Begin typing your search above and press return to search.

మూవీ రివ్యూ : 'ఎబిసిడి'

By:  Tupaki Desk   |   17 May 2019 7:50 AM GMT
మూవీ రివ్యూ : ఎబిసిడి
X
చిత్రం : ఎబిసిడి

నటీనటులు - అల్లు శిరీష్ - రుక్షర్ ధిల్లాన్ - భరత్ - నాగబాబు - భరత్ - కోట శ్రీనివాసరావు - రాజా - శుభలేఖ సుధాకర్ - వెన్నెల కిషోర్ తదితరులు
సంగీతం - జుదా సంధి
ఛాయాగ్రహణం - రామ్
సంభాషణలు - కళ్యాణ్ రాఘవ్
ఎడిటింగ్ - నవీన్ నూలి
నిర్మాతలు - మధుర శ్రీధర్ రెడ్డి - యష్ రంగినేని
సమర్పణ - సురేష్ ప్రొడక్షన్స్
దర్శకత్వం - సంజీవ్ రెడ్డి

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తమ్ముడిగా మెగా కాంపౌండ్ నుంచి వచ్చిన హీరోగా శిరీష్ కు ప్రేక్షకుల్లో ఓ బ్రాండింగ్ ఉంది కాని ప్రత్యేకమైన ఇమేజ్ అంటూ ఏదీ లేదు. అయినా తనను తాను ఋజువు చేసుకునే క్రమంలో పరిశ్రమలో అడుగు పెట్టిన ఐదేళ్ల నుంచి శిరీష్ ఏదో ఒక ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. మార్కెట్ వీక్ గా ఉన్నా పైన చెప్పిన రెండు అంశాలు బిజినెస్ పరంగా హెల్ప్ అవుతూ ఇక్కడి దాకా తీసుకొచ్చాయి. ఎలాగూ స్ట్రెయిట్ సబ్జెక్ట్స్ వర్క్ అవుట్ కావడం లేదని గుర్తించిన శిరీష్ ఈసారి సేఫ్ గేమ్ కోసం మలయాళం హిట్ మూవీ రీమేక్ ను ఎంచుకున్నాడు. పోస్టర్ మొదలుకుని ట్రైలర్ దాకా ఇదేదో ఎంటర్ టైనర్ లా ఉండే అన్న ఇంప్రెషన్ కలిగించిన ఎబిసిడి (అమెరికన్ బార్న్ కన్ఫ్యూస్డ్ దేశీ) అల్లుకున్న కనీస అంచనాలకు తగ్గట్టు ఉందా లేదా రివ్యూలో చూద్దాం పదండి

కథ:

అమెరికాలో పుట్టిపెరిగిన అరవింద్ అలియాస్ అవి(అల్లు శిరీష్)మల్టీ మిలియనీర్ ఎన్ఆర్ఐ విద్యాప్రసాద్(నాగబాబు) వారసుడు.ఒకే ఒక్క సంతానం కావడంతో విచ్చలవిడి లైఫ్ కు అలవాటు పడి డబ్బుని మంచి నీళ్లలా ఖర్చు పెట్టడం అలవాటు చేసుకుంటాడు. ఇందులో ప్రమాదాన్ని గుర్తించిన విద్యాప్రసాద్ అవికి డబ్బు విలువ తెలియాలనే ఉద్దేశంతో నెలకు కేవలం ఐదు వేల ఖర్చుతో ఎంబిఎ చదవడం కోసం ఇండియా పంపిస్తాడు. తోడుగా అవితో పాటు అత్త కొడుకు బాలషణ్ముగం ఉరఫ్ బాషా (భరత్)కూడా వెళ్తాడు. కాలేజీలో నేహా(రక్సర్ థిలాన్)తో పరిచయం ప్రేమగా మారుతుంది. అవి తనుండే బస్తీ ప్రజల కోసం స్థానిక వర్ధమాన రాజకీయ నాయకుడు భార్గవ్(రాజా సిరివెన్నెల)తో తలపడే పరిస్థితి వస్తుంది. అవి కథ ఏ మలుపులు తిరిగింది నాన్న కోరుకున్నది జరిగిందా లేదా అనేది తెరమీద చూసి తెలుసుకోవాల్సిందే

కథనం - విశ్లేషణ:

అల్లు శిరీష్ కున్న అతి పెద్ద ప్లస్సు మైనస్సు అసలు ఏ ఇమేజ్ లేకపోవడం. ఇతని నుంచి ఎలాంటి సినిమా ఆశించాలి అనే క్లారిటీ ప్రేక్షకులకూ లేదు కాబట్టి కథల పరంగా ఎలాంటి రిస్క్ అయినా తీసుకునే ఛాన్స్ దొరికింది. అందుకే గత సినిమా ఒక్క క్షణంకు రిస్క్ చేసి మరీ టిపికల్ సబ్జెక్ట్ ఎంచుకున్నాడు. టేకింగ్ లోపాల వల్ల వ్రతమూ చెడింది ఫలితమూ దక్కలేదు. ఎబిసిడిలో అలాంటి రిస్క్ ఏమి లేదు. ఓ ప్రవాసాంధ్ర కుర్రాడు అమెరికా నుంచి వచ్చి చేతిలో డబ్బులు లేకుండా ఇక్కడ పడే కష్ఠాల నుంచి ఫన్ పుట్టించడం అనేది నిజానికి కొత్తది కాదు. నువ్వొస్తానంటే నేనొద్దంటానాలో సిద్దార్థ్ పాత్ర ద్వారా ప్రభుదేవా బోలెడు కామెడీతో పాటు మంచి ఎమోషన్ దట్టించి సక్సెస్ అయ్యాడు. అందులో బ్యాక్ డ్రాప్ పల్లెటూరు ఉంటే ఇందులో సెటప్ మొత్తం సిటీలో ఉంటుంది. అదే ప్రధానమైన తేడా. అవి పాత్ర ఇండియాకు వచ్చాక ఎలాంటి ఇబ్బందులు పడబోతోందనే తతంగం ఊహలకు అనుగుణంగానే సాగుతుంది కాబట్టి వీలైనంత నవ్వించి ఎంగేజ్ చేసేలా దర్శకుడు సంజీవ్ రెడ్డి రచయిత కళ్యాణ్ రాఘవ్ కథనాన్ని సంభాషణలను రాసుకున్నారు. కానీ అందులో పూర్తిగా సక్సెస్ కాలేకపోయారు

ఎక్కడికక్కడ సీన్లు ఫ్రెష్ గానే అనిపిస్తాయి. అలా అని చాలా బాగున్నాయే అనే ఫీలింగూ కలిగించవు. కొన్ని నవ్వులు పూసినా పదే పదే గుర్తు పెట్టుకునే స్థాయిలో ఏదీ లేకపోవడం ఎబిసిడిలో ప్రధాన లోపం. దీన్నో డీసెంట్ ఎంటర్ టైనర్ గా తీర్చిదిద్దడానికి సంజీవ్ రెడ్డి చాలా ప్రయత్నాలు చేశాడు. కమర్షియల్ ఎలిమెంట్స్ కోసం హీరో స్థానిక రాజకీయ యువ నాయకుడితో క్లాష్ పెట్టుకోవడం అనే పాయింట్ వినడానికి బాగానే ఉన్నా తెరమీద బ్యాడ్ రైటింగ్ వల్ల తేలిపోయింది. ఆర్థిక శాఖా మంత్రి కొడుకు రాజకీయ వారసత్వం కోసం ఓ దినపత్రిక పెట్టె కాంటెస్ట్ గెలవడానికి తన స్థాయికి తగని పనులు చేయడం ఏ మాత్రం అతకలేదు .

పైగా హీరోని ఎలివేట్ చేయడానికి ఇవన్ని బలవంతంగా ఇరికించిన ఫీలింగ్ కలగడంతో విలన్ ట్రాక్ భరించలేని ప్రహసనంగా మారిపోయింది. ఒక ఎన్ఆర్ఐ బస్తీ ప్రజల అభిమానం సంపాదించుకోవడం అనే థీమ్ ని ఎమోషనల్ గా రాసుకున్నప్పుడే ప్రేక్షకులు కనెక్ట్ అవుతారు. కాని దాన్ని లైటర్ వీన్ గా టచ్ చేయడంతో అదంతా కృత్రిమంగా సాగుతుంది. పైగా అల్లు శిరీష్ కు యాక్టింగ్ పరంగా ఉన్న నెగటివ్స్ కొన్ని ఇక్కడ ప్రభావం చూపడంతో సన్నివేశాల్లోని బలం దెబ్బ తింది .

కథలో రాసుకున్న సబ్ ప్లాట్స్ చాలా మటుకు సిల్లీగా ఉన్నాయి. లక్షకు మూడు లక్షలు ఇస్తారు అనగానే గుడ్డిగా హీరో వెళ్లి డబ్బులు ఇచ్చేయడం ఏ మాత్రం కన్విన్సింగ్ గా లేదు. ఇంటర్వెల్ ముందు వచ్చే హీరో విలన్ క్లాష్ కూడా ఇదే తరహలో రాసుకోవడంతో ఎగ్జైట్ మెంట్ కు బదులు ఇంతేనా అనే ఫీలింగ్ కలుగుతుంది. ఇది సరిగా ఎస్టాబ్లిష్ కాకపోవడంతో తర్వాత ఇద్దరి మధ్య జరిగే డ్రామా పండలేదు. దానికి తోడు అవి పాత్ర పడే కష్టాలను మరీ డ్రమాటిక్ గా చూపించడం అతకలేదు. దీని వల్ల సినిమా రిలీజ్ కు ముందు సూపర్ హిట్ అయిన మెల్లమెల్లగా సాంగ్ సైతం నీరసంగా సాగుతుంది.

ఇదంతా ఒక ఎత్తు అయితే చివరి నలభై నిమిషాల ముందు ప్రారంభమయ్యే ప్రముఖ దినపత్రిక యూత్ ఐకాన్ కాంటెస్ట్ వ్యవహారం మొత్తం ఫోర్స్ గా ఉండటంతో క్లైమాక్స్ కోసం ఎదురు చూడటం తప్ప ఏమి చేయలేని పరిస్థితి నెలకొంటుంది. ఇవన్ని చాలదు అన్నట్టు హీరోతో చివర్లో స్టేజి మీద నిమిషాల తరబడి స్పీచులు ఇప్పించడం తేడా కొట్టేసింది. ఇక్కడ అల్లు శిరీష్ మెచ్యుర్డ్ యాక్టింగ్ చూడొచ్చు. అది కొంత వరకు కాపాడింది. కామెడీ చాలా మటుకు సంభాషణలలో వీక్ నెస్ వల్ల అక్కడక్కడా తప్ప ఎక్కడా పెద్దగా నవ్వించలేదు. కాకపోతే మరీ భరించలేనిదిగా కాకుండా ఏదో సాగుతోందో అనే తరహాలో సాగడం ఒక్కటే ఎబిసిడి విషయంలో ఊరట కలిగించేది

నటీనటులు:

అల్లు శిరీష్ గత సినిమాలతో పోలిస్తే బాగా ఇంప్రూవ్ అయ్యాడు. పరిణితి కనిపించింది. కొన్ని చోట్ల మినహాయిస్తే దాదాపు సినిమా మొత్తాన్ని మోసే బాద్యతను చక్కగా నిర్వర్తించాడు. డాన్సులు సోసోగానే ఉన్నా డైలాగ్ డెలివరీలో పరిణితి వచ్చింది. ఎక్స్ ప్రెషన్స్ పరంగానూ మార్పును చూడవచ్చు. రుక్సన్ ధిల్లాన్ లుక్స్ పరంగా బాగుంది. పెద్దగా లోపాలు ఎంచడానికి ఏమి లేదు. కొన్ని మంచి సీన్స్ పడ్డాయి. చైల్డ్ ఆర్టిస్ట్ గా టాలీవుడ్ లో పాపులారిటీ ఉన్న మాస్టర్ భరత్ కు ఇందులో హీరోతో సమానంగా ట్రావెల్ చేసే పాత్ర దొరికింది కానీ అతని క్యాలిబర్ ని గొప్పగా చెప్పుకునే అవకాశం ఇచ్చేలా పాత్ర లేకపోవడం జస్ట్ ఓకే అనిపించే ఫీల్ కలిగిస్తుంది.

మెయిన్ విలన్ గా చేసిన రాజా (సిరివెన్నెల గారి అబ్బాయి)అంతగా పాత్రకు సూట్ అవ్వలేదు. ఫ్యూచర్ మినిస్టర్ పాత్రలో బరువు ఎక్కువవడంతో మోయలేకపోయాడు. వేరే ఆప్షన్ చూసుకుని ఉంటే బాగుండేది. నాగబాబుది అలవాటైన పాత్రే. హీరో ఊహించి చెప్పే చిన్న ఫ్లాష్ బ్యాక్ లో మాత్రం కొన్ని నవ్వులు పూయిస్తాడు. శుభలేఖ సుధాకర్-కోట శ్రీనివాసరావు లాంటి సీనియర్లు ఉన్నా ఒకటి రెండు సీన్లకే పరిమితం. టీవీ యాంకర్ గా వెన్నెల కిషోర్ కొంత నవ్వించే ప్రయత్నం చేశాడు. వీళ్ళు తప్ప మరీ చెప్పుకోదగ్గ తారాగణం ఇంకెవరు లేరు

సాంకేతిక వర్గం:

దర్శకుడు సంజీవ్ రెడ్డి తీసుకున్న రీమేక్ థీమ్ బాగానే ఉంది దాన్ని తెలుగు ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా రాసుకోవడంలో మాత్రం అంతగా సక్సెస్ కాలేకపోవడంతో ఎబిసిడి సగటు సినిమాలాగే అనిపిస్తుంది తప్ప శిరీష్ కు బ్రేక్ ఇచ్చే అవకాశాలు తక్కువే. ఇలాంటి కథల్లో లాజిక్స్ అవసరం ఉన్నా లేకపోయినా సబ్ ప్లాట్స్ మధ్య ఉండాల్సిన బలమైన థ్రెడ్స్ చాలా తేలికైన ట్రీట్మెంట్ తో రాసుకోవడంతో ఇందులో ఏ ప్రత్యేకత లేకుండా పోయింది. కామెడీ మీదే ఎక్కువగా ఆధారపడే ఇలాంటి సినిమాలకు కావాల్సిన ఎంటర్ టైన్మెంట్ ఫ్యాక్టర్ బాలన్స్ తప్పడంతో ఎబిసిడి రొటీన్ గా మారిపోయింది. చేసుకున్న మార్పులు తొలగించిన సన్నివేశాలు ఏవి హెల్ప్ కాలేకపోయాయి.

జుదా శాండీ సంగీతం మెల్లమెల్లగా పాటకే పరిమితం. అవసరానికి మించిన హోరుతో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ని చాలా చోట్ల చెడగొట్టాడు. కొన్నిచోట్ల ఫీల్ కూడా మిస్ అయ్యింది. రామ్ సినిమాటోగ్రఫీ పనితనం మెచ్చుకోవచ్చు. చక్కని యాంగిల్స్ తో తక్కువ బడ్జెట్ లోనే వీలైనంత రిచ్ లుక్ వచ్చేలా సెట్ చేసుకున్న మెప్పిస్తుంది. నవీన్ నూలి ఎడిటింగ్ ఇంకొంచెం షార్ప్ గా ఉంటే సెకండ్ హాఫ్ లో కాంటెస్ట్ తాలుకు భారం తగ్గేది. కళ్యాణ్ రాఘవ్ సంబాషణలు చాలా మాములుగా ఉన్నాయి. ఇలాంటి కథలకు బలంగా ఉండాల్సిన కలం దీని విషయంలో బలహీనతగా మారి అవుట్ పుట్ ని దెబ్బ తీసింది. కీలకమైన సన్నివేశాలు తెలిపోవడానికి కారణం కూడా ఇదే. ముగ్గురు నిర్మాతల కలయిక అయినప్పటికీ బడ్జెట్ ని చాలా తెలివిగా ప్లాన్ చేసుకుని ఎక్కువ ఖర్చు పెట్టకుండా మేనేజ్ చేసుకున్నారు.

ఎబిసిడి మంచి ప్రయత్నమే కాని ఒక డీసెంట్ ఎంటర్ టైనర్ గా నిలిచే అవకాశాన్ని పూర్తిగా వాడుకోలేకపోయింది. మరీ విసిగించే అంశాలు ఎక్కువగా లేకపోయినా ప్రహసనంలా సాగే ఎపిసోడ్స్ వల్ల పూర్తి స్థాయిలో ఎంగేజ్ చేయలేక ఓ మాములు సినిమాగా మిగిలిపోయింది. జస్ట్ ఓకే అనిపించే సగటు కామెడీని జనం ఇప్పుడు నవ్వుకుని ఆస్వాదించే స్థితిలో లేరు. హత్తుకునే ఎమోషన్స్ ఉంటే తప్ప ప్రేక్షకులు సినిమాకు కనెక్ట్ కావడం లేదు. ఇలాంటి ట్రెండ్ లో వీటిని పూర్తిగా బాలన్స్ చేయలేకపోయిన ఎబిసిడి నుంచి సాధ్యమైనంత తక్కువ అంచనాలతో ఛాయస్ గా పెట్టుకోవడం బెటర్

చివరగా: ఎబిసిడి - హంగామా ఓకే కాని విషయం వీకే

రేటింగ్ : 2.25/5

Disclaimer : This Review is An Opinion of One Person. Please Do Not Judge The Movie Based On This Review And Watch Movie in Theatre