Begin typing your search above and press return to search.

'రామ‌య్యా వ‌స్తావ‌య్యా' జోడీ రిపీట్ కానుందా...?

By:  Tupaki Desk   |   25 April 2020 12:20 PM IST
రామ‌య్యా వ‌స్తావ‌య్యా జోడీ రిపీట్ కానుందా...?
X
యంగ్ టైగర్ ఎన్టీఆర్ - త్రివిక్రమ్ కాంబినేషన్ లో ఓ సినిమా తెరెకెక్కబోతున్న విషయం తెలిసిందే. 'అరవిందసమేత వీరరాఘవ' వంటి విజయవంతమైన చిత్రం తర్వాత వీరి కాంబోలో వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈ చిత్రాన్ని హారిక అండ్ హాసిని క్రియేష‌న్స్‌ మరియు ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యాన‌ర్స్‌ పై రాధాక‌ష్ణ‌ (చినబాబు).. హీరో నంద‌మూరి క‌ల్యాణ్‌ రామ్ సంయుక్తంగా నిర్మించనున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకు స్క్రిప్ట్ ను రెడీ చేసే పనిలో ఉన్నాడు త్రివిక్రమ్. కరోనా లాక్ డౌన్ ఎత్తేసిన తర్వాత ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యే అవకాశాలున్నాయి. ఈ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసినప్పటి నుండి హీరోయిన్ విషయంలో రోజుకొక రూమర్ పుట్టుకొస్తూనే ఉంది. ఎన్టీఆర్ కెరీర్లో 30వ చిత్రంగా రాబోతున్న ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లకు స్కోప్ ఉన్నట్లు తెలుస్తోంది.

అయితే ఒక హీరోయిన్‌ గా పూజా హెగ్డే, కియారా అద్వానీ, జాన్వీ కపూర్ పేర్లను పరిశీలించిన త్రివిక్రమ్ ఇప్పుడు ఫైనల్‌ గా కమల్ హాసన్ కూతురు శృతి హాసన్ వైపు మొగ్గు చూపారనే టాక్‌ ఫిల్మ్‌నగర్‌ లో వినిపిస్తోంది. ఈ మేరకు ఆమెతో సంప్రదింపులు కూడా చేస్తున్నారని సమాచారం. దాదాపు ఏడేళ్ల క్రితం వచ్చిన ‘రామయ్యా వస్తావయ్యా’ చిత్రంలో ఎన్టీఆర్‌ సరసన ఓ కథానాయికగా శ్రుతీహాసన్‌ నటించింది. ఈ సినిమా ఘోర పరాజయాన్ని చవి చూసింది. అదే జోడీని ఈ సారి సరికొత్తగా వెండితెరపై ఆవిష్కృతం చేయాలని చూస్తున్నాడట త్రివిక్రమ్. ఈ చిత్రానికి 'అయినను పోయిరావలె హస్తినకు' అనే టైటిల్ ప్రచారంలో ఉంది. ప్రస్తుతం ఎన్టీఆర్ రాజమౌళి దర్శకత్వం లో వస్తోన్న 'ఆర్ ఆర్ ఆర్' సినిమాలో నటిస్తున్నాడు. ఆ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని ఎన్టీఆర్ ఎక్కువ గ్యాప్ గ్యాప్ తీసుకోకుండానే త్రివిక్రమ్ సినిమాను స్టార్ట్ చేయాలని భావిస్తున్నాడట. వచ్చే ఏడాది వేసవిలో ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారని సమాచారం.