హైకోర్టు : ఆదేశాలా ? అంతిమతీర్పా ?
ఖైరతాబాద్ నుండి గెలిచిన దానం నాగేందర్ కాంగ్రెస్ తరపున సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేసి కూడా ఓడిపోయాడు.
By: Tupaki Desk | 8 Aug 2024 6:22 AM GMTబీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగా గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు విషయంలో హైకోర్టులో దాఖలైన పిటీషన్ పై ఇరుపక్షాల నుండి సుధీర్ఘ వాదనలను విన్న ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది. ఈ నేపథ్యంలో హైకోర్టు ఎమ్మెల్యేల అనర్హత మీద తీర్పు ఇస్తుందా ? లేక స్పీకర్ కు ఆదేశాలు జారీచేస్తుందా ? అన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. ఏ క్షణమైనా ఈ తీర్పు బయటకు వచ్చే అవకాశం ఉంది.
బీఆర్ఎస్ నుండి గెలిచిన పది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఖైరతాబాద్ నుండి గెలిచిన దానం నాగేందర్ కాంగ్రెస్ తరపున సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేసి కూడా ఓడిపోయాడు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకునేలా స్పీకర్‌కు ఆదేశాలివ్వాలని బీఆర్ఎస్ దాఖలు చేసిన పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టులో జస్టిస్ విజయసేన్‌రెడ్డి బెంచ్ విచారణ చేపట్టి తీర్పును రిజర్వ్ లో పెట్టింది.
పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన ఎమ్మెల్యేలపై వచ్చిన ఫిర్యాదులపై నిర్ణయం తీసుకునేందుకు స్పీకర్ కు నిర్ధిష్ట గడువు విధిస్తూ ఉత్తర్వులు ఇస్తామని హైకోర్టు వెల్లడించింది. అయితే స్పీకర్ కు కోర్టులు ఆదేశాలు జారీచేయరాదని అడ్వకేట్ జనరల్ వాదించారు. సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారం ఎమ్మెల్యేలపై మూడునెలల లోపు పరిష్కరించాలని బీఆర్ఎస్ తరపు న్యాయవాదులు వాదించారు. ఈ నేపథ్యంలో ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది.
ప్రధానంగా ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావుల మీద వచ్చిన ఫిర్యాదులపై కోర్టులో వాదనలు నడిచాయి. ఈ సంధర్భంగా మణిపూర్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాలలో అక్కడి కోర్టులు వెలువరించిన తీర్పులను హైకోర్టుకు విన్నవించారు. మరి హైకోర్టు ఎలాంటి ఉత్తర్వులు ఇస్తుందా ? అన్న దాని మీదనే అందరూ దృష్టి సారించారు.