Begin typing your search above and press return to search.

ఆ రాష్ట్రంలో.. ‘ఆ రోజులకూ’ సెలవులు!

ఈ పిటిషన్‌ విచారణ సందర్భంగా దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.

By:  Tupaki Desk   |   25 July 2024 8:21 AM GMT
ఆ రాష్ట్రంలో.. ‘ఆ రోజులకూ’ సెలవులు!
X

మహిళలను మానసికంగా, శారీకరంగా బాగా ఇబ్బంది పెట్టే సమస్య.. ‘ఆ ఐదు రోజులు’. అంటే.. స్త్రీలు బహిష్టు (నెలసరి) ఉండే సమయం. ప్రతి నెలా నెలసరి సమయంలో తరచూ రక్తస్రావంతోపాటు, తీవ్రమైన కడుపునొప్పికి కూడా గురయ్యే మహిళలు ఉన్నారు. ముఖ్యంగా గృహిణులతో పోలిస్తే ఉద్యోగాలు చేసే మహిళలు, పాఠశాల, కాలేజీ విద్యార్థినులు నెలసరి వస్తే సమస్యలను ఎదుర్కొంటున్నారు.

నెలసరి సమయంలో ఉద్యోగాలు చేసే మíß ళలకు సెలవులు ఇవ్వాలని, వారికి ప్రత్యేక మినహాయింపులు ఉండాలని ఎప్పటినుంచో డిమాండ్లు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం దేశంలో రెండు రాష్ట్రాలు మహిళలకు నెలసరి సెలవులు ఇస్తున్నాయని.. ఇదే విధానాన్ని మిగతా రాష్ట్రాల్లోనూ అమలు చేసేలా ఆదేశాలు ఇవ్వాలని ఒక వ్యక్తి సుప్రీం కోర్టులో వ్యాజ్యాన్ని దాఖలు చేసిన సంగతి తెలిసిందే.

ఈ పిటిషన్‌ విచారణ సందర్భంగా దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. నెలసరి సెలవులు ఇవ్వాలనేది మంచి నిర్ణయమే అయినప్పటికీ.. దానివల్ల మహిళలు ఉద్యోగ అవకాశాలకు దూరం అయ్యే ప్రమాదముందని అభిప్రాయపడింది. కాబట్టి విధానపరమైన నిర్ణయాల్లో తాము జోక్యం చేసుకోలేమని సుప్రీం కోర్టు వెల్లడించింది. ఈ నేపథ్యంలో మహిళా ఉద్యోగులకు నెలసరి సెలవులను తప్పనిసరి చేయాలంటూ దాఖలైన వ్యాజ్యాన్ని కొట్టేసింది. ఈ విషయంలో తాము కేంద్రానికి ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేమని.. పిటిషనర్‌ తన అభ్యర్థనను కేంద్ర మహిళ, శిశు సంక్షేమశాఖ దృష్టికి తీసుకెళ్లాలని సూచించింది. దానిపై ప్రభుత్వమే నిర్ణయం తీసుకుంటుందని స్పష్టం చేసింది.

అయితే సుప్రీంకోర్టు నిర్ణయం ఎలా ఉన్నప్పటికీ ఛత్తీస్‌ గఢ్‌లోని హిదయతుల్లా నేషనల్‌ లా యూనివర్సిటీ (హెచ్‌ఎల్‌యూ) సంచలన నిర్ణయం తీసుకుంది. విద్యార్థినులకు బహిష్టు (పీరియడ్స్‌) సెలవులను అమలు చేస్తున్నట్టు ప్రకటించింది. జూలై ఒకటి నుంచి ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని వెల్లడించింది.

యువ విద్యార్థినుల ఆరోగ్యాన్ని, సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని బహిష్టు సెలవులు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నామని హిదయతుల్లా నేషనల్‌ లా యూనివర్సిటీ తెలిపింది. వర్సిటీ చేపట్టిన ‘హెల్త్‌ షీల్డ్‌’ కార్యక్రమంలో భాగంగా పీరియడ్స్‌ సెలవులను అందుబాటులోకి తెచ్చినట్టు పేర్కొంది.

కాగా హిదయతుల్లా నేషనల్‌ లా యూనివర్సిటీ ప్రకారం,, విద్యార్థినులు క్యాలెండర్‌ నెలలో ఒక రోజు పీరియడ్స్‌ సెలవు తీసుకోవచ్చు. అలాగే భవిష్యత్తులో పరీక్షలు ఉన్న రోజుల్లోనూ ఇటువంటి ప్రత్యేక సెలవులు మంజూరు చేసే అంశాన్ని పరిశీలిస్తున్నారు. క్రమరహిత ఋతుస్రావం పీసీఓఎస్‌ (పాలిసిస్టిక్‌ ఓవరీ సిండ్రోమ్‌) వంటి రుగ్మతలు ఉన్నవారికి సెమిస్టర్‌ లో ఆరు రోజుల వరకు సెలవులు ఇస్తారు.

కాగా గతేడాది జనవరిలో కేరళలోని కొచ్చిన్‌ యూనివర్శిటీ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ దేశంలోనే తొలిసారిగా పీరియడ్స్‌ సెలవులను అమల్లోకి తెచ్చింది. దీని తర్వాత పంజాబ్‌ యూనివర్శిటీ ఆఫ్‌ చండీగఢ్, గువాహటి యూనివర్శిటీ ఆఫ్‌ అస్సాం, నల్సార్‌ యూనివర్శిటీ (హైదరాబాద్‌), అస్సాంలోని తేజ్‌ పూర్‌ యూనివర్శిటీలు కూడా ఇదే బాటలో నడిచాయి.

కాగా ప్రస్తుతం దేశంలో బీహార్, కేరళ రాష్ట్రాలు మహిళలకు నెలసరి సెలవులు ఇస్తున్నాయి. బీహార్‌ ప్రభుత్వ ఉద్యోగినులకు రెండు రోజుల నెలసరి సెలవు ఇస్తుండగా, కేరళ.. విద్యార్థినులకు మూడు రోజుల లీవ్‌ ఇస్తోంది.