Begin typing your search above and press return to search.

సెకండ్‌ సమ్మర్‌; వర్షాకాలంలో ఈ ఎండలేంది?

By:  Tupaki Desk   |   6 July 2015 4:46 AM GMT
సెకండ్‌ సమ్మర్‌; వర్షాకాలంలో ఈ ఎండలేంది?
X
ఎండ మండుతోంది. ఉదయం పదకొండు గంటలప్పుడు రోడ్డు మీదకు చురుకుపడుతోంది. జులై నెలలో పని చేయకుండా ఉండే ఏసీలు ఇప్పుడు అదే పనిగా పని చేస్తున్న పరిస్థితి. పెరిగి ఉష్ణోగ్రతలతో.. జులై సెకండ్‌ సమ్మర్‌గా మంటలు పుట్టిస్తోంది.

తెలుగు రాష్ట్రాల్లో ఈసారి వర్షాలు తక్కువేనంటూ వాతావరణ శాఖ ఇచ్చిన ముందస్తు అంచనాలు వమ్ము అయ్యాయన్న విధంగా జూన్‌లో కురిసిన వర్షాలు.. వాతావరణం చల్లబడటాన్ని చూసిన చాలామంది సంతోషంతో ఉక్కిరిబిక్కిరి అయ్యారు. మే నెలలో కాసిన ఎండ మంట తగ్గినట్లేనని సంబరపడ్డారు. అయితే.. అదేమీ నిజం కాదన్న విషయం ఇప్పుడిప్పుడే అర్థమవుతోంది.

గత పది రోజుల వ్యవధిలో రెండు తెలుగు రాష్ట్రాల్లో భానుడు తన ప్రతాపం ప్రదర్శిస్తున్నానరు.జూలై నెలలో ఉండే సగటు ఉష్ణోగ్రతలకు భిన్నంగా ఎండలు మండుతున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎండల తీవ్రతకు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. సగటు ఉష్ణోగ్రత కంటే దాదాపుగా నాలుగు నుంచి ఆరు డిగ్రీల ఉష్ణోగ్రత అధికంగా నమోదు కావటం గమనార్హం.

కొన్ని ప్రాంతాల్లో ఎండ తీవ్రత 40 ప్లస్‌ టచ్‌ కావటం ఆందోళన కలిగించే అంశం. తెలంగాణ.. ఏపీ రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 38 నుంచి 41 మధ్యన నమోదు కావటం చూసినప్పుడు.. సెకండ్‌ సమ్మర్‌ షురూ అయినట్లుగా కనిపిస్తోంది.

ఆదివారం నమోదైన ఉష్ణోగ్రతలు చూస్తే.. కడపలో 41.. రాజమండ్రిలో 40.5.. ఒంగోలు 40.2 నమోదు కాగా.. తిరుపతి (40).. విశాఖపట్నం (39.4).. గుంటూరు.. శ్రీకాకుళంలలో 39 డిగ్రీలు నమోదు అయ్యాయి.

ఇక.. తెలంగాణజిల్లాల్లో మహబూబ్‌నగర్‌లో 38.. హైదరాబాద్‌లో 36.2.. ఖమ్మం.. నిజామాబాద్‌.. అదిలాబాద్‌.. రామగుండం.. కరీంనగర్‌.. వరంగల్‌ జిల్లాల్లో 36 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైన పరిస్థితి. చల్లగా ఉండాల్సిన సమయంలో ఎండ మంట పెరిగిపోవటంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.

తాజా వాతావరణ పరస్థితుల్లో మరికొన్ని రోజులు ఎండ తీవ్రత తప్పదని చెబుతున్నారు. ప్రస్తుతం బలహీనంగా ఉన్న రుతుపవనాలు మళ్లీ బలపడే వరకూ ఇలాంటి పరిస్థితి తప్పదని హెచ్చరిస్తున్నారు. అనుకోని విధంగా మొదలై ఎండ తీవ్రత నేపథ్యంలో.. స్కూలుకెళ్లే చిన్నారుల విషయంలోనూ.. వృద్ధుల విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ విషయంలో ఏ మాత్రం నిర్లక్ష్యం చేసినా... లేని పోని సమస్యలు ఎదురుకావటం కాయం. బీ కేర్‌ ఫుల్‌..!