కార్ల తయారీలో కొత్త సంచలనం... విన్ ఫాస్ట్!
అవును... వియత్నాంకు చెందిన ఓ కంపెనీ న్యూయార్క్ స్టాక్ మార్కెట్ లో లిస్టింగ్ రోజునే రికార్డ్ సృష్టించింది.
By: Tupaki Desk | 17 Aug 2023 12:30 AM GMTఅమెరికా మార్కెట్ లో కార్లతయారీ విషయంలో జనరల్ మోటార్స్, ఫోర్డ్ లే కీలకం అనే సంగతి తెలిసిందే. ప్రస్తుతం కార్లతయారీలో అగ్రదేశ మార్కెట్ ను ఈ రెండు కంపెనీలూ ఏలుతున్నాయి. ఈ నేపథ్యంలో అమెరికా మార్కెట్ లో సరికొత్త రికార్డులను సృష్టించింది వియత్నా కార్ల కంపెనీ!
అవును... వియత్నాంకు చెందిన ఓ కంపెనీ న్యూయార్క్ స్టాక్ మార్కెట్ లో లిస్టింగ్ రోజునే రికార్డ్ సృష్టించింది. ఇందులో భాగంగా జనరల్ మోటార్స్, ఫోర్డును వెనక్కి నెట్టేసింది. ఈ రెండు కంపెనీల మార్కెట్ విలువను దాటేసింది. ఈ షేర్లను కొన్న ఇన్వెస్టర్లకు తొలిరోజే 255 శాతం లాభాలు రావడం గమనార్హం!
ఆ ఎలక్ట్రిక్ కార్ల కంపెనీ పేరు "విన్ ఫాస్ట్". వియత్నాంకు చెందిన ఎలక్ట్రిక్ కార్ల తయారీ కంపెనీ స్పెషల్ పర్పస్ అక్విజేషన్ కంపెనీ (ఎస్పీఏసీ) ఒప్పందం కింద న్యూయార్క్ లోని నాస్ డాక్ లో లిస్టింగ్ అయింది. ఈ సందర్భంగా కంపెనీ షేర్ల విలువ 255 శాతం పెరిగి కంపెనీ ఛైర్మన్ ఫామ్ నాట్ వుంగ్ సంపదకు 39 బిలియన్ డాలర్లను జోడించింది.
ఈ ఒక్క దెబ్బతో విన్ ఫాస్ట్ మార్కెట్ విలువ జనరల్ మోటార్స్, మెర్సిడెస్ బెంజ్, ఫోర్డును దాటేసింది. ఫలితంగా ఫామ్ నాట్ వుంగ్ సంపద 44.3 బిలియన్ డాలర్లకు చేరింది. దీంతో వుంగ్ వియత్నాంలో అత్యంత సంపన్నుడిగా నిలిచాడు.
ప్రస్తుతం స్టార్టప్ లు సంప్రదాయ షేర్ల విక్రయ మార్గం కాకుండా.. ఎస్పీఏసీ మార్గాన్ని ఎంచుకొంటున్నాయి. అంటే... స్టాక్ ఎక్స్ ఛేంజి లో లేని కంపెనీని.. స్టాక్ ఎక్స్ ఛేంజి లో ఉన్న కంపెనీతో విలీనం చేయడమన్నమాట.
కాగా... ఫామ్ నాట్ వుంగ్ 2017లో సింగపుర్ కేంద్రంగా విన్ ఫాస్ట్ ను ప్రారంభించారు. ఇది ఆయన వ్యాపార సామ్రాజ్యమైన విన్ గ్రూప్ లో ఓ భాగం!