Begin typing your search above and press return to search.

అలనాటి గిరిజ అలా అప్పులపాలైంది!

By:  Tupaki Desk   |   1 Jun 2021 11:30 PM GMT
అలనాటి గిరిజ అలా అప్పులపాలైంది!
X
తెలుగులో తొలితరం హాస్యనటీమణులలో గిరిజ ఒకరిగా కనిపిస్తారు. ఒక వైపున గయ్యాళీతనం .. మరో వైపున హాస్యాన్ని పండించడంలో గిరిజ సిద్ధహస్తురాలు. రేలంగి జోడీగా .. సూర్యకాంతం గారాల కూతురిగా తెలుగు తెరపై గిరిజ చేసిన సందడి అంతా ఇంతా కాదు. చాలా చిన్నవయసులోనే గిరిజ తెలుగు తెరకి పరిచయమయ్యారు. అదీ .. హాస్యనటిగా కాదు .. అక్కినేని సరసన నాయికగా. అవును తొలి సినిమాలోనే ఆమె అక్కినేని జోడీగా తెరపై కనిపించారు. ఆమెను పరిచయం చేసింది హాస్యనటుడు కస్తూరి శివరావు.

ఒక వైపున రెండవ కథానాయికగా .. మరో వైపున హాస్యనటిగా గిరిజ అనేక చిత్రాలలో నటించారు. ఆమె బాడీ లాంగ్వేజ్ .. డైలాగ్ డెలివరీ ఆమెకు స్టార్ డమ్ తెచ్చిపెట్టాయి. అప్పట్లో రేలంగి చాలా బిజీ ఆర్టిస్ట్. ఆయన జోడీగా మంచి మార్కులు కొట్టేయడం వలన గిరిజ కూడా బిజీ అయ్యారు. అప్పట్లో ఈ జోడీలేని సినిమా ఉండేది కాదు. కావాలని చెప్పేసి వాళ్లిద్దరి కోసం దర్శక నిర్మాతలు కామెడీ ట్రాకులు రాయించేవారు. భారీ స్థాయిలోనే పారితోషికాలు అందుకుంటూ, చిత్రపరిశ్రమలో గిరిజ ఒక వైభవాన్ని చూశారు.

అలాంటి గిరిజ .. దర్శకత్వ శాఖలో పనిచేసే సన్యాసిరాజు అనే వ్యక్తిని వివాహం చేసుకున్నారు. అయితే అతని గురించి తెలిసినవారు గిరిజను వారించినా వినిపించుకోలేదట. వివాహమైన తరువాత అప్పటివరకూ గిరిజ సంపాదించిన డబ్బుతో ఆయన సినిమాలను నిర్మించాడు. ఆ సినిమాలు భారీ నష్టాలనే తీసుకొచ్చాయి. 100 సినిమాల్లో చేస్తే వచ్చిన డబ్బు ఒక్క సినిమా తీస్తే పోతుందన్నది గిరిజ విషయంలోను జరిగింది. రేలంగి తరువాత సాయం చేసేవారెవరూ లేకపోవడంతో గిరిజ తన చివరి రోజుల్లో ఆర్థికపరమైన ఇబ్బందులతో సతమతమయ్యారు. ఎన్నో హాస్యపాత్రల ద్వారా ఎంతోమందిని నవ్వించిన గిరిజ, విషాదకరమైన పరిస్థితుల్లోనే ఈ లోకం నుంచి నిష్క్రమించారు.