Begin typing your search above and press return to search.

లేఖ పేరుతో నేరుగా సీన్లోకి చిరు ఎందుకొచ్చినట్లు?

By:  Tupaki Desk   |   10 Aug 2021 4:30 AM GMT
లేఖ పేరుతో నేరుగా సీన్లోకి చిరు ఎందుకొచ్చినట్లు?
X
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికల ఎపిసోడ్ పలు మలుపులు తిరుగుతున్న సంగతి తెలిసిందే. అంతకంతకూ టీవీ సీరియల్ గా మారుతున్న వైనంలో తాజాగా మెగాస్టార్ చిరంజీవి ఎంట్రీ ఇవ్వటం.. లేఖ రాసి.. ఎన్నికల్ని వెంటనే జరపాలన్న డిమాండ్ ను వినిపించటం తెలిసిందే. క్రమశిక్షణ సంఘానికి పెద్దగా ఉన్న రెబల్ స్టార్ క్రిష్ణంరాజుకు చిరు లేఖ రాశారు. ఇప్పటివరకు ‘మా’ పిక్చర్ లో తెర వెనుక మాత్రమే ఉండి పావులు కదిపే అలవాటున్నట్లు చెప్పే చిరంజీవి.. తన తీరుకు భిన్నంగా సీన్లోకి నేరుగా ఎంట్రీ ఎందుకు ఇచ్చినట్లు? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది.

ఎవరెన్ని చెప్పినా.. ‘మా’ ఎన్నికల్లో తిరుగులేని ఆధిక్యత మెగాస్టార్ చిరుదే. గత ఎన్నికల్లో గెలుపొందిన నరేశ్ విజయం వెనుక కూడా చిరునే ఉన్నారని చెబుతారు. రెండేళ్ల క్రితం జరిగిన ‘మా’ ఎన్నికల పోలింగ్ వేళ.. చిరు ఓటు వేసేందుకు వచ్చినప్పుడు.. నరేశ్ ఆయన పక్కనే ఉండటం..ఓటు వేసిన తర్వాత.. అందరూ బాగా పని చేయండి అంటూ పెద్దరికం మాటను చెప్పి వెళ్లిన చిరు.. ఈ రోజు అందుకు భిన్నంగా లేఖ రాసేసి నేరుగా ఎంట్రీ ఇవ్వటం ఇప్పుడు పలువురిని విస్మయానికి గురి చేస్తోంది.

ఈ మధ్యనే ఎన్నికలు నిర్వహించాలని కోరుతూ నటి హేమ ఒక ఆడియో క్లిప్ ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఆ ఆడియోలో ప్రస్తుత అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న నరేశ్ పై తీవ్ర విమర్శలు చేయటం.. అందుకు ఆయన ఘాటుగా రిప్లై ఇచ్చి.. చర్యలు తీసుకుంటామని చెప్పటం తెలిసిందే. ఇలాంటివేళ.. అనూహ్యంగా తెర మీదకు వచ్చిన చిరంజీవి.. క్రమశిక్షణ సంఘంలో కీలకభూమిక పోపిస్తున్న క్రిష్ణం రాజును.. ఎన్నికల్ని వెంటనే నిర్వహించాలని చిరు కోరటం చూస్తే.. ఈ విషయాన్ని మరింతకాలం నాన్చటం ఎవరికి మంచిది కాదన్నట్లుగా ఉందని చెబుతున్నారు.

ఏది ఏమైనా.. తెర వెనుక పావులు కదపటం అలవాటైన చిరు.. తనకు తాను లేఖ రాయాల్సింది కాదన్న మాట వినిపిస్తోంది. ‘బాస్ ఎప్పటిలానే ఉంటే సరిపోయేది. ఇప్పుడు ఆయన లేఖ రాయాల్సిన అవసరం ఏమిటి? ఆ పని చేయటానికి ఎంతమంది లేరు’ అన్న మాటను కొందరి నోటి నుంచి వస్తుంటే.. ఎన్నికల రచ్చకు ఫుల్ స్టాప్ వేసేందుకే చిరు లేఖతో ఎంట్రీ ఇచ్చారన్న మాట వినిపిస్తోంది. సినిమాటిక్ మలుపులకు ఏ మాత్రం తీసిపోని రీతిలో సాగుతున్న మా ఎన్నికల వ్యవహారం రానున్న రోజుల్లో మరెన్ని సిత్రాల్ని చూపిస్తుందో చూడాలి.