Begin typing your search above and press return to search.

వంశీకి ఎదురుదెబ్బ.. ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేత

గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీ మోహన్ కు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది.

By:  Tupaki Desk   |   20 Feb 2025 7:24 AM GMT
వంశీకి ఎదురుదెబ్బ.. ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేత
X

గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీ మోహన్ కు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి సందర్భంగా కంప్యూటర్ ఆపరేటర్ సత్యవర్థన్ ను దూషించిన కేసులో ఆయన ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకున్నారు. దీనిపై విచారణ జరిపిన ఉన్నత న్యాయస్థానం శుక్రవారం తీర్పు వెలువరించింది. వంశీ ముందస్తు బెయిల్ పిటిషన్ ను కొట్టివేసింది.

దళిత యువకుడు సత్యవర్థన్ ను ఇదే కేసు ఉపసంహరించుకోవాలని ఒత్తిడి చేస్తూ కిడ్నాప్ చేశారని వంశీపై పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం విజయవాడ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న వంశీ.. సత్యవర్థన్ కేసు ఉపసంహరించుకోవడంతో కేసును క్వాష్ చేయాలని హైకోర్టును ఆశ్రయించాలని భావించినట్లు చెబుతున్నారు. అయితే సత్యవర్థన్ కుటుంబ సభ్యులు ఎదురు తిరగడంతో కిడ్నాప్ కేసులో అరెస్టు కావాల్సివచ్చింది. ఇప్పుడు ఈ కేసులో ఆయనకు బెయిల్ వచ్చినా, ఎస్సీ, ఎస్టీ కేసులో పోలీసులు మళ్లీ ఆయనను అరెస్టు చేసే అవకాశాలు ఉన్నాయంటున్నారు.

గత ప్రభుత్వంలో నోటికొచ్చినట్లు మాట్లాడటంతో పాటు దాడులు, దౌర్జన్యాలతో వంశీ పేట్రేగిపోవడాన్ని ప్రస్తుత ప్రభుత్వ పెద్దలు సీరియస్ గా భావిస్తున్నారు. ఈ కారణంతోనే అధికారంలోకి వచ్చిన నుంచి వంశీ చుట్టూ ఉచ్చు బిగించేలా పావులు కదిపారని అంటున్నారు. ముఖ్యంగా కార్యకర్తల నుంచి ఎక్కువ ఒత్తిడి ఉండటంతో వంశీని క్షమించాలని వచ్చిన వినతులను కూడా ప్రభుత్వం పట్టించుకోలేదని అంటున్నారు. దీంతో గత ప్రభుత్వంలో వంశీపై వచ్చిన ఆరోపణలపై ప్రభుత్వం విచారణ జరుపుతోంది. అయితే అనూహ్యంగా కిడ్నాప్ కేసులో చిక్కుకుని ఆయన అరెస్టు కావాల్సివచ్చిందని అంటున్నారు.