Begin typing your search above and press return to search.

సీనియర్ స్టార్ హీరోల సరసన మీనా జోరు!

By:  Tupaki Desk   |   12 April 2021 11:30 PM GMT
సీనియర్ స్టార్ హీరోల సరసన మీనా జోరు!
X
వెండితెరకి చైల్డ్ ఆర్టిస్ట్ గా పరిచయమై .. ఆ తరువాత స్టార్ హీరోయిన్ గా ఎదిగినవాళ్లను వ్రేళ్లపై లెక్కపెట్టవచ్చు. ఆ కేటగిరిలో శ్రీదేవి తరువాత స్థానంలో మీనా కనిపిస్తుంది. నిజానికి మీనా ఇండస్ట్రీకి కథానాయికగా వచ్చేటప్పటికి గట్టి పోటీ ఉంది. అయినా పెద్దగా స్కిన్ షో చేయకుండా మంచి క్రేజ్ ను తెచ్చుకుంది. మీనా అనే పేరు వినగానే కొత్త పెళ్లి కూతురు మాదిరిగా సిగ్గుపడిపోయే ఆమె రూపమే ఇప్పటికీ అభిమానుల కళ్లలో కదులుతుంది .. మెదులుతుంది. తెలుగులోనే కాదు .. తమిళంలోనూ ఆమె అదే జోరు చూపించింది.

తెలుగు .. తమిళ భాషల్లోని స్టార్ హీరోలందరితోను మీనా ఆడిపాడింది. వరుస హిట్లను తన ఖాతాలో వేసుకుంది. అలాంటి మీనా వివాహమైన తరువాత కూడా పెద్దగా గ్యాప్ తీసుకోలేదు. తనకి నచ్చిన పాత్రలను నిదానంగా అంగీకరిస్తూ .. నింపాదిగా చేస్తూ వస్తోంది. తన వయసుకి తగినట్టుగానే సీనియర్ హీరోల సరసన నాయికగా నటిస్తోంది. మలయాళంలో మోహన్ లాల్ సరసన 'దృశ్యం' చేసిన ఆమె, తెలుగులో అదే సినిమాలో వెంకటేశ్ సరసన నాయికగా నటించింది. ఆ సినిమా సీక్వెల్ లోను అదే పరిస్థితి.

ఇక గతంలో రజనీకాంత్ తో మీనా చేసిన సినిమాల్లో 'ముత్తు' ముందువరుసలో కనిపిస్తుంది. కథాకథనాల పరంగా .. సంగీతం పరంగా ఈ సినిమా ఒక ఊపు ఊపేసింది. గ్లామర్ పరంగా కూడా ఈ సినిమా మీనాకి ఎక్కువ మార్కులు తెచ్చిపెట్టింది. మళ్లీ ఇప్పుడు రజనీ సరసన నాయికగా 'అన్నాత్తే' సినిమాలో కనిపించనుంది. నవంబర్ 4వ తేదీన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సినిమా రిలీజ్ తరువాత మీనా జోరు పెరిగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయనే టాక్ వినిపిస్తోంది. ఇక తెలుగులో చిరంజీవి రీమేక్ చేయనున్న ఓ సినిమాలోను మీనా పేరు వినిపిస్తోంది. మొత్తానికి మీనా మూడు భాషల్లోని సీనియర్ స్టార్ హీరోల సరసన నటిస్తూ, ఇప్పటికీ అదే గ్రాఫ్ ను కొనసాగిస్తూ ఉండటం విశేషం.