Begin typing your search above and press return to search.

వర్రా రవీందర్ రెడ్డికి 14 రోజుల రిమాండ్

ఈ కారణంగా ఆయనపై పలు కేసులు నమోదైనట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే కడప నుండి ఆయన్ను జగ్గయ్యపేటకు పోలీసులు తీసుకువచ్చారు.

By:  Tupaki Desk   |   12 March 2025 4:06 PM IST
వర్రా రవీందర్ రెడ్డికి 14 రోజుల రిమాండ్
X

వైఎస్సార్సీపీ సోషల్ మీడియా కన్వీనర్ వర్రా రవీందర్ రెడ్డికి జగ్గయ్యపేట కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. దీని అనంతరం ఆయన్ను ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట సబ్‌జైలుకు తరలించారు.

వర్రా రవీందర్ రెడ్డి గత ప్రభుత్వం హయాంలో చంద్రబాబు, పవన్ కల్యాణ్‌పై సామాజిక మాధ్యమాల్లో అనుచిత పోస్టులు పెట్టినట్లు ఆరోపణలు ఉన్నాయని, ఈ కారణంగా ఆయనపై పలు కేసులు నమోదైనట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే కడప నుండి ఆయన్ను జగ్గయ్యపేటకు పోలీసులు తీసుకువచ్చారు.

అదుపులోకి తీసుకునే ముందు, వర్రా రవీందర్ రెడ్డి మెడ నొప్పి ఉందని చెప్పి చికిత్స కోరారు. దీంతో ఆయనను కడప రిమ్స్‌కు తరలించి, వైద్య పరీక్షలు నిర్వహించారు. ఎక్స్‌రే, సీటీ స్కాన్, MRI వంటి పరీక్షలు చేసిన అనంతరం ఆయనకు ఎటువంటి ఆరోగ్య సమస్యలేమీ లేవని వైద్యులు నిర్ధారించారు. తుది నివేదిక వచ్చిన తర్వాత, జైలు అధికారులు వర్రాను చిల్లకల్లు పోలీసులకు అప్పగించారు.

బుధవారం ఉదయం వర్రా రవీందర్ రెడ్డిని కోర్టులో హాజరుపరిచారు. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలం చిల్లకల్లు పోలీసు స్టేషన్‌లో ఆయనపై బీఎన్ఎస్, ఐటీ యాక్ట్‌లోని పలు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లపై అసభ్యకరమైన పోస్టులు పెట్టారనే ఆరోపణలపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

ఇంతకుముందు, నవంబర్ 8న పులివెందులలో నమోదైన అట్రాసిటీ కేసుకు సంబంధించి వర్రా రవీందర్ రెడ్డి కడప జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. చిల్లకల్లు పోలీసులు పీటీ వారెంట్‌పై ఆయనను అదుపులోకి తీసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా వర్రా రవీందర్ రెడ్డిపై 40కి పైగా కేసులు నమోదైనట్లు సమాచారం.