'అమరన్'
Date of Release: 2024-10-31
Rajkumar Periasamy
Directer
Siva Karthikeyan
Star Cast
Sai Pallavi
Star Cast
Bhuvan Arora
Star Cast
R. Mahendran
Producer
GV Prakash Kumar
Music
'అమరన్' మూవీ రివ్యూ
నటీనటులు: శివ కార్తికేయన్-సాయిపల్లవి-రాహుల్ బోస్-శ్యామ్ మోహన్-భువన్ అరోరా-శ్రీకుమార్-గీత కైలాసం తదితరులు
సంగీతం: జి.వి.ప్రకాష్ కుమార్
ఛాయాగ్రహణం: సీహెచ్ సాయి
నిర్మాతలు: కమల్ హాసన్-ఆర్.మహేంద్రన్-వివేక్ కృష్ణాని
రచన-దర్శకత్వం: రాజ్ కుమార్ పెరియసామి
తమిళంలో చిన్న చిన్న పాత్రలతో మొదలుపెట్టి స్టార్ హీరోగా ఎదిగిన నటుడు.. శివ కార్తికేయన్. డాక్టర్.. మహావీరుడు లాంటి చిత్రాలతో తెలుగులోనూ అతను గుర్తింపు సంపాదించాడు. ఇప్పుడతను దివంగత ఆర్మీ ఆఫీసర్ ముకుంద్ వరదరాజన్ బయోపిక్ 'అమరన్'తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. సాయిపల్లవి కథానాయికగా నటించిన ఈ చిత్రం దీపావళి కానుకగా ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దీని విశేషాలేంటో చూద్దాం పదండి.
కథ:
ముకుంద్ వరదరాజన్ (శివ కార్తికేయన్)కు చిన్నతనం నుంచే సైన్యంలో చేరాలని ఆశ. కానీ తన తల్లికి అది ఇష్టం ఉండదు. కాలేజీ రోజుల్లో ముకుంద్.. మలయాళీ అమ్మాయి అయిన ఇందు (సాయిపల్లవి)తో ప్రేమలో పడతారు. తన లక్ష్యానికి కూడా ఆమె మద్దతుగా నిలుస్తుంది. అనుకున్నట్లే ముకుంద్ సైన్యంలో ఆఫీసర్ అవుతాడు. ఐతే మంతం.. ప్రాంతం వేరు కావడం.. పైగా ఒక ఆర్మీ ఆఫీసర్ కు తమ అమ్మాయిని ఇవ్వడం ఇష్టం లేక ఇందు కుటుంబం ముకుంద్ తో ఇందు పెళ్లికి అంగీకరించదు. మరి సైన్యంలో ముకుంద్ తన బాధ్యతలను ఎలా నిర్వర్తించాడు.. అంచెలంచెలుగా ఎలా ఎదిగాడు.. మరోవైపు ఇందు కుటుంబాన్ని మెప్పించి తననెలా పెళ్లి చేసుకున్నాడు.. తన ప్రయాణం ఎలా సాగింది.. అన్నది మిగతా కథ.
కథనం-విశ్లేషణ:
ఆర్మీ ఆఫీసర్ల జీవితాలను వెండితెరపై అద్భుతంగా ఆవిష్కరిస్తారని బాలీవుడ్ దర్శకులకు మంచి పేరుంది. అక్కడ పదుల సంఖ్యలో ఈ తరహా సినిమాలు వచ్చాయి. ఐతే ఇప్పుడు సౌత్ దర్శకులు కూడా ఈ కథలను బాగా డీల్ చేస్తున్నారు. తమిళ డైరెక్టర్ విష్ణువర్ధన్ హిందీలో 'షేర్ షా' సినిమా తీసి మెప్పించాడు. తెలుగులో శశి కిరణ్ తిక్క-అడివి శేష్ జోడీ 'మేజర్'తో మంచి మార్కులు వేయించుకుంది. ఈ తరహా సినిమాల్లో కథలన్నీ కూడా కొంచెం అటు ఇటుగా ఒకేలా అనిపిస్తాయి. కథ పరంగా సర్ప్రైజులు పెద్దగా కనిపించవు. ఓవైపు ఆర్మీ ఆఫీసర్ల కుటుంబం- లవ్ లైఫ్ చూపించి.. మరోవైపు ఆర్మీలో సాహసాల నేపథ్యంలో కథను నడిపించి.. చివరగా ఒక ఎమోషనల్ క్లైమాక్సుతో ప్రేక్షకులను కదిలించే ప్రయత్నం చేస్తారు. అందులోనూ అమర వీరుల గురించి వాస్తవ కథలను తెరపై ప్రెజెంట్ చేసినపుడు ప్రేక్షకులను ఆశ్చర్యపరచడానికి ఏమీ ఉండదు. సినిమాలు ఒక ఫార్మాట్లో సాగిపోతాయి. కథలో కొత్తదనం చూపించడం ఇంకా కష్టమవుతుంది. ఇలాంటి కథల్లో ప్రధాన పాత్రలతో ఎమోషనల్ కనెక్ట్ ఏర్పడేలా చేయడం.. భావోద్వేగాలను సరిగా పండించడంలోనే సినిమా విజయం ఆధారపడి ఉంటుంది. ఈ విషయంలో 'అమరన్' కూడా షేర్ షా.. మేజర్ చిత్రాల బాటలోనే సాగుతుంది. తెలిసిన విషయాలే చూస్తున్నట్లు అనిపించినా.. కథ మొత్తం అంచనాలకు తగ్గట్లే సాగినా.. భావోద్వేగాలు సరిగా పండడం.. ప్రధాన పాత్రలను ప్రేక్షకులతో బాగా కనెక్ట్ చేయగలగడంతో 'అమరన్' ప్రేక్షకులను మెప్పించగలిగింది. కానీ ఈ తరహా సినిమాలు చాలా రావడం వల్ల ఇది కొత్తగా అయితే అనిపించదు.
2014లో కశ్మీర్లో ఉగ్రవాదులకు చిక్కిన పౌరులను విడిపించే ఆపరేషన్లో అమరుడైన మేజర్ ముకుంద్ వరదరాజన్ బయోపిక్.. అమరన్. తన జీవిత విశేషాల మీద ఇంటర్నెట్లో కావాల్సినంత సమాచారం ఉంది. ఐతే అందరికీ తెలిసిన సమాచారాన్నే తీసుకున్నప్పటికీ.. ఆ విషయాలను తెరపై ఎఫెక్టివ్ గా ప్రెజెంట్ చేశాడు దర్శకుడు రాజ్ కుమార్ పెరియసామి. సాధారణంగా ఆర్మీ ఆఫీసర్ల కథల్లో వాళ్లు చేపట్టే ఆపరేషన్లు.. చేసే సాహసాల మీదే ఎక్కువ ఫోకస్ ఉంటుంది. అవే హైలైట్ అవుతాయి కూడా. కానీ 'అమరన్'లో దాన్ని మించి హీరో లవ్.. ఫ్యామిలీ లైఫ్ మీద ఎక్కువ దృష్టిపెట్టాడు దర్శకుడు. ఇది కూడా వేరే సినిమాల్లో చూడనిదేమీ కాదు కానీ.. దాని చుట్టూ భావోద్వేగాలను పండించిన తీరు ప్రత్యేకంగా అనిపిస్తుంది. ప్రేక్షకులను డీప్ గా టచ్ చేసేలా ఆ సన్నివేశాలను హృద్యంగా తీర్చిదిద్దడం.. హీరో హీరోయిన్ల మధ్య బంధాన్ని బాగా ఎలివేట్ చేయడం.. ఒకరి మీద ఒకరికున్న ఇష్టాన్ని.. కుటుంబానికి ఆ వ్యక్తి ఎంత అవసరం.. తనను వాళ్లెంత మిస్సవుతున్నారు అన్నది చూపించడం ద్వారా ప్రేక్షకుల్లో భావోద్వేగాలను పతాక స్థాయికి తీసుకెళ్లాడు దర్శకుడు. దీని వల్ల పతాక సన్నివేశాల్లో ఎమోషన్ బాగా వర్కవుట్ అయింది. శివ కార్తికేయన్ సైనికుడి పాత్రలో సిన్సియర్ ఎఫర్ట్ పెట్టగా.. అతణ్ని మించి తన భార్య పాత్రలో సాయిపల్లవి అద్భుతమైన పెర్ఫామెన్స్ ఇవ్వడంతో ఈ కథతో ప్రేక్షకులు ఎమోషనల్ గా బాగా కనెక్ట్ అవ్వడానికి అవకాశం ఏర్పడింది. సాయిపల్లవి వల్లే 'అమరన్' సినిమా స్థాయి పెరిగింది అంటే అతిశయోక్తి కాదు.
హీరోకు సైన్యంలో చేరడం పట్ల ఉన్న ప్యాషన్.. తన కుటుంబం.. అతడి ప్రేమకథ.. అడ్డంకులను దాటి తన ప్రేమను గెలిపించుకునే నేపథ్యంలో 'అమరన్' తొలి గంట ఆసక్తికరంగా సాగుతుంది. పాత్రలను సరిగ్గా ఎస్టాబ్లిష్ చేయడంతో వాటితో ప్రేక్షకులు ట్రావెల్ అవుతారు. సాయిపల్లవి చేసిన ఇందు పాత్ర తెరపై కనిపించిన ప్రతిసారీ ప్రేక్షకులు తెరకు అతుక్కుపోతారు. అంత బాగా ఆ పాత్రను తీర్చిదిద్దారు. ఆ పాత్రలో తన పెర్ఫామెన్స్ కూడా బాగా కుదరడంతో ఆమెతో ముడిపడ్డ సన్నివేశాలన్నీ హైలైట్ అయ్యాయి. మరోవైపు ఆర్మీ నేపథ్యంలో సీన్లు కూడా బాగానే సాగుతాయి. అల్తాఫ్ బాబా అనే ఉగ్రవాదిని హీరో అండ్ టీం మట్టుబెట్టే ఆపరేషన్ గూస్ బంప్స్ ఇస్తుంది. ఐతే ద్వితీయార్ధంలో మాత్రం ఆర్మీ సీన్లు కొంచెం రొటీన్ గా.. మొనాటనస్ గా అనిపిస్తాయి. ఫ్యామిలీ సీన్ల వరకు ఆకట్టుకున్నా.. మిగతా ఎపిసోడ్లు సాధారణంగా సాగడంతో ద్వితీయార్ధం కొంచెం ఎగుడుదిగుడుగా అనిపిస్తుంది. కానీ చివరి అరగంటలో మాత్రం 'అమరన్' గొప్పగా అనిపిస్తుంది. ప్రి క్లైమాక్స్ నుంచే ఎమోషనల్ గా సాగే 'అమరన్' చివర్లో ప్రేక్షకులను కదిలించేస్తుంది. కన్నీళ్లతో ప్రేక్షకులు థియేటర్ నుంచి బయటికి వస్తారు. తెలిసిన కథలా అనిపించినా.. లీడ్ యాక్టర్ పెర్ఫామెన్స్.. సరిగ్గా పండిన భావోద్వేగాల వల్ల 'అమరన్' ఎంగేజింగ్ గా అనిపిస్తుంది. 'మేజర్' స్థాయి హై ఇవ్వకపోయినా.. 'అమరన్' కూడా మంచి సినిమానే.
నటీనటులు:
శివ కార్తికేయన్ మంచి పెర్ఫామర్ అని మరోసారి రుజువు చేశాడు. నిజంగా ఆర్మీ ఆఫీసర్ అనిపించేలా ఆ పాత్రను పోషించాడు. ఈ క్యారెక్టర్ ద్వారా ఒక వ్యక్తిత్వాన్ని చాటాడు. లుక్ పరంగానే కాక అన్ని విషయాల్లోనూ అతను జాగ్రత్త తీసుకున్నాడు. పాత్రకు తగ్గట్లుగా ఆరంభం నుంచి చివరి దాకా అతను ఒక ఇంటెన్సిటీ మెయింటైన్ చేశాడు. యాక్షన్ ఘట్టాల్లో శివ కష్టం కనిపిస్తుంది. సినిమాలో బెస్ట్ పెర్ఫామర్ సాయిపల్లవినే. హీరోతో పోలిస్తే స్క్రీన్ టైం తక్కువ కావచ్చు కానీ.. కనిపించిన ప్రతి సన్నివేశంలోనూ ఆమె కట్టిపడేస్తుంది. భావోద్వేగాలు తన్నుకొస్తున్నట్లు ఉండే తన ముఖం చూడగానే ప్రేక్షకుల్లోనూ ఎమోషన్ వస్తుంది. అమితంగా ప్రేమించే భర్తకు ఎప్పుడు ఏమవుతుందో అని కంగారు పడే పాత్రలో ఆమె నటన ప్రేక్షకులను కదిలిస్తుంది. భర్త మరణం గురించి తెలిసినపుడు సాయిపల్లవి నటనకు అవార్డు ఇవ్వాల్సిందే. నటన పరంగా ఎక్కడా సాయిపల్లవికి వంకలు పెట్టడానికి లేదు కానీ.. ఇందులో పాత్రలో ఆమె మరీ వీక్ గా.. డల్లుగా కనిపించడం ఒకింత నిరాశ కలిగిస్తుంది. 'ఫర్జి' ద్వారా పాపులర్ అయిన భువన్ అరోరా సైనికుడి పాత్రలో ఆకట్టుకున్నాడు. రాహుల్ బోస్ కూడా బాగా చేశాడు. హీరో తల్లి పాత్రలో నటించిన ఆర్టిస్ట్ ఆకట్టుకుంది. మిగతా నటీనటులంతా కూడా బాగానే చేశారు.
సాంకేతిక వర్గం:
జి.వి.ప్రకాష్ కుమార్ ఒకే రోజు రెండు సినిమాల్లో సంగీత దర్శకుడిగా తన ప్రత్యేకతను చాటుకున్నాడు. 'లక్కీ భాస్కర్'తో మెప్పించిన అతను.. 'అమరన్'కు కూడా తన సంగీతంతో బలంగా నిలిచాడు. హే రంగులే.. పాట మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుంది. నేపథ్య సంగీతం కూడా ఆకట్టుకుంటుంది. యాక్షన్ ఘట్టాల్లో.. అలాగే ఎమోషనల్ సీన్లలో ఇంపాక్ట్ చూపించాడు జి.వి. సీహెచ్ సాయి ఛాయాగ్రహణం బాగా సాగింది. కశ్మీర్ నేపథ్యంలో సాగే సన్నివేశాలన్నింట్లో విజువల్స్ టాప్ క్లాస్ అనిపిస్తాయి. నిర్మాణ పరంగా మంచి క్వాలిటీ చూపించారు. ఒక పెద్ద హీరో స్థాయి నిర్మాణ విలువలు కనిపిస్తాయి. ఇక రైటర్ కమ్ డైరెక్టర్ రాజ్ కుమార్ పెరియసామి.. తెలిసిన కథనే సరిగ్గా తెరపై ప్రెజెంట్ చేశాడు. రొటీన్ సన్నివేశాలే అయినా.. ఎఫెక్టివ్ గా తెరపై ఆవిష్కరించాడు. ఎమోషనల్ సీన్లలో తన పనితనం కనిపిస్తుంది. ద్వితీయార్ధంలో కథ పరంగా బిగి తగ్గింది. ఇంకొంచెం బిగితో తీర్చిదిద్దుకుని ఉంటే 'అమరన్' మంచి స్థాయిలో ఉండేది.
చివరగా: అమరన్.. ఎమోషనల్ రైడ్
రేటింగ్-3/5