20 ఏళ్లకు హైకోర్టు తీర్పు.. ఊపిరి పీల్చుకున్న హిమానీ.. ఇమామీ సంస్థలు
అమ్మకపు పన్ను వివాదానికి సంబంధించిన కేసులపై తాజాగా తెలంగాణ హైకోర్టు తీర్పును ఇచ్చింది
By: Tupaki Desk | 14 July 2024 1:30 PM GMTఅమ్మకపు పన్ను వివాదానికి సంబంధించిన కేసులపై తాజాగా తెలంగాణ హైకోర్టు తీర్పును ఇచ్చింది. అయితే.. ఈ వివాదం దాదాపు ఇరవై ఏళ్ల క్రితం షురూ కావటం గమనార్హం. ఇప్పుడైతే జీఎస్టీ ఉంది కానీ.. ఈ పన్ను చట్టం అమల్లోకి రాక ముందు అమ్మకపు పన్ను (వ్యాట్) ఉండేది. దానికి ముందు వేరే చట్టం ఉండేది. తాజాగా తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పుతో ప్రముఖ వాణిజ్య ఉత్పత్తుల కంపెనీలైన హిమామీ.. ఇమామీలకు ఊరట లభించింది. అసలు వివాదం ఎలా మొదలైందంటే..
హిమానీ.. ఇమామీ కంపెనీలకు చెందిన నవరత్న ఆయిల్.. గోల్డ్ టర్మరిక్ ఆయుర్వేదిక్ క్రీమ్.. బోరోప్లస్ యాంటీ సెప్టిక్ క్రీమ్.. బోరో ప్లస్ ప్రిక్లీహీట్ పౌడర్.. సోనా చాందీ చవన్ ప్రాశ్ లాంటి ఉత్పత్తులు సౌందర్య సాధనాలుగా పేర్కొంటూ వాటికి ఆదాయ పన్ను చెల్లించాలన్న అంశంపై మొదలైన పోరు.. దాదాపు రెండు దశాబ్దాల పాటు సుదీర్ఘంగా సాగింది. తాజాగా ఈ కంపెనీల వాదనల్ని పరిగణలోకి తీసుకున్న కోర్టు.. వీటిని ఔషధాలుగా పేర్కొంది. సదరు కంపెనీలు తమ ఉత్పత్తులు ఔషధాలుగా పేర్కొంటే.. సేల్స్ ట్యాక్స్ విభాగం కేసులు వేసింది.
2004లో చోటు చేసుకున్న దీనిపై ఇమామీ.. హిమానీ కంపెనీలు న్యాయపోరుకు నడుం బిగించాయి. తొలుత ఈ వివాదం సేల్స్ ట్యాక్స్ అప్పిలేట్ ట్రైబ్యునల్ ముందుకు వెళ్లటం.. ఈ కంపెనీలకు చెందిన కొన్ని ఉత్పత్తులు (బోరోప్లస్ యాంటీ సెప్టిక్ క్రీమ, బోరోప్లస్ ప్రిక్లీ హీట్ పౌడర్, సోనాచాందీ చవన్ ప్రాశ్ లు) మాత్రమే ఔషధాలుగా.. మరికొన్నింటిని (నవరత్న ఆయిల్.. గోల్డ్ టర్మరిక్ తదితర) సౌందర్య ఉత్పత్తులుగా పేర్కొంది.
దీనిపై ఆ కంపెనీలు హైకోర్టును ఆశ్రయించాయి. ఇరు వర్గాల మధ్య సుదీర్ఘ న్యాయపోరు జరిగింది. తాజాగా ఈ కేసుల్ని విచారించిన జస్టిస్ పి. శ్యాంకోశీ.. జస్టిస్ ఎన్ తుకారాంజీలతో కూడిన ధర్మాసనం కీలక తీర్పును ఇచ్చింది. సౌందర్య ఉత్పత్తులుగా గుర్తిస్తే 20 శాతం పన్నును సదరు కంపెనీలు చెల్లించాల్సి ఉంటుంది. అదే ఔషధాలుగా గుర్తిస్తే 10 శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు.. అన్ని అంశాల్ని పరిగణలోకి తీసుకొని సదరు ఉత్పత్తుల్ని ఔషధ ఉత్పత్తులుగా పేర్కొంటూ తీర్పును ఇచ్చింది. దీంతో.. ఈ రెండు కంపెనీలకు తాజా తీర్పు ఊరట ఇచ్చిందన్న మాట వినిపిస్తోంది.