Begin typing your search above and press return to search.

అయ్యప్ప భక్తులకు ఉచిత బస్సు సౌకర్యం.. సుప్రీం రియాక్షన్ ఇదే

మామూలుగా అయితే.. ఇలాంటి ప్రాతిపాదనలకు ప్రభుత్వం ఓకే చెబుతుంది. కానీ.. కేరళలోని వామపక్ష ఏలుబడిలో ఉన్న ప్రభుత్వం మాత్రం ససేమిరా అంది.

By:  Tupaki Desk   |   26 Jan 2024 4:59 AM GMT
అయ్యప్ప భక్తులకు ఉచిత బస్సు సౌకర్యం.. సుప్రీం రియాక్షన్ ఇదే
X

ఎక్కడైనా ఉచితంగా అందిస్తాం.. సేవ చేస్తామని అడిగితే.. ఎవరైనా సరే అంటారు. కానీ.. కేరళ రాష్ట్రంలోని కమ్యునిస్టుల పాలన అందుకు భిన్నం. దేశ వ్యాప్తంగా ఉన్న కోట్లాది అయ్యప్ప భక్తులు తమ నమ్మకంలో భాగంగా శబరిమల యాత్రను చేపట్టటం తెలిసిందే. ఇందులో భాగంగా శబరిమలకు చేరుకునే వారు.. సరైన రవాణా సదుపాయం లేక కిందా మీదా పడటం తెలిసిందే. ఇలాంటి వేళ.. భక్తులకు ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పిస్తామని విశ్వహిందూ పరిషత్ ఒక ప్రతిపాదనను ప్రభుత్వం ముందు ఉంచింది.

మామూలుగా అయితే.. ఇలాంటి ప్రాతిపాదనలకు ప్రభుత్వం ఓకే చెబుతుంది. కానీ.. కేరళలోని వామపక్ష ఏలుబడిలో ఉన్న ప్రభుత్వం మాత్రం ససేమిరా అంది. దీంతో.. దీనిపై కేరళ హైకోర్టును ఆశ్రయించారు. అయితే.. ఆ పిటిషన్ ను కేరళ హైకోర్టు కొట్టేసింది. దీంతో ఈ పిటిషన్ ను సుప్రీంకోర్టు ముందుంచింది విశ్వహిందూ పరిషత్. అయ్యప్ప భక్తులకు కేరళ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నడుపుతున్న బస్సులు సరిపోవటం లేదని.. దీంతో భక్తులు పెద్ద ఎత్తున సమయాన్ని నష్టపోతున్నట్లుగా విశ్వ హిందూ పరిషత్ వాదిస్తోంది.

అందుకు పరిష్కారంగా బస్సులు నడిపే అవకాశం తమకు ఇస్తే.. తాము ఉచితంగా బస్సు సౌకర్యాన్ని కల్పిస్తామని పేర్కొంది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు స్పందించి.. దీనిపై సమాధానం చెప్పాలంటూ కేరళ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. మరి.. తన సమాధానంగా కేరళ ప్రభుత్వం ఏం చెబుతుందో చూడాలి. అమ్మ పెట్టా పెట్టదు.. అడక్క తినానీయ్యదంటే ఇదేనేమో? అన్న వ్యాఖ్యలు సోషల్ మీడియాలో దర్శనమివ్వటం గమనార్హం.