Begin typing your search above and press return to search.

పెళ్లిలో సినిమా పాట‌ల ప్ర‌ద‌ర్శ‌న‌కు కాపీ రైట్స్ కావాలా?

కాపీరైట్ సమస్యల కారణంగా పెళ్లిళ్లలో సినిమా పాటలను ప్లే చేయకూడ‌ద‌నే రూల్ ఇక లేద‌ని ప్ర‌భుత్వం వెల్ల‌డించింది

By:  Tupaki Desk   |   28 July 2023 4:12 AM GMT
పెళ్లిలో సినిమా పాట‌ల ప్ర‌ద‌ర్శ‌న‌కు కాపీ రైట్స్ కావాలా?
X

పెళ్లిళ్ల‌లో లేదా ఏదైనా ఫంక్ష‌న్ లో సినిమా పాట‌లు వినిపించ‌కుండా ఉంటాయా? భార‌తీయ సాంప్ర‌దాయంలో ఇది ఒక భాగం. ఏదైనా ఈవెంట్లో మాస్ కి ఉర‌క‌లెత్తే ఉత్సాహం ఇచ్చేది సినిమా పాట‌లే. ఇక అన్ని పెళ్లిళ్ల‌లో ఒకే విధంగా క్లాసిక‌ల్ సంగీతం మాత్ర‌మే వినిపించ‌దు.

మాస్‌కి ఊపు తెచ్చే పాట‌లు వినిపించాల్సిందే. తెలుగు రాష్ట్రాలు అయినా లేదా ఉత్త‌రాది రాష్ట్రాలు అయినా పెళ్లిళ్ల‌లో సినిమా పాట‌లు ప్లే చేయ‌డం వాటికి డ్యాన్సులు చేయ‌డం అన్న‌ది ఒక ఆచారంగా కొన‌సాగుతోంది.

అయితే ఉన్న‌ట్టుండి.. కాపీ రైట్స్ తీసుకోకుండా పెళ్లిలో మా పాట‌లు ఉప‌యోగించ‌వ‌ద్దు అంటూ ఏదైనా కండిష‌న్ ని హ‌క్కుదారు పెడితే ప‌రిస్థితేంటి? అయితే దీనికి కోర్టుల ప‌రిధిలో ప్ర‌జ‌ల‌కు స‌రైన జ‌వాబు ల‌భించింది. కాపీరైట్ సమస్యల కారణంగా పెళ్లిళ్లలో సినిమా పాటలను ప్లే చేయకూడ‌ద‌నే రూల్ ఇక లేద‌ని ప్ర‌భుత్వం వెల్ల‌డించింది.

తాజాగా కాపీరైట్ ఉల్లంఘన చట్టబద్ధంగా పరిగణించబడదని పేర్కొంటూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇంతకుముందు కాపీరైట్ చట్టం 1957లోని సెక్షన్ 52(1) ప్రకారం వివాహాలలో సంగీత రచనల ప్రదర్శన నుండి కాపీరైట్ సంఘాలు రాయల్టీని తీసుకునేవి.

ప్రమోషన్ పరిశ్రమ అలాగే వాణిజ్య విభాగం (DPIIT) సెక్షన్ 52(1)(za) మతపరమైన వేడుకలో ఏదైనా సంగీత ప్ర‌క్రియ‌ని ప్రదర్శించడం కాపీరైట్ సమస్య కాదని పేర్కొంది.

వివాహాలు మతపరమైన వేడుకలో అంతర్భాగంగా పరిగణించబడుతున్నందున కాపీరైట్ ఉల్లంఘన చట్టాలు ఇక్కడ వర్తించవని ప్ర‌భుత్వం పేర్కొంది. ఈ నిర్ణ‌యాత్మ‌క‌మైన ఆలోచ‌న‌ ప్ర‌జ‌ల‌కు ఎంతో ఉప‌యుక్త‌మైన‌ది. సినిమా సంగీతానికి రాయ‌ల్టీలు ఇచ్చి పెళ్లిలో ఉప‌యోగించుకోవాల్సిన అవ‌స‌రం ఇక లేదు.