Begin typing your search above and press return to search.

హీరోయిన్స్ ను కంగారుపెట్టేసిన పవిత్ర లోకేశ్ ఏమైపోయిందబ్బా?

By:  Tupaki Desk   |   17 April 2021 1:30 AM GMT
హీరోయిన్స్ ను కంగారుపెట్టేసిన పవిత్ర లోకేశ్ ఏమైపోయిందబ్బా?
X
తెలుగు తెరపై 'అమ్మ' అంటే నిర్మలమ్మ .. అన్నపూర్ణమ్మ. తల్లి పాత్రల్లో వాళ్లు ఎంతగానో ఒదిగిపోయారు .. ఇష్టంగా ఇమిడిపోయారు. అమ్మ పాత్రలకు వాళ్లు ఒక గౌరవాన్ని తీసుకొచ్చారు. ఆ తరువాత 'అమ్మ' పాత్రల్లోని అమ్మను కూడా అందంగా చూపించాలనే ట్రెండ్ మొదలైంది. అమ్మ పాత్రకి ఆత్మీయత కంటే .. గ్లామర్ ఎక్కువ అవసరమైంది. అప్పటివరకూ ఇంటిల్లిపాదికి వండి వడ్డించిన అమ్మకి హఠాత్తుగా అంత గ్లామర్ ఎక్కడి నుంచి వస్తుంది? అందుకే సీనియర్ హీరోయిన్లను రంగంలోకి దింపడం మొదలుపెట్టారు. అలా నదియా .. స్నేహా .. తులసి .. ప్రగతి వగైరా మళ్లీ తెరపైకి వచ్చారు.

గతంలో వీళ్లంతా కూడా ఆడియన్స్ కి బాగా తెలుసు. కానీ హీరోయిన్ గా పెద్దగా పరిచయం లేని 'పవిత్ర లోకేశ్' కూడా అమ్మ పాత్రల్లో ప్రత్యక్షమైంది. పవిత్ర లోకేశ్ కన్నడలో కొన్ని సినిమాల్లో హీరోయిన్ గా చేశారు. ఆశించినస్థాయిలో హిట్లు పడకపోవడంతో, పెద్దగా గ్యాప్ లేకుండానే క్యారక్టర్ ఆర్టిస్ట్ గా మారిపోయారు. కొన్ని సీరియల్స్ లోను నటించారు. పవిత్ర లోకేశ్ ఇతర భాషల్లో ఎన్ని సినిమాలు చేసినప్పటికీ, తెలుగు ప్రేక్షకులకు సీరియల్స్ ద్వారానే ఆమె చేరువయ్యారు. ఇంత అందంగా ఉన్న ఆమె చక్కగా సినిమాలు చేసుకోవచ్చును గదా అనుకున్నారు. కానీ అప్పటికే ఆమె కన్నడలో ఒక ఊపు ఊపేశారు.

ఒకప్పుడు తెరపై కేఆర్ విజయను చూస్తే ఎలాంటి ఫీలింగ్ కలిగేదో, పవిత్ర లోకేశ్ ను చూస్తే అంతే పవిత్రమైన భావన కలుగుతుంది. బుల్లితెరపై సాధించిన క్రేజ్ తో తెలుగు తెరపైకి వచ్చిన ఆమె, అమ్మ పాత్రలతో బిజీ అయ్యారు. అమ్మ పాత్రలకు ఒక అందాన్ని .. నిండుదనాన్ని తీసుకొచ్చారు. తన కూతుళ్లుగా నటించే హీరోయిన్స్ కూడా ఆమె గ్లామర్ ముందు తేలిపోయారు. అంత అందమైన అమ్మకి కూతురుగా కనిపించడానికి కొంతమంది కథానాయికలు కంగారు పడ్డారు కూడా. అలాంటి పవిత్ర లోకేశ్ ఈ మధ్య తెరపై ఎక్కువగా కనిపించడం లేదు. అందుకు కారణం .. మదర్ రోల్ ఇంకా యంగ్ గా ఉండాలని దర్శకులు కోరుకోవడమా? ఆమె గ్లామర్ ముందు తాము తేలిపోకూడదని హీరోయిన్స్ అనుకోవడమా?