తులసిబాబు బెయిల్ పిటీషన్ వాయిదా
అయితే ఈ కేసులో ఇంప్లీడ్ అయ్యేందుకు రఘురామ పిటిషన్ దాఖలు చేయడంతో ఆయన తరపున వాదనలు వినేందుకు ఈ నెల 20వ తేదీకి కేసును వాయిదా వేశారు.
By: Tupaki Desk | 17 Jan 2025 9:52 AM GMTడిప్యూటీ స్పీకర్ రఘురామపై కస్టోడియల్ టార్చర్ కేసులో నిందితుడు కామేపల్లి తులసిబాబు బెయిల్ పిటీషనును హైకోర్టు వాయిదా వేసింది. ఈ కేసులో బాధితుడు రఘురామరాజు ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేయడంతో న్యాయస్థానం అనుమతించింది.
రఘురామపై థర్డీ ప్రయోగించిన కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కామేపల్లి తులసిబాబు ఈ నెల 8న అరెస్టు అయ్యారు. ఆ రోజు తులసిబాబును విచారించిన ప్రకాశం జిల్లా ఎస్పీ దామోదర్ నిందితుడిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచగా, 14 రోజుల రిమాండ్ విధిస్తూ న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. దీంతో తనకు బెయిల్ ఇవ్వాల్సిందిగా అభ్యర్థిస్తూ నిందితుడు ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఈ కేసులో ఇంప్లీడ్ అయ్యేందుకు రఘురామ పిటిషన్ దాఖలు చేయడంతో ఆయన తరపున వాదనలు వినేందుకు ఈ నెల 20వ తేదీకి కేసును వాయిదా వేశారు.
నిందితుడికి వ్యతిరేకంగా ఎలాంటి ఆధారాలు లేవని, పోలీసులు సరైన సాక్ష్యాధారాలు సేకరించడంలో విఫలమయ్యారని తులసిబాబు తరఫు న్యాయవాదులు వాదించారు. తులసిబాబుకు బెయిల్ ఇవ్వాల్సిందిగా కోర్టును అభ్యర్థించారు. అయితే పోలీసు విచారణలో తులసిబాబు సహకరించలేదని, అతడిని పోలీసు కస్టడీకి అప్పగించాలనే పిటిషన్ సెషన్స్ కోర్టు విచారిస్తున్నందున ఈ దశలో బెయిల్ ఇవ్వవద్దని ప్రభుత్వ న్యాయవాది పోశాని వెంకటేశ్వర్లు వాదించారు. మరోవైపు ప్రతివాది రఘురామ తరపు వాదనలు వినిపించిన న్యాయవాది వి.వి.లక్ష్మీనారాయణ తమ వాదనలు వినిపించేందుకు సోమవారానికి కేసును వాయిదా వేయాలని కోర్టును కోరారు.
గతంలో రాజద్రోహం కేసులో అరెస్టు అయిన అప్పటి వైసీపీ ఎంపీ, ప్రస్తుత డిప్యూటీ స్పీకర్ రఘురామపై పోలీసు కస్టడీలో ప్రైవేటు వ్యక్తులు దాడి చేశారని గుంటూరు నగరంపాలెం పోలీసులు కేసు ఫైల్ చేశారు. ఈ కేసులో ఏ1గా అప్పటి సీఐడీ ఏఎస్పీ విజయపాల్ ను అరెస్టు చేయగా, అప్పటి సీఐడీ డీజీ సునీల్ కుమారు అనుచరుడైన తులసిబాబు పోలీసులతో కలిసి రఘురామపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. దీంతో ఈ నెల 8న ప్రధాన నిందితుడు విజయపాల్ తో కలిపి తులసిబాబును ప్రకాశం ఎస్పీ దామోదర్ విచారించారు. తులసిబాబుకు వ్యతిరేకంగా బలమైన ఆధారాలు ఉండటంతో అరెస్టు చేశారు.