Begin typing your search above and press return to search.

బన్నీ చరణ్ మధ్య తేడా ఇదే!

By:  Tupaki Desk   |   27 March 2018 9:43 AM IST
బన్నీ చరణ్ మధ్య తేడా ఇదే!
X
రంగస్థలం విడుదలకు కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యింది. సినిమా మీద అభిమానులకు నమ్మకం ఉండటం సహజమే కాని జరుగుతున్న పరిణామాలు మాత్రం వాళ్ళను కలవరపెడుతున్నాయి. కారణం ప్రమోషన్ ఉధృతంగా ఉండాల్సిన టైంలో ఎందుకు ఇంత స్తబ్దుగా ఉంటున్నారన్న అనుమానం వాళ్ళను తొలిచేస్తోంది. ముందు నుంచి రామ్ చరణ్ కు స్థానికంగా తెలుగు రాష్ట్రాల్లో అభిమానుల అండదండలే తప్ప బయట తనను తాను ప్రూవ్ చేసుకున్న సందర్భం లేదు.

ముఖ్యంగా ఓవర్సీస్ లో చరణ్ మార్కెట్ చాలా వీక్ గా ఉంది. చేసిన సినిమాల్లో ఓ ఐదు దాకా హిట్స్ ఉన్నప్పటికీ అవేవి యుఎస్ లో కలెక్షన్లు కొల్లగొట్టినవి కాకపోవడం గమనార్హం. మెగా మేనల్లుడు బన్నీ మాత్రం ఇంతింతై అన్న రీతిలో ఓవర్సీస్ లో బలమైన మార్కెట్ సంపాదించుకున్నాడు. సన్ అఫ్ సత్యమూర్తి - జులాయి లాంటి మూవీస్ అక్కడ భారీ వసూళ్లు రాబట్టాయి అంటే దానికి బన్నీ ఇమేజే కారణం. చరణ్ గత సినిమా ధృవ కోసం అమెరికా మొత్తం టీం తో సహా ట్రిప్ వేస్తే అక్కడి డిస్ట్రిబ్యూటర్ పెట్టిన పెట్టుబడి వెనక్కు తెచ్చుకోవడానికే చెమట చిందించాడు. అందుకే రామ్ చరణ్ సినిమా అంటే భారీ ఇన్వెస్ట్ మెంట్ చేయడానికి అక్కడ వెనుకాడతారు అన్నది నిజం.

రిలీజ్ కు మూడు రోజులే ఉన్నప్పటికీ ఓవర్సీస్ లో దీని హడావిడి పెద్దగా కనిపించడం లేదు. విచిత్రంగా అక్కడ విడుదల అవుతున్న విషయం కూడా అక్కడివారికి పూర్తిగా అవగాహన లేదంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. పోనీ ధృవ తరహాలో ప్రత్యేకంగా రామ్ చరణ్ అక్కడికి వెళ్లి ఏమైనా ప్రమోట్ చేస్తాడా అంటే ఆ సూచనలు కూడా లేవు. ఏదో మొక్కుబడిగా ఇక్కడి ఛానల్స్ లో టీవీ ఇంటర్వ్యూలు ఇస్తూ మమ అనిపిస్తున్నారు తప్ప అంత సిన్సియారిటీ కనిపించడం లేదు.

బన్నీ రామ్ చరణ్ తరహాలో మూస సినిమాలకు కట్టుబడకపోవడమే అతని రేంజ్ ను పెంచుతోంది. కేరళలో ఎవడు డబ్బింగ్ వెర్షన్ విడుదల చేసినప్పుడు పోస్టర్స్ లో కేవలం పది నిముషాలు ఉన్న బన్నీ ని హై లైట్ చేసి డ్యూయల్ రోల్ చేసిన అసలు హీరో రామ్ చరణ్ ని చిన్నగా చేసి చూపించడం ఇంకా ఎవరు మర్చిపోలేదు. ఈ నేపధ్యంలో ఇలా మొక్కుబడి మంత్రాలకు చింతకాయలు రాలవు అనే విషయాన్నీ చరణ్ తో పాటు రంగస్థలం దర్శక నిర్మాతలు కూడా పూర్తిగా మర్చిపోతున్నారు.

బన్నీ తిరుగులేని స్టార్ డం వెనుక ఇలా చెప్పుకుంటూ పోతే పెద్ద కథే వస్తుంది. యు ట్యూబ్ లో రెండు వంద మిలియన్ వ్యూస్ సినిమాలు కలిగిన హీరో కూడా బన్నీ ఒక్కడే. రామ్ చరణ్ ఇండస్ట్రీ హిట్ మగధీర అందులో సగం కూడా తెచ్చుకోలేదు. అసలే షూటింగ్ వాయిదా వేయిస్తూ ఆలస్యం చేయటంలో పేరున్న రామ్ చరణ్ రంగస్థలం లాంటి సింపుల్ కాన్వాస్ ఉన్న సినిమాకు సైతం ఏడాదిన్నర షూటింగ్ చేయించడం ప్లానింగ్ లోని లోపాన్ని స్పష్టంగా బయట పెడుతోంది. మెగా హీరోస్ మాకందరూ ఒకటే అని పైకి చెబుతున్నప్పటికీ అభిమానుల్లో లోలోపల వేరు కుంపట్లు ఉన్నాయన్నది నిజం. ఇలాంటి స్ట్రాటజీలతో కనక రామ్ చరణ్ ఇలాగే కంటిన్యూ అయితే ముందు ముందు రేస్ లో వెనుకబడే ప్రమాదం చాలా ఉంది. జాగ్రత్త చెర్రి.