వివేకా హత్యకేసులో ఉదయ్ కి బెయిల్... కండిషన్ అప్లై!
ఆంధ్రప్రదేశ్ లో అత్యంత సంచలనమైన మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది.
By: Tupaki Desk | 21 Aug 2024 7:19 AM GMTఆంధ్రప్రదేశ్ లో అత్యంత సంచలనమైన మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇందులో భాగంగా.. ఈ కేసులో అరెస్టైన వారిలో ఒకరైన గజ్జల ఉదయ్ కుమార్ రెడ్డికి బెయిల్ మంజూరు చేసింది హైకోర్టు. ఉదయ్ కుమార్ బెయిల్ పిటిషన్ బుధవారం హైకోర్టులో విచారణకు వచ్చింది! ఈ సమయంలో అతనికి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది ఉన్నత న్యాయస్థానం.
అవును... మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బాబాయ్, మాజీ మంత్రి వైఎస్ వివేకా కేసులో ఏ6 నిందితుడిగా అరెస్టైన ఉదయ్ కుమార్ రెడ్డికి హైకోర్టు ధర్మాసనం షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఈ మేరకు ప్రతీవారం పులివెందుల పోలీస్ స్టేషన్ కు రిపోర్ట్ చేయాలని ఆదేశించింది. ఇదే క్రమంలో సాక్ష్యులను ప్రభావితం చేయకూడదని స్పష్టం చేసింది తెలంగాణ హైకోర్టు.
ఆగస్టు 14న జరిగిన గత విచారణలో గజ్జల ఉదయ్ కుమార్ రెడ్డి సాక్ష్యులను ప్రభావితం చేయడమే కాకుండా బెదిరింపులకు సైతం పాల్పడ్డాడని తెలంగాణ హైకోర్టుకు సీబీఐ స్పష్టం చేసింది! ఇదే సమయంలో... ఈ కేసులో దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి, ఎంపీ అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్లు సుప్రీంలో పెండింగ్ లో ఉన్నాయని సునీత తరుపు న్యాయవాది హైకోర్టుకు విన్నవించారు.
ఈ నేపథ్యంలో... గజ్జల ఉదయ్ కుమార్ రెడ్డికి బెయిల్ మంజూరు చేయవద్దని హైకోర్టును సునీతతో పాటు సీబీఐ అభ్యర్థించింది. ఇదే క్రమంలో ఉదయ్ కుమార్ పిటిషన్ లో వైఎస్ సునీత ఇంప్లీడ్ అయ్యారు. ఈ పిటిషన్ పై ఇరు వైపు వాదనలు ముగిసిన అనంతరం తెలంగాణ హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. ఈ నేపథ్యంలో... ఉదయ్ కుమర్ కు తెలంగాణ హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.