అప్పుడో ఇప్పుడో ఎప్పుడో
Date of Release: 2024-11-08
Sudheer Varma
Directer
Nikhil Siddharth
Star Cast
Divyansha Kaushik
Star Cast
B.V.S.N. Prasad
Producer
Karthik
Music
'అప్పుడో ఇప్పుడో ఎప్పుడో మూవీ' రివ్యూ
నటీనటులు: నిఖిల్ సిద్ధార్థ -రుక్మిణి వసంత్ - దివ్యాంశ కౌశిక్ - జాన్ విజయ్ - అజయ్ - హర్ష చెముడు తదితరులు
సంగీతం: కార్తీక్
నేపథ్య సంగీతం: సన్నీ ఎంఆర్
ఛాయాగ్రహణం: రిచర్డ్ ప్రసాద్
కథ: శ్రీకాంత్ విస్సా
నిర్మాత: బీవీఎస్ఎన్ ప్రసాద్
స్క్రీన్ ప్లే - దర్శకత్వం: సుధీర్ వర్మ
యువ కథానాయకుడు నిఖిల్ సిద్ధార్థ్ నుంచి చడీచప్పుడు లేకుండా వచ్చిన సినిమా.. అప్పుడో ఇప్పుడో ఎప్పుడో. తనతో 'స్వామి రారా' లాంటి మంచి థ్రిల్లర్ తీసిన సుధీర్ వర్మ ఈ చిత్రాన్ని రూపొందించాడు. 'సప్త సాగరాలు దాటి' ఫేమ్ రుక్మిణి వసంత్ ఈ చిత్రంతో టాలీవుడ్లో అడుగుపెట్టింది. ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్ర విశేషాలేంటో చూద్దాం పదండి.
కథ:
రిషి (నిఖిల్ సిద్దార్థ) రేస్ డ్రైవర్ గా ఎదగాలని కలలు కనే కుర్రాడు. ఆ ప్రయత్నంలో ఉండగా తార (రుక్మిణి వసంత్)ను చూసి ప్రేమలో పడతాడు. ఆమె కూడా తనను ప్రేమిస్తుంది. కానీ తన ఫ్రెండు చేసిన తప్పు వల్ల తార తనను ప్రేమించట్లేదని పొరపాటు పడి తాను ఉంటున్న హైదరాబాద్ ను వదిలి లండన్ వెళ్లిపోతాడు. అక్కడ అతడికి తులసి (దివ్యాంశ కౌశిక్) అనే మరో అమ్మాయి పరిచయం అవుతుంది. కొన్నాళ్ల పాటు తనతో ప్రేమాయణం సాగించాక ఆమె మోసం చేసి వెళ్లిపోతుంది. ఇంతలో తార లండన్లో తారసపడడంతో రిషి మళ్లీ తనకు దగ్గరవుతాడు. వీరి ప్రేమ కథ మళ్లీ ఒక కొలిక్కి వస్తున్న సమయంలో తులసి తిరిగి రిషి దగ్గరికి వస్తుంది. దీంతో తార అతణ్ని వదిలి వెళ్లిపోతుంది. మరోవైపు తులసి రిషి దగ్గరికి వచ్చిన కాసేపటికే ఆమె హత్యకు గురవుతుంది. దీంతో రిషి అన్ని రకాలుగా ఇబ్బందుల్లో పడతాడు. ఇంతకీ తులసిని చంపిందెవరు.. దీని వెనుక మిస్టరీ ఏంటి.. ఈ సమస్యల నుంచి బయటపడి తారను రిషి తన దాన్ని చేసుకున్నాడా లేదా అన్నది మిగతా కథ.
కథనం-విశ్లేషణ:
కొన్ని సినిమాల రిలీజ్ టైమింగ్.. వాటి ప్రోమోలు.. ప్రమోషన్ల తీరు చూస్తేనే వాటి ఫలితం మీద ముందే ఒక అంచనా వచ్చేస్తుంది. ఆ సినిమాలు బాగుంటే ఆశ్చర్యపోయే పరిస్థితి తలెత్తుతుంది. మంచి అభిరుచి ఉన్న హీరో.. విషయం ఉన్న దర్శకుడు కూడా ఏ కథను సినిమాగా చేయాలి.. ఏది చేయకూడదు అనేది అర్థం కాని అయోమయంలో కొన్నిసార్లు తప్పటడుగులు వేసేస్తుంటారు. కానీ మొదలుపెట్టాక మధ్యలో ఆపలేరు. పూర్తి చేశాక సినిమా రిలీజ్ కాకుండా అడ్డుకోనూలేరు. 'స్వామి రారా' లాంటి ట్రెండ్ సెట్టింగ్ థ్రిల్లర్ చేసిన నిఖిల్ సిద్దార్థ-సుధీర్ వర్మల క్రేజీ కాంబినేషన్లో వచ్చిన 'అప్పుడో ఇప్పుడో' ఈ కోవకే చెందుతుంది. ఇది ఎప్పుడో కొవిడ్ టైంలో మొదలైన సినిమా. షూటింగ్ ఎప్పుడు పూర్తయిందో ఏమో కానీ.. ఉన్నట్లుండి రిలీజ్ అనౌన్స్ చేశారు. దీని టీజర్.. ట్రైలర్ పెద్దగా ఆసక్తి రేకెత్తించలేకపోయాయి. బాధ్యతగా ప్రమోషన్లు అయితే చేశారు కానీ.. ఇటు నిఖిల్-అటు సుధీర్ ఇద్దరిలోనూ ఎప్పుడూ కనిపించే కాన్ఫిడెన్స్ అయితే ఈ సినిమా విషయంలో కనిపించలేదు. ఈ నేపథ్యంలో చాలా తక్కువ అంచనాలతోనే 'అప్పుడో ఎప్పుడో ఎప్పుడో' థియేటర్లలో అడుగు పెడతాం. కానీ ఎంత తక్కువ అంచనాలతో చూసినా కూడా నిరాశపరిచే స్థాయి ఈ సినిమా ఉండడమే విచారకరం.
'స్వామి రారా'తో థ్రిల్లర్ అంటే ఇలా ఉండాలి అనిపించిన నిఖిల్-సుధీర్ జోడీ.. ఈసారి థ్రిల్లర్ సినిమా ఎలా ఉండకూడదో చూపించడానికి 'అప్పుడో ఇప్పుడో ఎప్పుడో' తీశారేమో అనిపిస్తుంది. ఈ కలయికలో వచ్చిన తొలి చిత్రంలో ఉన్న ఏ మంచి లక్షణమూ ఇందులో కనిపించదు. చెప్పుకోదగ్గ కథ లేదు. బలమైన పాత్రలు లేవు. కథనంలో వేగం కనిపించదు. థ్రిల్స్ అసలే లేవు. ఇటు లవ్ ట్రాక్.. అటు క్రైమ్ ఫ్యాక్టర్ రెండూ కూడా తేలిపోయాయి. రెండు గంటల తక్కువ నిడివి ఉన్నా సరే.. లెంగ్త్ పరంగా ఓ పెద్ద సినిమా చూసిన భావన కలిగించడాన్ని బట్టి 'అప్పుడో ఇప్పుడో ఎప్పుడో' ఎంత 'రేసీ'గా సాగుతుందో అర్థం చేసుకోవచ్చు. సుధీర్ నుంచి ఇంతకు ముందు కూడా అంచనాలకు తగని సినిమాలు వచ్చాయి కానీ.. ఇంత నత్తనడకన సాగిన సినిమా మరొకటి లేదని చెప్పొచ్చు. సినిమాలో ఏ పాత్రా ఆసక్తికరంగా సాగకపోవడం.. విలన్ పాత్ర మరీ తేలిపోవడంతో ఈ సినిమా కనీస స్థాయిలో కూడా ప్రేక్షకులను ఎంగేజ్ చేయలేకపోయింది. క్రైమ్ ఎలిమెంట్ ను ప్రేక్షకులు సీరియస్ గా తీసుకోని విధంగా సిల్లీగా డీల్ చేయడం పెద్ద మైనస్ అయింది.
'అప్పుడో ఇప్పుడో ఇప్పుడో'లో మెయిన్ విలన్ పాత్ర చేసిన తమిళ నటుడు జాన్ విజయ్ లండన్లో ఇల్లీగల్ బిజినెస్ చేసే డాన్. ఏదైనా తేడా వస్తే ఎంతమందినైనా పిట్టల్లా కాల్చేసే క్రూరుడిగా పరిచయం చేస్తారు. ఐతే జస్ట్ అక్కడి వరకు పరిమితం చేస్తే పాత్రలో వైవిధ్యం ఉండదు అనుకున్నారో ఏమో.. అతడికో విచిత్ర వేషధారణ.. హావభావాలు పెట్టి.. నడివయస్కుడైన అతను అమ్మాయిలను ఫ్లర్ట్ చేసే రొమాంటిక్ ఫెలో లాగా చూపించడానికి ప్రయత్నించారు. ఇంకా రకరకాలుగా ఆ పాత్రను ట్విస్ట్ చేశారు. ఈ క్రమంలో ఆ పాత్ర కలగాపులగంగా తయారై జోకర్ లాగా తయారైంది. ఈ పాత్రను తీర్చిదిద్దిన విధానం.. తన మీద తీసిన సీన్లు చూశాక ఇతను డానేంటి.. వందల కోట్లు డీల్ చేయడమేంటి అని ప్రేక్షకులు లైట్ తీసుకునే పరిస్థితి వస్తుంది. దాని వల్ల కథను కూడా ప్రేక్షకులు సీరియస్ గా తీసుకోలేకపోతారు. క్రైమ్ ఎలిమెంట్లో ఎక్కడా కూడా ఇంటెన్సిటీ కనిపించదు. పాత్రలను.. కథను కన్వీనియెంట్ గా ట్విస్ట్ చేసేస్తుంటారు కానీ.. ఏదీ కన్విన్సింగ్ గా అనిపించదు. ఇద్దరు హీరోయిన్లలో వేర్వేరుగా హీరో 'పెళ్లి' తంతుకు సంబంధించిన సన్నివేశాలు చూస్తే 'అప్పుడో ఇప్పుడో ఎప్పుడో'ను ఎంత తేలిగ్గా తీసేశారో అర్థమవుతుంది. ప్రథమార్ధంలో అసలు కథే కనిపించని ఈ సినిమాలో రొమాంటిక్ ట్రాక్ బోర్ కొట్టించేస్తుంది. విరామం దగ్గర్నుంచి సినిమా థ్రిల్లర్ రూట్ తీసుకుంటుంది. కానీ అదీ ఎంగేజింగ్ గా అనిపించదు. ఇందులో పేరుకే ట్విస్టులున్నాయి. కథలో సీరియస్నెస్ లేకపోవడం వల్ల అవి ప్రేక్షకులను థ్రిల్ చేయవు. తర్వాత ఏం జరుగుతుందనే ఆసక్తే రేకెత్తించని విధంగా ఏవో సన్నివేశాలు వస్తుంటాయి పోతుంటాయి. ముగింపులో కూడా పెద్దగా మెరుపుల్లేని 'అప్పుడో ఇప్పుడో ఎప్పుడో' నిఖిల్-సుధీర్ కాంబినేషన్లో ఇలాంటి సినిమా ఏంటనే ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది.
నటీనటులు:
నిఖిల్ తన పరిధిలో రిషి పాత్రను బాగానే చేశాడు. సినిమాలో ప్రేక్షకులను అంతో ఇంతో ఎంగేజ్ చేసేది అతనే. పాత్ర ఎలాంటిదైనా సిన్సియర్ ఎఫర్ట్ పెట్టే నిఖిల్.. తన వరకు మెప్పించాడు. హీరోయిన్ రుక్మిణి వసంత్ క్యూట్ లుక్స్ తో ఆకట్టుకుంది. తన నటన కూడా ఓకే. మరో హీరోయిన్ దివ్యాంశ కౌశిక్ ఇందులో పేలవమైన పాత్ర చేసింది. కన్నింగ్ క్యారెక్టర్ని సరిగా డిజైన్ చేయకపోవడంతో అది తేలిపోయింది. జాన్ విజయ్ లాంటి టిపికల్ యాక్టర్ని మన వాళ్లు సరిగా ఉపయోగించుకోలేకపోతున్నారనడానికి ఈ సినిమా మరో రుజువు. జాన్ బాగా పెర్ఫామ్ చేసినా సరే.. ఆయన పాత్ర చికాకు పెడుతుంది. అజయ్ తనకు అలవాటైన నెగెటివ్ క్యారెక్టర్లో ఏదో అలా చేసుకుపోయాడు. హీరో ఫ్రెండు పాత్రలో హర్ష చెముడు రొటీనే. సినిమాలో కథను నరేట్ చేసే దొంగల పాత్రల్లో సత్య.. సుదర్శన్ కూడా అంతగా నవ్వించలేకపోయారు. కానీ సత్య నటన మాత్రం బాగానే సాగింది.
సాంకేతిక వర్గం:
'అప్పుడో ఇప్పుడో ఎప్పుడో'కు సాంకేతిక హంగులు పర్వాలేదనిపిస్తాయి. కార్తీక్ పాటలు వినసొంపుగా లేవు. అసలు పాటలే అవసరం లేని సినిమా ఇది. సన్నీ ఎంఆర్ నేపథ్య సంగీతం మాత్రం బాగానే సాగింది. రిచర్డ్ ప్రసాద్ కెమెరా పనితనం కూడా ఓకే. చాలా వరకు కథ లండన్లోనే నడుస్తుంది. ఆ నేపథ్యంలో సన్నివేశాలు బాగానే తీశాడు. నిర్మాణ విలువలు ఓకే. లండన్ బ్యాక్ డ్రాప్ వల్ల సినిమా రిచ్ గానే అనిపిస్తుంది. ఐతే ఈ సినిమాకు సమస్యంతా స్క్రిప్టులోనే ఉంది. 'స్వామి రారా' తర్వాత ఆ స్థాయి పకడ్బందీ థ్రిల్లర్ తీయలేకపోయిన సుధీర్ వర్మ.. ఈసారి మరీ తేలికైన స్క్రిప్టుతో సినిమా చేశాడనిపిస్తుంది. సుధీర్ చివరి సినిమా 'రావణాసుర'కు పేలవమైన కథ అందించిన శ్రీకాంత్ విస్సా.. మరోసారి అలాంటి వీక్ స్టోరీనే అందించాడు. దానికి సుధీర్ కూడా తన మార్కు రేసీ స్క్రీన్ ప్లేని జోడించలేకపోయాడు. క్రైమ్ ఎలిమెంట్ చుట్టూ బిగితో కథనాన్ని అల్లుకోవడంలో సుధీర్ అండ్ టీం ఫెయిలైంది. కథతో పాటు పాత్రల్లో ఇంటెన్సిటీ లేకపోవడం మైనస్ అయింది. రచయితగా.. దర్శకుడిగా సుధీర్ నిరాశపరిచాడు.
చివరగా: అప్పుడో ఇప్పుడో ఎప్పుడో.. టోటల్ బోర్
రేటింగ్- 1.75/5