Begin typing your search above and press return to search.

ట్రైలర్ టాక్: 'అసురన్' ను మరిపించిన 'నారప్ప'

By:  Tupaki Desk   |   14 July 2021 6:45 AM GMT
ట్రైలర్ టాక్: అసురన్ ను మరిపించిన నారప్ప
X
విక్టరీ వెంకటేష్ ప్రధాన పాత్రలో నటించిన 74వ చిత్రం ''నారప్ప'' విడుదలకు సిద్ధమైంది. తమిళంలో ధనుష్ హీరోగా నటించిన బ్లాక్ బస్టర్ 'అసురన్' చిత్రానికి ఇది అధికారిక తెలుగు రీమేక్. వి క్రియేషన్స్ మరియు సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై క‌లైపులి ఎస్.థాను - సురేష్ బాబు కలసి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. సెన్సిబుల్ డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో రూపొందించిన ఈ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ ని డైరెక్ట్ డిజిటల్ రిలీజ్ చేస్తున్నట్లు ఇటీవలే ప్రకటించారు. ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో జూలై 20న ఈ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ''నారప్ప'' చిత్ర ట్రైలర్ ను మేకర్స్ విడుదల చేశారు.

ట్రైలర్ చూస్తుంటే తమిళ దర్శకుడు వెట్రిమారన్ తెరకెక్కించిన 'అసురన్' కథలో పెద్దగా మార్పులు చేయకుండా ''నారప్ప'' చిత్రాన్ని రూపొందించినట్లు తెలుస్తోంది. ఓల్డ్ మ్యాన్ గెటప్‌ లో ఉన్న వెంకటేష్‌ చేతిలో ఒక కత్తి పట్టుకొని కోపంతో శత్రువులను వేటాడానికి బయలుదేరడంతో ట్రైలర్ ప్రారంభమైంది. నారప్ప భార్య సుందరమ్మ పాత్రలో నటించిన ప్రియమణి 'వాడి తల తీసుకొస్తే ఇంకా సంతోష పడేదాన్ని' అని చెప్పే డైలాగ్ తో ఆమె పాత్ర ఎలా ఉంటుందో అర్థం అవుతోంది. 'ఎప్పుడు చూసినా భయంతో చేతులు కట్టుకొని భయంతో మన ముందు నిల్చునే వాళ్ళలో ఎలా ఆ భయం పోయింది?' విలన్ పాత్ర పలకడాన్ని బట్టి చూస్తే సమాజంలోని కుల వ్యవస్థ నేపథ్యంలో ఈ సినిమా రూపొందిందని తెలుస్తోంది.

ఇందులో ముగ్గురు పిల్లల తండ్రి నారప్ప పాత్రలో వెంకటేష్ నటించారు. ఫ్లాష్ బ్యాక్ లో యువకుడిగా.. ఆ తర్వాత మధ్యవయస్కుడిగా.. వెంకీ పాత్రలో వేర్వేరు షేడ్స్ కనిపిస్తున్నాయి. 'మనకు కావాల్సింది ఎవడైనా ఎలా ఇస్తాడు? మనమే కొట్టి తీసుకోవాలి కదా నాయనా' అని కొడుకు చెబుతుండగా.. 'వాళ్ళను ఎదిరించడానికి అదొక్కటే దారి కాదు.. మన దగ్గర భూమి ఉండే తీసుకుంటారు.. డబ్బుంటే లాగేసుకుంటారు.. కానీ చదువును మాత్రం మన నుంచి ఎవరూ తీసుకోలేరు సిన్నప్పా' అంటూ నారప్ప అతనికి హితబోధ చేస్తున్నాడు. అలాంటి నారప్ప పగతో ఎలా రగిలి పోయాడు.. తన2కొడుకు భవిష్యత్ కోసం అగ్ర వర్ణాలకు చెందిన వ్యక్తులను ఎదిరించి ఎలా నిలిచాడు అనేది ఇందులో చూపించబోతున్నారు. అయితే దీని వెనుక ఇంకో పెద్ద కథ ఉన్నట్టు ట్రైలర్ హింట్ ఇస్తోంది.

నారప్ప పాత్రలో వెంకీ ఒదిగిపోయినట్లు ట్రైలర్ చూస్తే అర్థం అవుతోంది. ఎలాంటి పాత్రలో అయినా అవలీలగా పరకాయ ప్రవేశం చేసి ప్రేక్షకులను మెప్పించగలిగే వెంకటేష్.. మరోసారి తన అద్భుతమైన నటనతో ఆకట్టుకుంటాడని చెప్పవచ్చు. ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాల్లో వెంకీ విశ్వరూపం చూపించాడు. ట్రైలర్ చూస్తుంటే 'అసురన్' లో ధనుష్ ను మరిపించేలా సీనియర్ హీరో పెర్ఫార్మన్స్ చేసినట్లు తెలుస్తోంది. చివర్లో 'రా నరకరా.. ఎదురు తిరిగి కసిగా నరకరా..' అంటూ బ్యాగ్రౌండ్ స్కోర్ వస్తున్నప్పుడు నారప్ప కత్తితో రౌడీలను నరికే ఫైట్ రోమాలు నిక్కబొడుచుకునేలా చేస్తోంది. ఇప్పటికే ఎన్నో చిత్రాలను రీమేక్ చేసి సూపర్ హిట్స్ కొట్టిన వెంకటేష్.. నారప్ప తో మరో సక్సెస్ తన ఖాతాలో వేసుకునేలా కనిపిస్తున్నాడు.

'నారప్ప' చిత్రంలో వెంకటేష్ తనయుడిగా కార్తీక్ రత్నం నటించగా.. నాజర్ - రావు రమేష్ - రాజీవ్ కనకాల ఇతర కీలక పాత్రలు పోషించారు. తమిళ్ 'అసురన్' చిత్రంలో నటించిన అమ్ము అభిరామి తెలుగులో కూడా అదే పాత్రలో నటించినట్లు తెలుస్తోంది. మెలోడీ బ్రహ్మ మణిశర్మ ఈ చిత్రానికి సంగీతం సమకూర్చారు. బ్యాగ్రౌండ్ స్కోర్ కోసం 'అసురన్' ను అనుసరించినట్లు తెలుస్తోంది. శ్యామ్ కె.నాయుడు అందించిన సినిమాటోగ్రఫీ బాగుంది. నిర్మాణ విలువలు కూడా అద్భుతంగా ఉన్నాయి. దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల ఎక్కువ స్వేచ్ఛ తీసుకోకుండా.. వెట్రి మారన్ ను ఫాలో అయ్యారని అనుకోవచ్చు. ఈ చిత్రానికి మార్తాండ్ కె.వెంకటేష్‌ ఎడిటింగ్ వర్క్ చేయగా.. గాంధీ నడికుడికర్‌ ఆర్ట్ డైరెక్టర్ గా వ్యవహరించారు. ఈ నెల 20 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానున్న వెంకటేష్ 'నారప్ప' చిత్రం ఎలాంటి ఆదరణ దక్కించుకుంటుందో చూడాలి.