Begin typing your search above and press return to search.

కార్తికేయ కోసం కండల వీరుడిగా మారుతున్న నిఖిల్!

By:  Tupaki Desk   |   4 April 2020 7:50 AM GMT
కార్తికేయ కోసం  కండల వీరుడిగా మారుతున్న   నిఖిల్!
X
కండలు పెంచడం.. సిక్స్ ప్యాక్.. ఇలాంటివన్నీ గతంలో బాలీవుడ్ హీరోల కే సొంతం అన్నట్టుగా ఉండేది వ్యవహారం. ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. టాలీవుడ్ హీరోలు కూడా బాలీవుడ్ హీరోలను తలదన్నేలా ఫిజిక్ మెయింటైన్ చేస్తూ వారికి గట్టి పోటీ ఇస్తున్నారు. ఈ మధ్య రిలీజ్ అయిన భీం ఫర్ రామరాజు లో చరణ్ ను చూసిన వారికి మతి పోయింది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. చరణ్ ఒక్కడే కాదు.. దాదాపు ఇప్పుడు అందరు హీరోలు అదే బాటలో ఉన్నారు. తాజాగా యువ హీరో నిఖిల్ కూడా ఇదే బాట పట్టడం ఆసక్తిని కలిగిస్తోంది.

నిఖిల్ పోయినేడాది 'అర్జున్ సురవరం' తో ఓ డీసెంట్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఆ సినిమా తర్వాత టాలెంటెడ్ ఫిలిం మేకర్ చందు మొండేటి దర్శకత్వంలో సూపర్ హిట్ ఫిలిం 'కార్తికేయ' కు సీక్వెల్ గా 'కార్తికేయ 2' ను లైన్ లో పెట్టాడు. ప్రస్తుతం ఈ సినిమా కు ప్రీ ప్రొడక్షన్ జోరుగా సాగుతోంది. ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లే లోపు నిఖిల్ కూడా ఫిట్ గా తయారవ్వాలని.. బాడీ బిల్డ్ చేయాలని కంకణం కట్టుకున్నాడట. ఇప్పుడు ఎలాగూ లాక్ డౌన్ కాబట్టి.. సమయం వృధా చేయకుండా కసరత్తులు చేస్తూ.. కఠినమైన డైట్ ఫాలో అవుతూ సిక్స్ ప్యాక్ దిశగా అడుగులు వేస్తున్నారని సమాచారం.

రీసెంట్ గా సోషల్ మీడియాలో నిఖిల్ సిక్స్ ప్యాక్ లో ఉన్న షర్ట్ లెస్ ఫోటోలు హల్ చల్ చేస్తున్నాయి. అంటే ఇప్పటికే నిఖిల్ మిషన్ దాదాపుగా పూర్తయినట్టే అనుకోవచ్చు. ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ళే లోపు.. నిఖిల్ ఫిట్ గా తయారై ప్రేక్షకులను మెప్పించేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నాడని అనుకోవచ్చు. నిఖిల్ ఇండస్ట్రీకి వచ్చి చాలా ఏళ్లయినా ఇప్పటికీ మీడియం రేంజ్ హీరోగానే కొనసాగుతున్నాడు. మరి 'కార్తికేయ' సీక్వెల్ తో తను ఆశిస్తున్న స్టార్ డం దక్కేనా.. టాలీవుడ్ కు మరో కొత్త స్టార్ హీరో లభించేనా అన్నది వేచి చూడాలి.