ఇంకా సందిగ్దంలోనే వర్మ 'వ్యూహం'
వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ రూపొందించిన వ్యూహం సినిమా ఇప్పటికే విడుదల అవ్వాల్సి ఉంది.
By: Tupaki Desk | 22 Jan 2024 10:07 AM GMTవివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ రూపొందించిన వ్యూహం సినిమా ఇప్పటికే విడుదల అవ్వాల్సి ఉంది. సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకున్న ఈ సినిమా విడుదలను సవాలు చేస్తూ తెలుగుదేశం పార్టీ నాయకుడు నారా లోకేష్ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిన విషయం తెల్సిందే.
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రతిష్ఠను దెబ్బ తీసే విధంగా సినిమాను రూపొందించారని ఆరోపిస్తూ ఇప్పటికే జారీ చేసిన సెన్సార్ సర్టిఫికెట్ ను రద్దు చేయాలని లోకేష్ తన పిటిషన్ లో పేర్కొన్నట్లు తెలుస్తోంది. దాంతో ఇప్పటికే సెన్సార్ సర్టిఫికెట్ పై మూడు వారాల స్టే విధించింది హైకోర్టు.
తాజాగా మరోసారి సెన్సార్ సర్టిఫికెట్ పై మరో మూడు వారాల స్టే విధిస్తూ కోర్టు నిర్ణయం తీసుకుంది. అదే సమయంలో మళ్లీ రివ్యూ చేసి రిపోర్ట్ ఇవ్వాలంటూ సెన్సార్ బోర్డ్ ని కోర్టు ఆదేశించింది. హై కోర్టు ఆదేశాలతో వ్యూహం సినిమాకు మళ్లీ రీ సెన్సార్ చేసే అవకాశాలు ఉన్నాయని సినీ వర్గాల ద్వారా తెలుస్తోంది.
వ్యూహం సినిమాను రెండు భాగాలుగా విడుదల చేస్తామని ఇప్పటికే వర్మ ప్రకటించారు. ఏపీ అధికార పార్టీ వైకాపాకు మద్దతుగా వర్మ ఈ సినిమా తీశాడు అనేది టీడీపీ ఆరోపణ. చంద్రబాబు నాయుడును విలన్ గా చూపిస్తూ వ్యూహం సినిమాను రూపొందించడం పై టీడీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై వర్మ ఎక్స్ ద్వారా బాహాటంగానే టీడీపీ నాయకులపై విమర్శలు చేస్తున్న విషయం తెల్సిందే.