మట్కా
Date of Release: 2024-11-14
Karuna Kumar
Directer
Meenaakshi Chaudhary
Star Cast
Varun Tej
Star Cast
Mohan Cherukuri
Producer
G.V. Prakash Kumar
Music
'మట్కా' మూవీ రివ్యూ
నటీనటులు: వరుణ్ తేజ్-మీనాక్షిచౌదరి-నోరా ఫతేహి-కిషోర్-నవీన్ చంద్ర-జాన్ విజయ్-సత్యం రాజేష్-అజయ్ ఘోష్-సలోని తదితరులు
సంగీతం: జి.వి.ప్రకాష్ కుమార్
ఛాయాగ్రహణం: కిషోర్ కుమార్
నిర్మాతలు: విజేందర్ రెడ్డి తీగల-రజని తాళ్ళూరి
రచన-దర్శకత్వం: కరుణ్ కుమార్
కొన్నేళ్లుగా సరైన విజయాలు లేక ఇబ్బంది పడుతున్న యువ కథానాయకుడు వరుణ్ తేజ్.. 'పలాస్' ఫేమ్ కరుణ్ కుమార్ దర్శకత్వంలో నటించిన చిత్రం.. మట్కా. ప్రోమోలు చూస్తే హిట్టు కోసం వరుణ్ నిరీక్షణకు తెరదించేలా కనిపించిందీ సినిమా. మరి 'మట్కా' ఆ అంచనాలను నిజం చేసిందా? తెలుసుకుందాం పదండి.
కథ:
వాసుదేవ్ అలియాస్ వాసు (వరుణ్ తేజ్) ఓ శరణార్థిగా తల్లితో కలిసి విశాఖపట్నానికి వస్తాడు. కొబ్బరికాయల వ్యాపారం చేసే ఓ వ్యక్తి దగ్గర పని కోసం చేరిన అతను.. తన యజమానిని ఓ సమస్య నుంచి బయటపడేయడంతో ఆ వ్యాపారంలో వాటాదారుగా మారతాడు. ఆపై నాని బాబు అనే (కిషోర్) పెద్ద మనిషి అండతో మరింత ఎదుగుతాడు. ఐతే పెద్ద వ్యాపారం చేసి ఇంకా పై స్థాయికి వెళ్లాలని చూస్తున్న అతడికి మట్కా మార్గంగా కనిపిస్తుంది. ఈ జూదాన్ని వినూత్న రీతిలో నిర్వహించడం ద్వారా ఎవ్వరూ ఊహించనంత డబ్బు సంపాదిస్తాడు. దేశంలోనే పేరుమోసిన మట్కా కింగ్ అవుతాడు. కానీ ఇక ఎదురు లేదనుకున్న దశలో వాసుకు ఊహించని ఇబ్బందులు మొదలవుతాయి. ఆ ఇబ్బందులేంటి.. వాటిని అతను అధిగమించాడా లేదా.. చివరికి వాసు జీవితం ఏ మజిలీకి చేరింది అన్నది మిగతా కథ.
కథనం-విశ్లేషణ:
ప్రపంచ సినిమా చరిత్రలోనే అత్యధికంగా ప్రభావం చూపిన చిత్రాల్లో 'గాడ్ ఫాదర్' ఒకటిగా చెబుతారు. వివిధ దేశాల్లో.. భాషల్లో ఎంతోమంది దర్శకులు ఆ కథ నుంచి స్ఫూర్తి పొంది.. తమదైన శైలిలో కథనాన్ని జోడించి దశాబ్దాల నుంచి 'గాడ్ ఫాదర్' వెర్షన్లు తీస్తూనే ఉన్నారు. సామాన్యుడిగా మొదలుపెట్టి ఒక పెద్ద సామ్రాజ్యాన్ని నిర్మించే వ్యక్తుల కథలను ఎన్నిసార్లయినా చూపించొచ్చు. కానీ దీనికి జోడించే నేపథ్యం కొంచెం కొత్తగా అనిపించాలి.. అలాగే ఆసక్తికర కథనం తోడవ్వాలి. 'మట్కా' సినిమా కోసం తెలుగు తెరపై ఇప్పటిదాకా చూడని మట్కా అనే జూదాన్ని నేపథ్యంగా తీసుకోవడం బాగానే ఉంది. కానీ ఈ కొత్త విషయాన్ని ఆసక్తికరంగా చూపించడంలో కానీ.. అలాగే వాసు అనే వ్యక్తి జీవితాన్ని రసవత్తరంగా ప్రెజెంట్ చేయడంలో కానీ.. కరుణ్ కుమార్ సక్సెస్ కాలేకపోయాడు. పలాస.. శ్రీదేవి సోడా సెంటర్ చిత్రాలతో తన అభిరుచిని చాటుకున్న కరుణ్ కుమార్.. ఈసారి మాస్ స్టయిల్లో కథను ప్రెజెంట్ చేయాలని చూశాడు కానీ.. అది సరిగా కుదరలేదు. మట్కా కాన్సెప్ట్ బాగున్నా.. దాన్ని ప్రెజెంట్ చేయడంలో తడబాటు.. ప్రేక్షకులను ఎక్కడా ఆశ్చర్యపరచని విధంగా రొటీన్ గా సాగిపోయే కథ.. మరీ డల్లుగా సాగే నరేషన్ 'మట్కా'కు ప్రతిబంధకాలుగా మారాయి. కరుణ్ కుమార్ డైలాగుల్లో చూపించిన పెన్ పవర్ ను కథాకథనాల్లో చూపించకపోవడం కూడా పెద్ద మైనస్ అయింది.
జీవితంలో గట్టి ఎదురు దెబ్బ తిన్న కుర్రాడు.. కొత్తగా తన ప్రయాణాన్ని మొదలు పెట్టి అంచెలంచెలుగా ఎదిగే కథలు తరచుగా చూస్తూనే ఉంటాం. ఇది రెగ్యులర్ ఫార్మాటే అయినా.. ఆ జర్నీని ఎంత ఆసక్తికరంగా చూపించారు అన్నది ముఖ్యం. 'కేజీఎఫ్'లో అయినా.. 'పుష్ప'లో అయినా ఇలాంటి జర్నీనే చూపించినా.. అందులో పేలిపోయే ఎలివేషన్లు.. రసవత్తరమైన ఎపిసోడ్లు పెట్టి ప్రేక్షకులను ఎంగేజ్ చేశారు దర్శకులు. కానీ 'మట్కా'లో అవే మిస్ అయ్యాయి. కరుణ్ కుమార్ హీరోను ఎలివేట్ చేయడానికి కొన్ని ఎపిసోడ్లు పెట్టాడు కానీ.. అవి అంతగా పేలలేదు. ఒక ఫైట్ చేసి హీరో అయిపోవడం.. ఒకరి దగ్గర పనికి చేరి తనకే యజమాని అయిపోవడం లాంటి సన్నివేశాలు చాలా రొటీన్ అనిపిస్తాయి. హీరో ప్రేమ వ్యవహారం కానీ.. తన ఎదుగుదలకు సంబంధించిన అంశాలు కానీ ఏవీ కొత్తగా అనిపించవు. ఏవో సన్నివేశాలు వస్తుంటాయి పోతుంటాయి తప్ప.. అబ్బురపడేంతగా ఏమీ జరగదు తన జీవితంలో. మరీ నెమ్మదిగా సాగే సన్నివేశాలు ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెడతాయి. మట్కా కాన్సెప్ట్ పరిచయం అయ్యే వరకు సినిమాలో అసలు కొత్తగా అనిపించే.. ప్రేక్షకుల ఆసక్తిని రాబట్టే అంశం ఏదీ లేదు. మట్కా గురించి పరిచయం చేసే సన్నివేశాలు ప్రేక్షకుల అటెన్షన్ రాబడతాయి. కానీ తర్వాత మళ్లీ మామూలే.
హీరో ఎదుగుదల.. నమ్మక ద్రోహం.. తన పతనం.. తిరిగి ప్రతీకారం.. ఇలా ఒక మూసలో సాగిపోతుంది 'మట్కా'. కరుణ్ కుమార్ నరేషన్ అంతకంతకూ డల్ అయిపోవడంతో సినిమా ఎప్పుడు ముగుస్తుందా అనే ఫీలింగ్ లోకి వెళ్లిపోతారు ప్రేక్షకులు. అక్కడక్కడా డైౌలాగులు కొన్ని పేలుతాయి తప్ప.. సన్నివేశాల్లో మాత్రం ఏ మజా ఉండదు. అసలు ఏం ప్రత్యేకత ఉందని ఈ కథతో సినిమా చేశారనే ప్రశ్నలు రేకెత్తిస్తుంది 'మట్కా'. 60, 70, 80 దశకాల్లోని పరిస్థితులను బాగా చూపించినా.. నిర్మాణ విలువలు బాగున్నా.. ఈ కథకు తగ్గ సెటప్ కుదిరినా.. సరైన మూడ్ సెట్ చేయగలిగినా.. వరుణ్ తేజ్ సహా ఆర్టిస్టుల పెర్ఫామెన్స్ బాగున్నా.. మట్కా నేపథ్యం మినహాయిస్తే కథలో కొత్తదనం కనిపించకపోవడం.. డల్ నరేషన్.. రొటీన్ సన్నివేశాలు.. 'మట్కా' మీద ఆసక్తిని అంతకంతకూ తగ్గించేస్తాయి. అసలే స్లో నరేషన్.. పైగా నిడివి బాగా ఎక్కువైపోవడంతో సినిమా ముగిసేసరికి నిట్టూర్పు తప్పదు. కరుణ్ కుమార్ గత సినిమాలను దృష్టిలో ఉంచుకుని ఒక అభిరుచితో సినిమా చూద్దామనుకున్న వాళ్లకు కూడా 'మట్కా' నీరసమే తెప్పిస్తుంది. మట్కా కాన్సెప్ట్.. కొన్ని డైలాగులు.. వరుణ్ తేజ్ పెర్ఫామెన్స్ మినహాయిస్తే 'మట్కా'లో చెప్పుకోదగ్గ
అంశాలు లేవు.
నటీనటులు:
వరుణ్ తేజ్ తన కెరీర్లో చెప్పుదకోదగ్గ పాత్రల్లో ఇదొకటిగా నిలుస్తుంది. పెద్ద జర్నీ ఉన్న క్యారెక్టర్ చేశాడిందులో. వేర్వేరు వయసులకు తగ్గట్లుగా లుక్ మార్చుకోవడమే కాదు.. ఆయా సమయాలకు తగ్గట్లుగా వ్యవహార శైలిని కూడా మారుస్తూ డిఫరెంట్ షేడ్స్ చూపించాడు. వయసు పెరిగే కొద్దీ వచ్చే పరిణతిని పాత్రలో చూపించిన విధానం ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా తన నేపథ్యం గురించి ఒక పిట్ట కథ రూపంలో చెప్పే ఓ సన్నివేశంలో వరుణ్ నటన స్టాండౌట్ గా నిలుస్తుంది. హీరోయిన్ మీనాక్షి చౌదరి.. 'లక్కీ భాస్కర్' తరహాలో హోమ్లీ క్యారెక్టర్ పాత్రలో కనిపించింది. కానీ ఆమె పాత్ర పరిధి తక్కువ. పెద్దగా నటించే అవకాశం రాలేదు. తన కంటే నోరా ఫతేహి పాత్రకే కొంచెం ప్రాధాన్యం ఉంది. ఇప్పటిదాకా ఐటెం సాంగ్స్ లో మాత్రమే చూసిన ఆమెను ఇలాంటి పాత్రలో చూడడం కొత్తగా అనిపిస్తుంది. తన పెర్ఫామెన్స్ ఓకే. విలన్ పాత్రలో జాన్ విజయ్ రొటీన్ గా అనిపిస్తాడు. కిషోర్ పర్వాలేదు. నవీన్ చంద్ర తన పాత్రలో రాణించాడు. సలోని.. అజయ్ ఘోష్.. సత్యం రాజేష్.. వీళ్లంతా బాగానే చేశారు.
సాంకేతిక వర్గం:
జి.వి.ప్రకాష్ కుమార్ సంగీతం డిఫరెంట్ స్టయిల్లో సాగింది. కానీ అది అందరికీ రుచించేలా మాత్రం లేదు. సినిమా శైలికి తగ్గట్లు సటిల్ గా సాగే మ్యూజిక్ ఇచ్చాడతను. చార్ట్ బస్టర్ అనిపించే పాట ఏదీ లేదు. పాటలు ఏదో అలా సాగిపోతాయి. నేపథ్య సంగీతం ఓ మోస్తరుగా అనిపిస్తుంది. కిషోర్ కుమార్ ఛాయాగ్రహణం బాగుంది. విజువల్స్ ఆకట్టుకుంటాయి. నిర్మాణ విలువలు సినిమాకు అవసరమైన స్థాయిలో ఉన్నాయి. దశాబ్దాల కిందటి వాతావరణాన్ని తెరపై బాగానే చూపించారు. కరుణ్ కుమార్ డైలాగ్స్ వరకు వారెవా అనిపించాడు. ''ఆశను అమ్ముతాం.. నమ్మకాన్ని కొంటాం'' లాంటి డైలాగుల్లో చూపించిన లోతును సినిమాలో చూపించలేకపోయాడు కరుణ్ కుమార్. కానీ ఆయన ఎంచుకున్న కథే చాలా రొటీన్. నరేషన్లో కొంచెం వైవిధ్యం చూపించినా.. గొప్ప మలుపులేమీ కనిపించకపోవడం.. ప్రేక్షకులకు హై ఇచ్చే ఎపిసోడ్లు ఆశించిన స్థాయిలో లేకపోవడం నిరాశ తప్పదు.
చివరగా: మట్కా.. తిరగబడ్డ జూదం
రేటింగ్- 2.25/5