Begin typing your search above and press return to search.

15 ఏళ్ల తర్వాత కూల్చివేతలా? హైడ్రా దూకుడుకు హైకోర్టు ప్రశ్నలు

హైదరాబాద్ లో ఇప్పుడు ఏ నోట విన్నా.. హైడ్రానే.. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మానస పుత్రిక హైడ్రా.

By:  Tupaki Desk   |   21 Aug 2024 4:30 PM GMT
15 ఏళ్ల తర్వాత కూల్చివేతలా? హైడ్రా దూకుడుకు హైకోర్టు ప్రశ్నలు
X

హైదరాబాద్ లో ఇప్పుడు ఏ నోట విన్నా.. హైడ్రానే.. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మానస పుత్రిక హైడ్రా. హైదరాబాద్ డిసాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్ దీని పూర్తి పేరు. పేరుకు తగ్గట్టే హైదరాబాద్‌ లో ప్రస్తుతం హైడ్రా ఎఫెక్ట్ నడుస్తోంది. జీహెచ్ ఎంసీతో పాటు నగర శివార్లలోని మున్సిపాలిటీలు, గ్రామాల్లోనూ హైడ్రా ఆపరేషన్ కొనసాగుతోంది. అక్రమ కట్టడాలపై హైడ్రా బుల్డోజర్లను ప్రయోగిస్తోంది. చెరువులు, పార్కులు, లే అవుట్లలో సామాజిక అవసరాల కోసం కేటాయించిన స్థలాలు, పరిశ్రమల శాఖకు చెందిన స్థలాల్లో ఆక్రమణలను అడ్డుకుంటోంది. అయితే, గత ఆదివారం తెల్లవారుజామునే రంగంలోకి దిగి గండిపేట మండంలోని బడా బడా వ్యక్తుల నిర్మాణాలను పడగొట్టింది. తదుపరి లక్ష్యం జంట జలాశయాలు హిమాయత్ సాగర్-గండిపేట పరిరక్షణకు ఉద్దేశించిన జీవో111 నిబంధనలను ఉల్లంఘించి చేపట్టిన నిర్మాణాల కూల్చివేత అనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దీంతో వాటి సమీపంలోని జన్వాడలో ఉన్న ఫాం హౌస్ ను కూల్చొద్దంటూ ప్రదీప్ రెడ్డి అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో కోర్టు పలు కీలక ప్రశ్నలు వేసింది.

హైడ్రా పరిధులు ఏమిటి?

అసలు హైడ్రా పరిధులు ఏమిటి? అంటూ అదనపు అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ)ని హైకోర్టు ప్రశ్నించింది. కూల్చివేతలు ఏమిటని నిలదీసింది. దీనికి సమాధానంగా ఏఏజీ స్పందిస్తూ.. హైడ్రా ఒక స్వతంత్ర ప్రతిపత్తి గల సంస్థ అని తెలిపారు. దీంతో స్థలం కొనుక్కున్నవారు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేసుకుంటారు కదా.. స్థానిక సంస్థల అనుమతితోనే నిర్మాణాలు చేపడతారు కదా..? 15-20 సంవత్సరాల తర్వాత హైడ్రా వచ్చి అక్రమం అంటూ కూల్చివేస్తే ఎలా? అంటూ హైకోర్టు ప్రశ్నించింది.

చెరువుల పరిరక్షకే హైడ్రా

హైడ్రా హైదరాబాద్ మహా నగర పరిధిలో చెరువుల పరిరక్షణకే ఏర్పాటైందని ఏఏజీ హైకోర్టుకు తెలిపారు. ప్రదీప్ రెడ్డి అనే వ్యక్తి వేసిన పిటిషన్ కు విచారణ అర్హత లేదని పేర్కొన్నారు. జన్వాడలో ఉన్న ఫాం హౌస్ జీవో 111 పరిధిలోకి వస్తుందన్రు. దీని పరిధిలోని భూములు, ఫాంహౌజ్ లను నీటి పారుదల శాఖ చూస్తోందని వివరించారు. వీటిని కూల్చివేసే హక్కు హైడ్రాకు లేదన్నారు. అయితే కూల్చివేతలపై చర్చించాల్సి ఉందని హైకోర్టు పేర్కొంది.