తిరుమలలో శారదా పీఠం కట్టడాల కూల్చివేత? షాకిచ్చిన హైకోర్టు
విశాఖ శారదా పీఠానికి హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. తిరుమలలో శారదా పీఠం నిర్మిస్తున్న భవనాల కూల్చివేతకు ఆదేశిస్తామని ఉన్నత న్యాయస్థానం వెల్లడించింది.
By: Tupaki Desk | 23 Jan 2025 5:21 AM GMTవిశాఖ శారదా పీఠానికి హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. తిరుమలలో శారదా పీఠం నిర్మిస్తున్న భవనాల కూల్చివేతకు ఆదేశిస్తామని ఉన్నత న్యాయస్థానం వెల్లడించింది. గత ప్రభుత్వంలో నిబంధనలు ఉల్లంఘించి తిరుమల గోగర్భం డ్యాంకు ముప్పు తెచ్చేలా భవనాలు నిర్మించారని హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిపై విచారించిన హైకోర్టు అనుమతులు లేని నిర్మాణాలను ఉపేక్షించడానికి వీలు లేదని స్పష్టం చేసింది. ఈ కేసులో తామిచ్చే తీర్పు భవిష్యత్తులో అక్రమ నిర్మాణాలపై చర్యలకు ఒక ఉదాహరణగా నిలుస్తుందని తెలిపింది.
తిరుమలలో వేద పాఠశాల, వైద్యశాల నిర్మిస్తామని గత ప్రభుత్వం హయాంలో టీటీడీకి విశాఖ శారదాపీఠం దరఖాస్తు చేసుకుంది. దీంతో గోగర్భం డ్యాం సమీపంలో భూములను అప్పటి టీటీడీ బోర్డు కేటాయించింది. అయితే టీటీడీ నుంచి భూములు తీసుకున్న శారదాపీఠం.. ఇచ్చిన స్థలం ఎక్కవ భూమిని ఆక్రమించి నిబంధనలు అతిక్రమించి సెట్ బ్యాక్ లేకుండా భవనాలు నిర్మించింది. దీనిపై అప్పట్లో టీటీడీకి ఫిర్యాదులు వెళ్లినా పట్టించుకోలేదన్న విమర్శలు వినిపించాయి. విశాఖ శారదా పీఠాధిపతి గత ప్రభుత్వ పెద్దలకు బాగా సన్నిహితంగా మెలగడంతో అధికారులు సైతం అక్రమాలను చూస్తూ ఏమీ చేయలేకపోయారు.
అయితే దీనిపై తిరుమల క్షేత్రాల రక్షణ సమితి అధ్యక్షుడు, ప్రముఖ న్యాయవాది ఓంకార్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ పై విచారించిన హైకోర్టు గత ఏడాది ఇదే సమయంలో భవన నిర్మాణాలపై స్టే విధించింది. అదేవిధంగా భవన నిర్మాణాలపై సమగ్ర నివేదిక ఇవ్వాలని టీటీడీ అధికారులను ఆదేశించింది. ఇంతలో రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతో శారద పీఠం అక్రమాలపై అధికారులు ఉన్నది ఉన్నట్లు హైకోర్టుకు నివేదిక సమర్పించారు. దీనిపై తాజాగా హైకోర్టులో విచారణ జరగ్గా, అక్రమ నిర్మాణాలపై హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది.
అనుమతులు లేని నిర్మాణాలను ఉపేక్షించడానికి వీల్లేదని తేల్చి చెప్పింది. ఆ భవనాల కూల్చివేతకు ఆదేశాలిస్తామని హెచ్చరించింది. ప్లానుకు విరుద్ధంగా నిర్మాణాలు ఎలా చేపడతారంటూ ప్రశ్నించిన ధర్మాసనం, అనుమతులు లేకుండా భవన నిర్మాణాలు జరిపితే ఏం జరుగుతుందో ఈ కేసు ఒక ఉదాహకరణ కావాలని వ్యాఖ్యానించింది. అయితే ఈ కేసుపై కౌంటర్ వేసేందుకు అవకాశమివ్వాలని శారదాపీఠం తరపు న్యాయవాదిని కోర్టు అభ్యర్థించడంతో అందుకు అనుమతిస్తూ విచారణను హైకోర్టు వాయిదా వేసింది.