క
Sandeep
Directer
Kiran Abbavaram
Star Cast
Nayan Sarika
Star Cast
Ajay
Star Cast
Chinta Gopalakrishna Reddy
Producer
Sam C.S.
Music
'క' మూవీ రివ్యూ
నటీనటులు: కిరణ్ అబ్బవరం-తన్వి రామ్-నయన్ సారిక-అచ్యుత్ కుమార్-శరణ్య ప్రదీప్- రెడిన్ కింగ్స్లీ తదితరులు
సంగీతం: సామ్ సీఎస్
ఛాయాగ్రహణం: సతీష్ రెడ్డి-డేనియల్ విశ్వాస్
నిర్మాత: చింతా గోపాలకృష్ణరెడ్డి
రచన-దర్శకత్వం: సుజిత్ మద్దెల-సందీప్ మద్దెల
'ఎస్ఆర్ కళ్యాణమండపం' సహా కొన్ని చిత్రాలతో మంచి గుర్తింపు సంపాదించి.. తర్వాత వరుస ఫ్లాపులతో వెనుకబడ్డ యువ కథానాయకుడు.. ఈసారి కొంచెం గ్యాప్ తీసుకుని 'క' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ప్రామిసింగ్ టీజర్.. ట్రైలర్ ఈ సినిమాపై అంచనాలు పెంచాయి. దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఆ అంచనాలను ఏమేర అందుకుంది..? చూద్దాం పదండి.
కథ:
అభినయ వాసుదేవ్ (కిరణ్ అబ్బవరం) ఒక అనాథ. చిన్నప్పుడు అనాథాశ్రమంలో పెరిగిన అతడికి వేరే వాళ్ల ఉత్తరాలు చదివే బలహీనత ఉంటుంది. తల్లిదండ్రులు-తోబుట్టువుల ప్రేమకు నోచుకోని అతను.. ఈ ఉత్తరాల ద్వారానే ఆ అనుబంధాల గురించి తెలుసుకుంటాడు. ఈ ఉత్తరాలు చదివే అలవాటుతోనే అతను పోస్ట్ మ్యాన్ అవ్వాలని ఆశపడతాడు. యుక్త వయసుకు వచ్చాక కృష్ణగిరి అనే ఊరిలో అతడికి అసిస్టెంట్ పోస్ట్ మ్యాన్ పని చేసే అవకాశం దక్కుతుంది. దీంతో రోజూ ఆ ఊరికి వచ్చే ఉత్తరాలన్నీ తెరిచి చదివి.. ఆ తర్వాత వాటిని యథావిధిగా అంటించి అందాల్సిన వాళ్లకు ఇచ్చేస్తుంటాడు. కానీ తన అలవాటు వల్ల వాసుదేవ్ కొన్ని సంచలన విషయాలు తెలుసుకుంటాడు. ఈ క్రమంలోనే ఆ ఊరిలో అదృశ్యం అవుతున్న అమ్మాయిల గుట్టును తెలుసుకునే ప్రయత్నం చేస్తాడు వాసుదేవ్. దీంతో అతడికి పెద్ద సమస్యలు మొదలవుతాయి. ఈ సమస్యలేంటి.. ఈ అమ్మాయిల అదృశ్యం వెనుక ఉన్నదెవరు.. వారిని వాసుదేవ్ పట్టుకున్నాడా.. ఈ విషయాలన్నీ తెర మీదే తెలుసుకోవాలి.
కథనం-విశ్లేషణ:
సెబాస్టియన్.. నేను మీకు బాగా కావాల్సిన వాడిని.. మీటర్.. రూల్స్ రంజన్.. మామూలు డిజాస్టర్లు కావివి. రెండేళ్ల వ్యవధిలో కిరణ్ అబ్బవరం నుంచి వచ్చిన కళాఖండాలివి. సోషల్ మీడియా ట్రోల్స్ ను సమర్థించడం కాదు కానీ.. కిరణ్ సినిమా అనగానే ప్రేక్షకులు లైట్ అనుకునే పరిస్థితి రావడానికి అతను ఎంచుకున్న సినిమాలే కారణం. కానీ అదే హీరో 'క' అనే కొత్త చిత్రం టీజర్ తో పలకరిస్తే.. గతం అంతా మరిచిపోయి ఇదేదో మంచి ప్రయత్నంలా ఉందే అని ఆసక్తి కనబరిచారు ప్రేక్షకులు. ట్రైలర్ చూస్తే ఈసారి కిరణ్ గట్టిగానే కొట్టబోతున్నాడనే ఫీలింగ్ కలిగింది. సినిమా చూశాక ప్రోమోల్లో చూపించినవి పైపై మెరుపులు కావని అర్థమవుతుంది. మలయాళంలో మిస్టరీ థ్రిల్లర్లను చూసి ఇలాంటి ప్రయత్నాలు తెలుగులో ఎందుకు జరగవు అనుకుంటూ ఉంటాం. అందుకు సమాధానమే.. 'క'. పల్లెటూరి నేపథ్యంలో ఒక థ్రిల్లర్ కథను బిగితో చెప్పి రెండున్నర గంటల పాటు ప్రేక్షకులను కుదురుగా కూర్చోబెట్టగలిగారు దర్శక ద్వయం సుజిత్ మద్దెల-సందీప్ మద్దెల.
ఎలాంటి కథను చెప్పినా విజువల్ గా కొత్తగా ఉండేలా చూసుకోవడం.. ప్రేక్షకులకు విభిన్న అనుభూతిని పంచేలా ఒక 'వరల్డ్' క్రియేట్ చేయడం ఇప్పుడు ట్రెండ్. తమకు ఉన్న బడ్జెట్ పరిమితుల్లో కిరణ్ అబ్బవరం స్థాయికి తగ్గట్లే పల్లెటూరి నేపథ్యంలో ఇలాంటి 'వరల్డ్'నే క్రియేట్ చేసుకుని నీట్ గా ఓ థ్రిల్లర్ కథను నరేట్ చేశారు సుజిత్-సందీప్. రొటీన్ అనిపించే కథలను కూడా నరేట్ చేసే శైలి ద్వారా కొత్తగా అనిపించేలా చేయొచ్చు. 'క'లో కూడా అదే జరిగింది. 'క' ట్రైలర్లో చూపించిన ముసుగు వ్యక్తి తాలూకు వ్యవహారం గురించి ఎక్కువ మాట్లాడితే కథలో ట్విస్టును బయటపెట్టేసినట్లు అవుతుంది కాబట్టి దాని లోతుల్లోకి వెళ్లకూడదు. కానీ సినిమాలో గమ్మత్తు అంతా దాంతోనే ముడిపడి ఉంది. ఒక సగటు థ్రిల్లర్ కథను విభిన్నంగా చెప్పడానికి దర్శకులు ఎంచుకున్న ఐడియా 'క'ను చాలా ప్రత్యేకంగా నిలబెడుతుంది. మనిషి తాను చేసే ప్రతి కర్మకూ ఫలితం అనుభవించాల్సిందే అనే విషయాన్ని ఈ కథ ద్వారా అంతర్లీనంగా చెప్పిన విధానం భేష్ అనిపిస్తుంది. బేసిగ్గా ఇదొక థ్రిల్లర్ కథ అయినా.. చాలా డెప్త్ ఉన్న ఈ అంశాన్ని పరిణతితో.. కొంచెం కొత్తగా చెప్పారు దర్శకులు.
చుట్టూ కొండల మధ్య లోతులో ఉండే ఒక ఊరు. మధ్యాహ్నం మూడు గంటలకే చీకటి పడిపోయే ఆ ఊరిలో వరుసగా అమ్మాయిలు అదృశ్యం అవుతుంటారు. అది కూడా తెల్లవారుజామునే వారి జాడ కనిపించకుండా పోతుంది. ఆ ఊర్లోకి వచ్చే ఓ పోస్ట్ మ్యాన్ ఈ మిస్టరీని ఎలా ఛేదించాడన్నది 'క' కథ. ఇలా ఒక నేరానికి సంబంధించిన మిస్టరీని ఛేదించే కథలు మలయాళంలో బోలెడన్ని కనిపిస్తాయి. అక్కడ గత కొన్నేళ్లలో పదుల సంఖ్యలో ఈ తరహా సినిమాలు వచ్చాయి. ఐతే క్రైమ్ స్టోరీలను బలమైన స్క్రీన్ ప్లేతో ఉత్కంఠ రేకెత్తించేలా చెప్పడం మలయాళ దర్శకుల నైపుణ్యమే వేరు. అలాంటి నైపుణ్యాన్నే సుజిత్-సందీప్ కూడా 'క'లో చూపించారు. ఈ కథను మొదలుపెట్టిన తీరు మామూలుగానే అనిపిస్తుంది. ఓ పావుగంట సాధారణంగా గడిచాక 'క' ట్రాక్ ఎక్కుతుంది. వేరే వాళ్ల ఉత్తరాలు చదివి బంధాల విలువ తెలుసుకునే అనాథగా హీరో క్యారెక్టరైజేషన్ ఆసక్తి రేకెత్తిస్తుంది. ఇలాంటి అలవాటున్న వాడు పోస్ట్ మ్యాన్ కావడం.. అందరి ఉత్తరాలూ చదవడం.. ఈ క్రమంలో సంచలన విషయాలు వెల్లడి కావడం.. ఈ నేపథ్యంలో కథ ఆసక్తికరంగా నడుస్తుంది. మరోవైపు హీరో హీరోయిన్ల రొమాంటిక్ ట్రాక్ అంత గొప్పగా అనిపించకపోయినా.. బోరింగ్ గా అయితే అనిపించదు. కథానాయికకూ కథలో ప్రాధాన్యం ఉండడం.. తన వల్లే కథ మలుపు తిరగడం కథను రసకందాయంలో పడేస్తుంది.
'క' ప్రథమార్ధం కొంచెం ఎగుడుదిగుడుగా సాగినా.. ఇంటర్వెల్ నుంచి మంచి టెంపోతో నడుస్తుంది. ద్వితీయార్ధంలో అనేక మలుపులు తిరుగుతూ సాగే కథనం ప్రేక్షకులను ఉత్కంఠకు గురి చేస్తుంది. కథలో అనేక లేయర్స్ ఉండడంతో ప్రేక్షకులు తర్వాత ఏం జరుగుతుందా అన్న ఆసక్తితో ముందుకు సాగుతారు. ట్విస్టులు ఒకదాని తర్వాత ఒకటి రివీలవుతుంటే ప్రేక్షకులు ఉత్కంఠకు గురవుతారు. విలన్ తాలూకు ట్విస్ట్ కంటే.. హీరో పాత్రకు ఇచ్చిన ట్విస్ట్ చివర్లో హైలైట్ గా నిలుస్తుంది. అది ప్రేక్షకులు ఊహించలేరు. చివరి అరగంటలో 'క' పతాక స్థాయిని అందుకుంటుంది. హీరో పాత్రకు క్లైమాక్సులో ఇచ్చిన ఎలివేషన్ అదిరిపోతుంది. ఇక హీరో పాత్రకు ఇచ్చిన ముగింపు.. 'క-2'కు ఇచ్చిన లీడ్ కూడా బాగున్నాయి. ముగింపులో 'క' లెవెల్ మారుతుంది. భిన్న నేపథ్యం.. బిగి ఉన్న కథ.. ఉత్కంఠ రేకెత్తించే కథనం.. ఆశ్చర్యపరిచే ట్విస్టులతో 'క' ఒక డిఫరెంట్ థ్రిల్లర్ చూసిన అనుభూతిని కలిగిస్తుంది. కిరణ్ అబ్బవరం చెప్పినట్లే ఈసారి కంటెంట్ ఉన్న సినిమాతో వచ్చాడు. తన కెరీర్లో ఇది బెస్ట్ ఫిలిం అనడంలో సందేహం లేదు.
నటీనటులు:
కిరణ్ అబ్బవరం నటన గురించి మాట్లాడే ముందు ఇలాంటి కథను ఎంచుకుని సినిమా చేసినందుకు తన జడ్జిమెంట్ కు అభినందించాలి. ఇక అభినయ వాసుదేవ్ పాత్రలో లుక్.. నటన పరంగా కూడా అతను ఆశ్చర్యపరుస్తాడు. ఈ సినిమా నడిచే కాలానికి.. పాత్రకు తగ్గ ఆహార్యంతో కనిపించిన కిరణ్.. నటనలోనూ మెప్పించాడు. పాత్ర బాగుంటే నటన కూడా అందుకు తగ్గట్లే సాగుతుందనడానికి ఈ సినిమా రుజువుగా నిలుస్తుంది. గత సినిమాల్లో తేలిపోయిన కిరణ్ ఈసారి ఇంపాక్ట్ చూపించాడు. ద్వితీయార్ధంలో కిరణ్ పాత్ర.. తన పెర్ఫామెన్స్ ప్రత్యేకంగా నిలుస్తాయి. 'ఆయ్' ఫేమ్ నయన్ సారిక మరోసారి తన క్యూట్ లుక్స్.. నటనతో ఆకట్టుకుంది. తన మేకప్ చాలా బాగుంది. మరో కీలక పాత్రలో మలయాళ అమ్మాయి తన్వి రామ్ బాగా చేసింది. విలన్ పాత్రల్లో నటించిన ఇద్దరూ ఓకే. కన్నడ నటుడు అచ్యుత్ కుమార్ తన పాత్రను బాగా పోషించాడు. తమిళ కమెడియన్ రెడిన్ మాత్రం వేస్టయ్యాడు. శరణ్య ప్రదీప్.. ఆమె తండ్రిగా చేసిన నటుడు బాగా చేశారు.
సాంకేతిక వర్గం:
టెక్నికల్ గా 'క'లో మంచి క్వాలిటీ కనిపిస్తుంది. సామ్ సీఎస్ ఈ చిత్రానికి తెర వెనుక హీరో. థ్రిల్లర్ సినిమాలకు అదిరిపోయే ఆర్ఆర్ ఇస్తాడని పేరున్న అతను.. 'క'లో అదరగొట్టేశాడు. ఒక డిఫరెంట్ థీమ్ తో సాగే ఆర్ఆర్ సినిమాలో ప్రేక్షకులను ఇన్వాల్వ్ చేయించడంలో కీలక పాత్ర పోషించింది. తన పాటలు జస్ట్ ఓకే. జాతర పాట మంచి ఊపుతో సాగుతుంది. సతీష్ రెడ్డి-డేనియల్ విశ్వాస్ అందించిన ఛాయాగ్రహణం బాగుంది. విజువల్స్ డిఫరెంటుగా అనిపిస్తాయి. ఆర్ట్ వర్క్ బాగా చేశారు. నిర్మాణ విలువలు ఈ సినిమా స్థాయికి మించే ఉన్నాయి. ఇక కథ-స్క్రీన్ ప్లే రాయడంతో పాటు సినిమాను డైరెక్ట్ చేసిన సుజిత్-సందీప్.. తమ టాలెంట్ చూపించారు. సినిమా మొదలైన తీరు కొంచెం కృత్రిమంగా అనిపిస్తుంది కానీ.. తర్వాత ప్రేక్షకులను ఈ కథలో బాగానే ఇన్వాల్వ్ చేయగలిగారు. ఉత్కంఠ రేకెత్తించే స్క్రీన్ ప్లేతో థ్రిల్లర్ కథను ఆసక్తికరంగా చెప్పారు. రైటింగ్ తో పాటు టేకింగ్ లోనూ సుజిత్-సందీప్ బలమైన ముద్ర వేశారు.
చివరగా: క.. కంటెంట్ ఉన్న థ్రిల్లర్
రేటింగ్- 3/5