35: చిన్న కథ కాదు
Date of Release: 2024-09-06
Nanda Kishore Emani
Directer
Priyadarshi
Star Cast
Nivetha Thomas
Star Cast
Gautami
Star Cast
Siddharth Rallapalli
Producer
Vivek Sagar
Music
నటీనటులు: నివేథా థామస్-విశ్వదేవ్ రాచకొండ-ప్రియదర్శి-మాస్టర్ అరుణ్ దేవ్ పోతుల-భాగ్యరాజ్-రేవతి-కృష్ణతేజ తదితరులు
సంగీతం: వివేక్ సాగర్
ఛాయాగ్రహణం: నికేత్ బొమ్మిరెడ్డి
నిర్మాతలు: సృజన్ యరబోలు-సిద్దార్థ్ రాళ్ళపల్లి
రచన-దర్శకత్వం: నందకిశోర్ యేమాని
ఈ మధ్య కొన్ని సినిమాలు స్టార్ పవర్ లేకపోయినా కంటెంట్ తో ప్రేక్షకులను మెప్పించాయి. కమిటీ కుర్రోళ్ళు.. ఆయ్ లాంటి చిత్రాలు అందుకు ఉదాహరణ. ‘35: చిన్న కథ కాదు’ కూడా ఈ కోవలోకి చేరే సినిమాల ా కనిపించింది ప్రోమోలు చూస్తే. రానా దగ్గుబాటి సమర్పణలో కొత్త దర్శకుడు నందకిశోర్ యేమాని రూపొందించిన ఈ చిత్రం ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ప్రోమోలున్నంత ఆహ్లాదకరంగా సినిమా కూడా ఉందా? తెలుసుకుందాం పదండి.
కథ:
ప్రసాద్ (విశ్వదేవ్ రాచకొండ).. సరస్వతి (నివేథా థామస్) తిరుపతిలో నివాసముండే ఒక మధ్య తరగతి జంట. వీరికి ఇద్దరు అబ్బాయిలు. వారిలో పెద్దబ్బాయి అయిన అరుణ్ (మాస్టర్ అరుణ్ దేవ్)కు లెక్కలంటే గిట్టదు. మిగతా సబ్జెక్టుల్లో మంచి మార్కులు సంపాదించినా.. గణితంలో మాత్రం ఎప్పుడూ సున్నానే వస్తుంటుంది. లెక్కల్లో అతనడిగే కొన్ని డౌట్లకు టీచర్లు సహా ఎవ్వరూ సమాధానం చెప్పరు. దీంతో గణితం పట్ల వ్యతిరేక భావం ఏర్పడి ఆ సబ్జెక్ట్ చదవకపోవడంతో ప్రతిసారీ జీరోనే వస్తుంటుంది. ఐతే తన స్కూల్లోకి చాణక్య (ప్రియదర్శి) అనే కొత్త లెక్కల మాస్టర్ రావడంతో అరుణ్ కు ఇబ్బందులు ఎదురవుతాయి. ఆ ఇబ్బందులు కుటుంబం వరకు వెళ్లి అరుణ్ ఇల్లు వదిలి వెళ్లిపోయే పరిస్థితి తలెత్తుతుంది. ఈ స్థితిలో అరుణ్ మళ్లీ ఇల్లు ఎలా చేరాడు.. గణితం మీద తన ఆలోచనను మార్చి ఆ సబ్జెక్టుపై అతను పట్టు సాధించేలా చేయడానికి సరస్వతి ఏం చేసింది.. చివరికి ఆమె లక్ష్యం నెరవేరిందా లేదా అన్నది మిగతా కథ.
కథనం-విశ్లేషణ:
మంచి కథలు చెబుతాం.. సందేశాలిస్తాం అంటే చూసే రోజులు కావివి. ఎంత చెడు చూపిస్తే సినిమాలు అంత బాగా ఆడుతున్న రోజుల్లో పనిగట్టుకుని ప్రధాన పాత్రలకు నెగెటివ్ షేడ్స్ అద్దుతుండడం గమనించవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో కూడా కొందరు దర్శకులు పట్టుబట్టి ‘మంచి’ కథలు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఐతే ఆ మంచి క్లాస్ పీకినట్లు చూపిస్తే ప్రేక్షకులకు ఎక్కదు. కథనంలో వినోదానికి ఢోకా లేకుండా చూసుకోవడం.. ప్రధాన పాత్రలను ప్రేక్షకులు రిలేట్ చేసుకునేలా తీర్చిదిద్దడం.. అర్థవంతమైన-ఆలోచన రేకెత్తించే సంభాషణలు జోడించడం.. వీటన్నింటికీ తోడు ఆర్టిస్టులు-సాంకేతిక నిపుణులు మనసు పెట్టి పని చేయడం.. ఇవన్నీ తోడైతేనే ప్రేక్షకుల్లో కదలిక వస్తుంది. వాళ్లకా మంచి చేరుతుంది. ‘35: చిన్న కథ కాదు’లో ఈ లక్షణాలన్నీ ఉన్నాయి. కథ పరంగా చూస్తే చాలా చిన్న పాయింట్ అయినా.. దాని ద్వారా చెప్పాలనుకున్న విషయం చాలా పెద్దది. అందుకే రెండున్నర గంటల పాటు చూసి ఆస్వాదించడమే కాదు.. ఆ తర్వాత ఆలోచించేలా కూడా చేస్తుందీ సినిమా.
పిల్లలవి సున్నితమైన మనస్తత్వాలు. చిన్నతనంలో వాళ్లలో ఏర్పడే అభిప్రాయాలు పిల్లల మనసుల్లో ఎంతో బలంగా నాటుకుపోతాయి. ఏదైనా విషయంలో ప్రతికూల అభిప్రాయం ఏర్పడితే.. దాన్ని మార్చడం అంత తేలిక కాదు. ఐతే వాళ్లకు చెప్పాల్సిన భాషలో చెబితే ఆలోచన మార్చుకుని అసాధ్యం అనుకున్నది కూడా సుసాధ్యం చేస్తారనే మంచి సందేశం ఇచ్చే ప్రయత్నం చేశాడు ‘35: చిన్న కథ కాదు’ ద్వారా నందకిశోర్ యేమాని. ఐతే మంచి పాత్రలు.. చక్కటి సన్నివేశాలు.. అర్థవంతమైన డైలాగులు ఈ మంచి కథకు తోడవడంతో ఎక్కడా క్లాస్ పీకుతున్న భావన కలగదు. ఒక రకంగా చెప్పాలంటే ఈ సినిమాను తెలుగు ‘తారే జమీన్ పర్’ అని చెప్పొచ్చు. బహుశా దర్శకుడికి కూడా ఈ కథ రాయడానికి ఈ సినిమా స్ఫూర్తి అయి ఉంటే ఆశ్చర్యమేమీ లేదు. అందులో అసలు చదువే ఎక్కని కుర్రాడిలో తన టీచర్ ప్రేరణ కలిగిస్తే.. ఇక్కడ గణితం పట్ల మాత్రమే వ్యతిరేకత పెంచుకున్న కుర్రాడి సమస్యను తన తల్లే పరిష్కరిస్తుంది. ఐతే మనదైన పాత్రలు.. సన్నివేశాలు.. మాటలతో.. ఉట్టిపడే నేటివిటీతో ఇది అచ్చ తెలుగు సినిమా అనే భావన మాత్రం అడుగడుగునా కనిపిస్తుంది.
ప్లాట్ పాయింట్ చాలా చిన్నదిగా కనిపించినా.. దాన్ని రెండున్నర గంటలకు విస్తరించిన స్క్రీన్ ప్లేలో దర్శకుడి ప్రత్యేకత కనిపిస్తుంది. పిల్లాడి సమస్యను వినోదాత్మకంగా చెప్పడం ద్వారా ఆరంభ సన్నివేశాలను సరదాగా నడిపించాడు. పిల్లాడితో పాటు తల్లిదండ్రులు.. టీచర్ పాత్రలు కూడా ఆసక్తికరంగా అనిపించడం.. ఆర్టిస్టులు కూడా చక్కగా పెర్ఫామ్ చేయడం.. సన్నివేశాలు-మాటలు సింపుల్ గా అనిపిస్తూనే ఆహ్లాదాన్ని పంచడంతో ప్రేక్షకులకు బోర్ కొట్టదు. కాకపోతే సన్నివేశాలు మరీ నెమ్మదిగా సాగుతున్న ఫీలింగ్ మాత్రం కలుగుతుంది. దర్శకుడి నరేషన్ స్టైలే అలా ఉంది మరి. ఈ కథను ఇలా చెప్పడమే కరెక్ట్ అని అతను ఫీలై ఉండొచ్చు. కానీ కొన్ని చోట్ల మాత్రం నరేషన్ మరీ నెమ్మదించిన భావన కలుగుతుంది. తొలి అరగంట వినోదం తర్వాత పిల్లాడి సమస్య తీవ్రమై భావోద్వేగాల వైపు కథ తిరుగుతుంది. ఆ సీన్లను కూడా దర్శకుడు బాగా డీల్ చేశాడు. దిక్కుతోచని స్థితిలో పిల్లాడు ఇంటి నుంచి వెళ్లిపోయాక.. అతణ్ని వెతికి పట్టుకునే క్రమం మీద కథ నడుస్తుందని అనుకుంటాం. కానీ ఆ వ్యవహారాన్ని సింపుల్ గా తేల్చేసి.. వేరే టాస్క్ వైపు కథనాన్ని నడిపించాడు దర్శకుడు.
ఇంటర్వెల్ వరకు కొంచెం రేసీగా అనిపించే సినిమా.. ఆ తర్వాత ఓ అరగంట కొంచెం గందరగోళంగా అనిపిస్తుంది. కానీ పిల్లాడు గణితంలో 35 మార్కులు సంపాదించడం అన్నది పెద్ద టాస్క్ గా మారి.. దాంతోనే అన్ని సమస్యలకూ పరిష్కారం లభించే పరిస్థితి రావడంతో కథ రసకందాయంలో పడుతుంది. ఇలాంటి సందర్భాల్లో చాలా వరకు సినిమాటిక్ స్టయిల్లో కథను నడిపిస్తుంటారు. ఇందులో కూడా కథ పరంగా ఆ శైలినే అనుసరించినా.. సన్నివేశాలు చాలా వరకు రియలిస్టిగ్గానే సాగుతాయి. నాటకీయత మరీ ఎక్కువ లేకుండా బాగానే డీల్ చేశాడు. పతాక సన్నివేశాలు ప్రేక్షకులకు మంచి ఫీల్ ఇస్తాయి. సినిమా కొంచెం లెంగ్తీగా అనిపించడం.. నరేషన్ స్లో ఉండడం.. ద్వితీయార్దంలో ఓ అరగంట సన్నివేశాలు కొంచెం గజిబిజిగా సాగడం తప్పితే ‘35: చిన్న కథ కాదు’లో పెద్ద కంప్లైంట్స్ ఏమీ కనిపించవు. వినోదానికి ఢోకా లేకుండానే పేరెంటింగ్.. టీచింగ్ విషయంలో పాఠాలు ఆలోచన రేకెత్తించే మంచి విషయాలు ఇందులో ఉన్నాయి. అర్థవంతమైన ఓ మంచి సినిమాను చూసిన ఫీలింగ్ తో బయటికి వస్తాం. ఇలాంటి సినిమాలకు చేయూతనందిస్తే.. తెరపై మరిన్ని మంచి కథలు చూడ్డానికి అవకాశముంటుంది.
నటీనటులు:
మంచి కథ.. పాత్రలు రాసుకుంటే.. అందుకు తగ్గ నటీనటులను ఎంచుకుంటే ఇక పెర్ఫామెన్సుల విషయంలో ఢోకా ఏముంటుంది? చాన్నాళ్ల తర్వాత తెలుగు తెరపై మెరిసిన నివేథా థామస్ తన కెరీర్లో గుర్తుండిపోయే పాత్రను చేసింది. సరస్వతిగా తన అభినయం గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆమెను తెలుగు సినిమా సరిగా వాడుకోలేకపోతోందే అనిపించేలా ఆమె ఆ పాత్రను పండించింది. మధ్య తరగతి ఇల్లాలి పాత్రలో సులువుగా ఒదిగిపోవడమే కాదు.. చిత్తూరు యాసలో సొంతంగా చక్కగా డైలాగులు చెప్పి మెప్పించింది నివేథా. కొన్ని చోట్ల తన నటన కన్నీళ్లు తెప్పిస్తుంది. ఆమె భర్త పాత్రలో విశ్వదేవ్ కూడా బాగానే ఒదిగిపోయాడు. తన పాత్ర పరిధి తక్కువే అయినా.. ఉన్నంతలో చక్కగా నటించాడు. ఇక కథకు మూలమైన అరుణ్ అనే చిన్న పిల్లాడి పాత్రలో నటించిన అరుణ్ దేవ్ కూడా భలే చేశాడు. ‘తారే జమీన్ పర్’లో పిల్లాడిని గుర్తుకు తెచ్చేలా ఇన్నోసెంట్ లుక్స్ తో అరుణ్ ఆకట్టుకున్నాడు. అమాయకత్వం ఉట్టిపడేలా సాగిన తన హావభావాలు ముచ్చటగొలుపుతాయి. ప్రియదర్శి నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో రాణించాడు. తన నటన సహజంగా సాగింది. ఇగోయిస్టిక్ టీచర్ పాత్రలో కొలిచినట్లు నటించాడు ప్రియదర్శి. భాగ్యరాజ్ ప్రిన్సిపల్ పాత్రకు సరిపోయాడు. రేవతి పాత్ర చిన్నదే అయినా ఎఫెక్టివ్ గా అనిపిస్తుంది. ఆమె నటన కూడా బాగుంది. సహాయ పాత్రలో కృష్ణతేజ కూడా ఓకే. కిరణ్మయి పాత్రలో చేసిన చిన్న పాప.. లీడ్ రోల్ చేసిన అబ్బాయి తమ్ముడు.. తన క్లాస్మేట్స్ గా చేసిన పిల్లలతోనూ దర్శకుడు బాగా చేయించాడు.
సాంకేతిక వర్గం:
వివేక్ సాగర్ తన పాటలు.. నేపథ్య సంగీతంతో సినిమాలోని ఆహ్లాదాన్ని ఇంకా పెంచాడు. పాటలు చార్ట్ బస్టర్స్ కావు కానీ.. సందర్భానుసారంగా సాగిపోతూ ప్లెజెంట్ ఫీల్ ఇస్తాయి. నేపథ్య సంగీతం కూడా అలాగే సాగింది. నికేత్ బొమ్మిరెడ్డి ఛాయాగ్రహణం నీట్ గా సాగింది. నిర్మాణ విలువల్లో కొన్ని పరిమితులు కనిపించినా.. కంటెంట్ ప్రధానంగా సాగిన సినిమా కావడంతో అది పెద్ద ఇబ్బందిలా అనిపించదు. ఇలాంటి కథకు మద్దతునిచ్చిన నిర్మాతలు అభినందనీయులు. ఇక నందకిశోర్ యేమాని తొలి చిత్రంతోనే రచయితగా.. దర్శకుడిగా అభిరుచిని చాటుకున్నాడు. శైలి పరంగా ‘నైంటీస్ మిడిల్ క్లాస్’తో పరిచయమైన ఆదిత్య హాసన్ సరసన నిలిచే దర్శకుడు నందకిశోర్. అతను ఎంచుకున్న కథ చిన్నదైనా.. దాన్ని ఆద్యంతం మంచి ఫీల్ తో.. చక్కటి స్క్రీన్ ప్లే.. డైలాగులతో ఆసక్తి సన్నగిల్లకుండా చూశాడు. తన నరేషన్ కొంత స్లో.. ద్వితీయార్ధంలో కాసేపు కథ పక్కదోవ పట్టినట్లు అనిపించడం మినహాయిస్తే నందకిశోర్ పనితనానికి వంకలు పెట్టడానికేమీ లేదు.
చివరగా: 35.. చిన్న కథలో పెద్ద అర్థం
రేటింగ్ - 3/5