Begin typing your search above and press return to search.

లాయర్ ఉజ్వల్ నికమ్.. కేసు టేకప్ చేస్తే ఎదుటోళ్లు అంతే!

రీల్ లో చూసే కొన్ని పాత్రలు రియల్ గా కనిపిస్తే కాస్తంత ఆశ్చర్యం.. అంతకు మించిన ఆసక్తి వ్యక్తమవుతూ ఉంటుంది.

By:  Tupaki Desk   |   22 Aug 2024 4:30 AM GMT
లాయర్ ఉజ్వల్ నికమ్.. కేసు టేకప్ చేస్తే ఎదుటోళ్లు అంతే!
X

రీల్ లో చూసే కొన్ని పాత్రలు రియల్ గా కనిపిస్తే కాస్తంత ఆశ్చర్యం.. అంతకు మించిన ఆసక్తి వ్యక్తమవుతూ ఉంటుంది. వ్యవస్థలో చెడ్డవాళ్లు ఎప్పుడూ ఎక్కువగా వార్తల్లో కనిపిస్తుంటారు. కొందరు రియల్ లైఫ్ హీరోలు వార్తల్లోకి రారు. తెర వెనుక తమ పని తాము చేసుకుంటూ పోతుంటారు. అలాంటి వారికి కొన్నిసార్లు ఒక్కసారి వార్తల్లోకి వచ్చి.. వారేంటో.. వారి సత్తా ఏమిటో అందరికి తెలిసేలా చేస్తుంది. తాజాగా అలాంటి పరిస్థితే సీనియర్ న్యాయవాది కం పద్మశ్రీ పురస్కార గ్రహీత ఉజ్వల్ నికమ్.

మహారాష్ట్రకు చెందిన ఈ అడ్వకేట్ కేసు టేకప్ చేస్తే.. విషయం మరో లెవల్ కు వెళుతుంటుంది. దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన ఎన్నో కేసుల్ని వాదించిన అనుభవం ఆయన సొంతం. సీరియస్ కేసుల్ని ఆయన టేకప్ చేస్తే అయితే ఉరి లేదంటే యావజ్జీవ కారాగార శిక్ష పడే పరిస్థితి. ఇంతకూ ఆయన ప్రస్తావన ఇప్పుడెందుకు వచ్చింది? అన్న ప్రశ్న మదిలో మెదలొచ్చు.

దీనికికారణం.. మహారాష్ట్రంలో తీవ్ర ప్రజాహాగానికి దారి తీసిన బద్లాపూర్ దురాగతానికి సంబంధించి బాధితుల తరఫున కేసును టేకప్ చేయటంతో ఆయన పేరు ఇప్పుడు మారుమోగుతోంది. దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన బద్లాపూర్ ఉదంతానికి సంబంధించి ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. మహారాష్ట్రలోని ఒక స్కూల్లో చదివే ఇద్దరు చిన్నారులు (వారి వయసు మూడు.. నాలుగేళ్లు మాత్రమే) టాయిలెట్ కు వెళ్లగా.. స్కూల్లో పని చేసే స్వీపర్ వారిద్దరిపై లైంగిక దాడి చేయటం సంచలనంగా మారింది.

ప్రైవేటు పార్టుల వద్ద నొప్పిగా ఉందని చిన్నారుల్లో ఒకరు తన పేరెంట్స్ కు చెప్పారు. స్కూల్ కు వెళ్లమంటే భయంతో వణికిపోతున్న వారి తీరుపై అనుమానం చెందిన తల్లిదండ్రులు వైద్యుల వద్దకు తీసుకెళ్లారు. అక్కడే బాధిత చిన్నారులపై లైంగిక దాడి జరిగిన విషయాన్ని గుర్తించారు. ఈ ఉదంతంపై కేసు నమోదు చేసే విషయంలో పోలీసులు సైతం నిర్లక్ష్యంగా వ్యవహరించటం తీవ్ర ఆగ్రహానికి గురైంది. స్కూల్ యాజమాన్యం సైతం ఈ ఉదంతాన్ని బయటకు రాకుండా ఉండేందుకు ప్రయత్నించటం విమర్శలు వెల్లువెత్తాయి. మహారాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ ఛైర్ పర్సన్ సైతం ఈ ఉదంతంపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.

ఈ కేసును తాజాగా ఉజ్వల్ చేతికి అప్పజెప్పారు. దీంతో.. నిందితులకు తీవ్ర శిక్ష ఖాయమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. దీనికి కారణం లాయర్ ఉజ్వల్ ట్రాక్ రికార్డు అలాంటిది. ఎన్నో సంచలన కేసుల్ని టేకప్ చేయటమే కాదు నిందితులకు తీవ్రమైన శిక్షలు పడేలా చేస్తారన్న పేరుంది. 1993 ముంబయి సీరియల్ బాంబు పేలుళ్లు.. టి సిరీస్ మ్యూజిక్ సంస్థ అధినేత గుల్షన్ కుమార్ మర్డర్ కేసు.. 2008లో ముంబయి దాడుల కేసుల్లో నిందితులను జైలుకు పంపటంలో కీ రోల్ ప్లే చేశారు.

అజ్మల్ కసబ్ ఉరి శిక్షకు కారణం ఆయన వాదనలే. పూనమ్ తండ్రి ప్రమోద్ మహాజన్ హత్య కేసును ఆయనే వాదించారు. 2006లో కుటుంబ కలహాల కారణంగా తన సోదరుడు ప్రవీణ్ చేతిలోనే హత్యకు గురయ్యారు. ఈ కేసులో ప్రవీణ్ కు 2007లో జీవితఖైదు విధించారు. 2013లో ముంబయి గ్యాంగ్ రేప్ కేసు.. 2016లో కోపర్దీ గ్యాంగ్ రేప్ కేసు ఇలా ఎన్నో సంచలన కేసుల్ని ఆయన టేకప్ చేశారు. ఇదిలా ఉంటే ఈ మధ్యన ముగిసిన ఎంపీ ఎన్నికల్లో ముంబయి నార్త్ సెంట్రల్ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా ఉజ్వల్ ను బరిలోకి దించారు. అయితే.. కాంగ్రెస్ అభ్యర్థి వర్ష ఏక్ నాథ్ గైక్వాడ్ మీద పోటీ చేసి ఓటమిపాలయ్యారు. ఇది మినహా ప్రొఫెషనల్ గా ఆయనకు ఎదురుదెబ్బలే లేని పరిస్థితి