"మన్మథుడు" సాంగ్ చైనా యువత ఎక్కువగా వింటున్నారా?
అవును... చైనా యువత పెళ్లి చేసుకోవాలనే ఆలోచన నుంచి దూరం దూరం జరుగుతున్నారనే చర్చ మొదలైంది
By: Tupaki Desk | 6 Aug 2024 4:07 AM GMT"మన్మథుడు" సినిమాలో "వద్దురా సోదరా పెళ్లంటే నూరేళ్ల మంటరా... డోంట్ మేరీ - బీ హ్యాపీ" అనే పాటలోని అక్షరాలను, అర్ధాలనూ చైనా యువత బాగా ఫాలో అవుతున్నట్లున్నారు. వారంతా మూకుమ్మడిగా "పెళ్లి వద్దు" అని ఫిక్సయినట్లు చెబుతున్నారు. దీంతో... ప్రభుత్వ అధికారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారని తెలుస్తోంది.
అవును... చైనా యువత పెళ్లి చేసుకోవాలనే ఆలోచన నుంచి దూరం దూరం జరుగుతున్నారనే చర్చ మొదలైంది. ప్రధానంగా దేశంలో ఉద్యోగవకాశాలు రోజు రోజుకీ తగ్గుతుండటమే దీనికి కారణం అని అంటున్నారు. జాబ్ లో సెటిల్ అయ్యాకే వివాహం చేసుకోవాలనే ఆలోచనతో దేశంలో వివాహాల సంఖ్య క్రమంగా తగ్గుతోందన్ని అంటున్నారు.
2014 తర్వాత నుంచి వివాహాల సంఖ్య తగ్గుతూ వస్తోందని.. దీనికి తోడు కోవిడ్ మహమ్మరి అనంతరం కూడా ఈ వివాహా సంఖ్య క్రమంగా తగ్గిందని చైనా అధికారులు చెబుతున్నారు. దేశంలో ఈ ఏడాది మొదటి ఆరు నెలల్లో 34 లక్షల జంటలు మాత్రమే ఒకటయ్యాయని చెబుతున్నారు. ఇది గత ఏడాదితో పోలిస్తే సుమారు 4.98 లక్షలు తక్కువని అంటున్నారు.
వాస్తవానికి గతంలో అత్యధిక జనాభా కలిగిన దేశాల్లో చైనా మొదటిస్థానంలో ఉన్న సంగతి తెలిసిందే. అయితే... అనంతరం జనాభా నియంత్రణ చర్యలకు ఉపక్రమించింది చైనా. దీంతో... చైనాలోని జనాభా సంఖ్య క్రమంగా తగ్గుతోంది. ఈ క్రమక్రమంగా జననాల సంఖ్య తగ్గడంతో భారత్ ఫస్ట్ ప్లేస్ లోకి వచ్చింది.
ఈ నేపథ్యంలో జననాల రేటు పడిపోతుండటంతో మరోవైపు వృద్ధుల సంఖ్య పెరుగుతోంది. ఈ నేపథ్యంలో అక్కడ పెళ్లిళ్లు కూడా తగ్గుముఖం పడుతున్నాయి. ఇవన్నీ ప్రభుత్వ అధికారులను తీవ్ర ఆందోళనలోకి నెట్టేస్తున్నాయని అంటున్నారు. పైగా పెళ్లిల్ల విషయంలో రోజు రోజుకీ యువత దృక్పథం మారిపోతుండటంతో... ముందు ముందు మరింత తగ్గే అవకాశాలున్నాయని చెబుతున్నారు.
కాగా... గత కొన్నేళ్లుగా చైనాలో జననాల రేటు తగ్గిపోతుండటంతో ఆందోళన వ్యక్తం చేసిన ప్రభుత్వం దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా... పెళ్లిళ్లు చేసుకునేవారికి, పిల్లల్ని కనేవారికీ ప్రోత్సాహకాలను ప్రకటిస్తున్నాయి. ఇలా ఎన్ని ప్రోత్సాహకాలు ఇచ్చినా.. పెళ్లి విషయంలో మాత్రం యువత ముందుకు రావడం లేదని అంటున్నారు.