కోర్టులో వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. ఈ పిటిషన్ విచారణ సందర్భంగా దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.
నెలసరి సెలవులు ఇవ్వాలనేది మంచి నిర్ణయమే అయినప్పటికీ.. దానివల్ల మహిళలు ఉద్యోగ అవకాశాలకు దూరం అయ్యే ప్రమాదముందని అభిప్రాయపడింది. కాబట్టి విధానపరమైన నిర్ణయాల్లో తాము జోక్యం చేసుకోలేమని సుప్రీం కోర్టు వెల్లడించింది. ఈ నేపథ్యంలో మహిళా ఉద్యోగులకు నెలసరి సెలవులను తప్పనిసరి చేయాలంటూ దాఖలైన వ్యాజ్యాన్ని కొట్టేసింది. కాగా ఈ ఏడాది ఫిబ్రవరిలోనూ నెలసరి సెలవులపై పిటిషన్ దాఖలైంది. దానిపై విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు నిరాకరించిన విషయం తెలిసిందే.
ఈ పిటిషన్ పై భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. ఈ సందర్భంగా ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. మహిళలకు నెలసరి సెలవులు ఇస్తే వారు మరింత ఎక్కువగా ఉద్యోగాలు చేసేందుకు ప్రోత్సహించినట్లు అవుతుందని పేర్కొంది.
అయితే, మహిళలకు నెలసరి ఇవ్వాలని యాజమాన్యాలను బలవంతం చేస్తే అది కంపెనీల పనితీరుపై పడే ప్రమాదం ఉందని.. ఇతర ప్రతికూల పరిస్థితులకు దారితీయొచ్చని ధర్మాసనం అభిప్రాయపడింది. అంతేకాకుండా ‘నెలసరి’ సమస్యతో మహిళలకు యాజమాన్యాలు ఉద్యోగాలు కూడా ఇవ్వకపోవచ్చని తెలిపింది. మహిళలను ఉద్యోగాల్లో నియమించుకునే అవకాశాలు తగ్గిపోయే ప్రమాదముందని అభిప్రాయపడింది.
ఈ నేపథ్యంలో మహిళలకు ఉద్యోగాలపరంగా నష్టం జరగాలని తాము కోరుకోవడం లేదని సుప్రీంకోర్టు తెలిపింది. మహిళల ప్రయోజనాల కోసం చేసే ప్రయత్నాలు వారి భవిష్యత్తుకు అడ్డంకిగా మారే ప్రమాదముందని వెల్లడించింది.
అలాగే మహిళలకు నెలసరి సెలవులు ఇవ్వాలనేది విధానపరమైన నిర్ణయమని.. ఇది ప్రభుత్వాలు, ఆయా కంపెనీలు/పరిశ్రమలు/సంస్థలు తేల్చుకోవాల్సిన అంశమని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలతో కేంద్ర ప్రభుత్వం చర్చలు జరపాల్సి ఉంటుందని తెలిపింది. ఆ తర్వాత నెలసరి సెలవుల విషయంలో ఫ్రేమ్ వర్క్ ను రూపొందించే విషయంలో నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని వెల్లడించింది.
ఈ విషయంలో తాము కేంద్రానికి ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేమని.. పిటిషనర్ తన అభ్యర్థనను కేంద్ర మహిళ, శిశు సంక్షేమశాఖ దృష్టికి తీసుకెళ్లాలని సూచించింది. దానిపై ప్రభుత్వమే నిర్ణయం తీసుకుంటుందని స్పష్టం చేసింది.
ప్రస్తుతం దేశంలో బిహార్, కేరళ రాష్ట్రాలు మహిళలకు నెలసరి సెలవులు ఇస్తున్నాయి. బీహార్ ప్రభుత్వ ఉద్యోగినులకు రెండు రోజుల నెలసరి సెలవు ఇస్తుండగా, కేరళ విద్యార్థినులకు మూడు రోజుల లీవ్ ఇస్తోంది.