Begin typing your search above and press return to search.

క్యాబ్ డ్రైవర్ గా వెళదామనుకున్నా: రాహుల్ సాంకృత్యన్

By:  Tupaki Desk   |   9 Jan 2022 8:37 AM GMT
క్యాబ్ డ్రైవర్ గా వెళదామనుకున్నా: రాహుల్ సాంకృత్యన్
X
జీవితంలో ఎవరికైనా ఒక ఆశయమనేది ఉంటుంది. ఎన్ని కష్టాలు ఎదురైనా ఆశయం వైపు సాగిపోయేవాళ్లు కొందరైతే, ఆ దిశగా ముందుకు వెళ్లలేక ఆశయాన్ని మార్చుకునేవారు కొందరు. ఈ రెండింటిలో మొదటి వర్గానికి చెందినవాడిగా దర్శకుడు రాహుల్ సాంకృత్యన్ కనిపిస్తాడు. తాజా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ .. "మాది కర్నూల్ జిల్లాలోని 'జిన్ను కమ్మవారి పాలెం'. మొదటి నుంచి కూడా మా నాన్నలో కమ్యూనిజం భావాలు ఎక్కువగా ఉండేవి. ఆయన నాకు ఈ పేరు పెట్టడానికి కారణం కూడా అదే. మా ఇంట్లో కమ్యూనిజానికి సంబంధించిన పుస్తకాలు ఎక్కువగా ఉండేవి.

అలాగే శ్రీశ్రీ .. చలం పుస్తకాలు ఎక్కువగా ఉండేవి. సహజంగానే ఆ సాహిత్యం ప్రభావం నాపై పడింది. అనంతపురంలో బీటెక్ చేసిన నేను, మైసూర్ లో జాబ్ చేసేవాడిని. అయితే షార్ట్ ఫిలిమ్స్ పై నాకు మక్కువ పెరుగుతూ వెళ్లసాగింది. అలా సినిమాల వైపుకు దృష్టి వెళ్లడంతో, నా జాబ్ ను హైదరాబాద్ కి మార్పించుకుని ఇక్కడికి వచ్చేశాను. ఒక బ్యాచ్ తో కలిసి ఒక రూమ్ లో ఉంటూ ప్రయత్నాలు చేయడం మొదలుపెట్టాను. వాళ్లంతా నా డబ్బులు వాడుకుని, నన్ను పస్తుపెట్టడం మొదలుపెట్టారు. దాంతో అక్కడి నుంచి వేరే రూమ్ కి మారిపోయాను.

ఒక ప్రమాదం నుంచి బయటపడిన తరువాత, జాబ్ మానేసి ఇక సినిమాల్లో గట్టిగా ప్రయత్నాలు చేయాలనుకున్నాను. నేను జాబ్ మానేస్తానంటే అమ్మావాళ్లు భయపడ్డారు .. బాధపడ్డారు. అయితే అదే సమయంలో నా షార్టు ఫిల్మ్ కి 3 లక్షల రూపాయల బహుమతి రావడంతో వాళ్లకి నమ్మకం కుదిరింది. మా దగ్గరి బంధువు నిర్మాతగా 'ది ఎండ్' సినిమాను తెరకెక్కించాను. నష్టపోలేదు .. అలాగని లాభాలు రాలేదు. ఎక్కడి నుంచి ఎలాంటి అవకాశాలు రావడం లేదు. అలాంటి పరిస్థితుల్లో క్యాబ్ డ్రైవర్ గా వెళదామని అనుకున్నాను.

సెకండ్ హ్యాండ్ కారు కొనాలని వెళితే .. చాలా కొత్త కారు .. తక్కువ రేటుకు ఇస్తానన్నారు. అందుకు కారణం ఏమై ఉంటుందా అనే ఆలోచనలో నుంచి 'టాక్సీవాలా' కథ పుట్టింది. ఆ సినిమాకి సంబంధించిన పనులు చకచకా జరిగిపోయాయి. ఆ సినిమా హిట్ కావడంతో మంచి పేరు వచ్చింది .. నాపై నాకు గల నమ్మకం పెరిగింది. ఇక 'శ్యామ్ సింగ రాయ్' కథను సత్యదేవ్ వినిపించాడు. ఆ కథను బెంగాల్ నేపథ్యానికి మార్చేసి చేశాను. ఈ సినిమాకి ప్రేక్షకుల నుంచి విపరీతమైన ఆదరణ లభించింది. ఇక ఇప్పుడు నామీద ఉన్న బాధ్యత, నాపై ప్రేక్షకులకు గల నమ్మకాన్ని నిలబెట్టుకోవడమే" అంటూ చెప్పుకొచ్చాడు.