'జితేందర్ రెడ్డి'
Date of Release: 2024-11-08
Virinchi Varma
Directer
Rakesh Varre
Star Cast
Riya Suman
Star Cast
Subbaraju
Star Cast
Muduganti Ravinder Reddy
Producer
Gopi Sundar
Music
'జితేందర్ రెడ్డి' మూవీ రివ్యూ
నటీనటులు: రాకేష్ వర్రే-వైశాలి-రియా సుమన్-సుబ్బరాజు-ఛత్రపతి శేఖర్- రవిప్రకాష్- బలగం సుధాకర్ రెడ్డి తదితరులు
సంగీతం: గోపీసుందర్
ఛాయాగ్రహణం: జ్ఞానశేఖర్
కథ-నిర్మాణం: ముదుగంటి రవీందర్ రెడ్డి
స్క్రీన్ ప్లే-దర్శకత్వం: విరించి వర్మ
బాహుబలి సహా కొన్ని చిత్రాల్లో క్యారెక్టర్ రోల్స్ చేసిన రాకేష్ వర్రే కథానాయకుడిగా 'ఉయ్యాల జంపాల' ఫేమ్ విరించి వర్మ రూపొందించిన చిత్రం.. జితేందర్ రెడ్డి. దివంగత విద్యార్థి నేత జితేందర్ రెడ్డి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా.. ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దీని విశేషాలేంటో చూద్దాం.
కథ:
జితేందర్ రెడ్డి చిన్నప్పట్నుంచి జాతీయ భావాలు కలిగిన కుర్రాడు. ఆరెస్సెస్ ప్రభావంతో అతను ప్రజల కోసం ఏదైనా చేయాలనే ఆలోచనలో ఉంటాడు. తమ ప్రాంతంలో లెఫ్ట్ భావజాలం.. నక్సలైట్ల వల్ల అభివృద్ధి ఆగిపోయిందని నమ్మిన అతను.. జనాలను చైతన్య పరచడానికి జాతీయ భావాలు పెంపొందించడం.. వారిని ప్రగతి బాట పట్టించడమే లక్ష్యంగా విద్యార్థి దశలోనే రాజకీయాల్లోకి అడుగు పెడతాడు. తన లక్ష్యం వైపు సాగే క్రమంలో అతడికి నక్సల్స్ నుంచి సమస్యలు ఎదురవుతాయి. వాటిని తట్టుకుని అంచెలంచెలుగా ఎదుగుతాడు. జనాల్లో ఆదరణ పెంచుకుంటాడు. ఎన్నికల్లో పోటీకి కూడా సిద్ధమవుతాడు. దీంతో రాజకీయ నేతలకు కూడా అతడంటే కంటగింపు మొదలవుతుంది. ఇంతమంది ప్రత్యర్థులను ఎదుర్కొని అతను నిలబడ్డాడా.. తన జీవితానికి ఎలాంటి ముగింపు లభించింది.. ఈ ప్రశ్నలకు తెర మీదే సమాధానం తెలుసుకోవాలి.
కథనం-విశ్లేషణ:
నిజ జీవితాల్లో సినిమాలకు అవసరమైనంత డ్రామా ఉండదు. అలా అని నిజ జీవిత కథల్లో ఎక్కువ డ్రామా నింపితే వాటి సహజత్వం దెబ్బ తిని నమ్మశక్యంగా అనిపించవు. వీటిని బ్యాలెన్స్ చేస్తూ బయోపిక్స్ తీయడం కత్తి మీద సామే. 'ఎం.ఎస్.ధోని', 'మహానటి' లాంటి సినిమాలు చూసి నిజ జీవిత కథలను తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నాలు చాలా జరిగాయి కానీ.. వాటిలో చాలా వరకు బోల్తా కొట్టినవే. అయినా ఆ తరహా సినిమాలు వస్తూనే ఉన్నాయి. తెలంగాణలోని జగిత్యాల ప్రాంతంలో ఒకప్పుడు విద్యార్థి నేతగా మంచి గుర్తింపు సంపాదించిన జితేందర్ రెడ్డి జీవితం గురించి ఆయన సోదరుడైన రవీందర్ రెడ్డి స్వయంగా తనే కథ రాసి సినిమాను నిర్మించాడు. అంతకుమించి ఈ సినిమా పట్ల ఆసక్తి రేకెత్తించే విషయం.. ఉయ్యాల జంపాల- మజ్ను లాంటి మంచి సినిమాలతో తన అభిరుచిని చాటిన విరించి వర్మ ఈ కథను డైరెక్ట్ చేయడం. దర్శకుడిగా తన రెండు చిత్రాలకు భిన్నమైన కథ అయినప్పటికీ విరించి వర్మ ఇందులోనూ తన అభిరుచిని.. సిన్సియారిటీని చూపించాడు. జితేందర్ రెడ్డి కథను నీట్ గా తెరపై ప్రెజెంట్ చేశాడు. కానీ జితేందర్ రెడ్డి కథలోనే సినిమాకు సరిపడా డ్రామా లేకపోవడం.. కథంతా ఒక ఫార్మాట్లో సాగిపోవడంతో ఈ సినిమా అంత ఎగ్జైటింగ్ గా అనిపించదు. కానీ ఉన్న కథను టీం చాలా నీట్ గా తీయడం వల్ల ఇదొక మంచి ప్రయత్నం అనిపించుకుంటుంది.
బయోపిక్ తీస్తున్నారంటే ఆ వ్యక్తి గురించి ఎక్కువమందికి తెలిసి ఉంటే.. తన జీవితంలోని సంఘటలను చరిత్రలో ప్రత్యేక స్థానం సంపాదించుకుని ఉంటే.. ఆ బయోపిక్ పట్ల ప్రేక్షకుల్లో ఆసక్తి పెరుగుతుంది. ఐతే జితేందర్ రెడ్డి జగిత్యాల ప్రాంతానికి పరిమితమైన నేత కావడం వల్ల అక్కడి వారికి తప్ప మిగతా వాళ్లు కొత్తగా తన గురించి తెలుసుకోవాల్సిందే. పైగా ఈ కథ నాలుగైదు దశాబ్దాల వెనుక నడవడం వల్ల ఆసక్తి తక్కువగానే ఉంటుంది. అలాంటపుడు ప్రేక్షకులను ఆశ్చర్యపరిచేలా సంచలన ఘటనలను సినిమాలో చూపిస్తే.. ప్రేక్షకులు ఎగ్జైట్ అవడానికి అవకాశముంటుంది. కానీ 'జితేందర్ రెడ్డి' లో అలా పేలిపోయే ఇన్సిడెంట్లు పెద్దగా కనిపించవు. మరో దర్శకుడైతే ఎక్కువ స్వేచ్ఛ తీసుకుని వీర లెవెల్లో హీరోయిజం పండించడానికి ప్రయత్నించేవాడేమో కానీ.. హీరో పాత్రను తీర్చిదిద్దే విషయంలో విరించి వర్మ కొంచెం పరిమితులు పెట్టుకున్నట్లే కనిపిస్తుంది. కొద్ది మోతాదులో సినిమాటిక్ లిబర్టీ తీసుకుని జితేందర్ పాత్రను 'హీరో' లక్షణాలను ఆపాదించడానికి ప్రయత్నించాడు. కానీ వాటి డోస్ సరిపోలేదనిపిస్తుంది. అందుకే సినిమా కొంచెం డల్లుగా నడుస్తున్న ఫీలింగ్ కలుగుతుంది.
నక్సలైట్లు అంటే హీరోలని.. లెఫ్ట్ భావజాలం చాలా గొప్పదని చాటే సినిమాలు బోలెడు చూశాం. కొన్ని వందల సినిమాలు ఇదే విషయాన్ని నూరి పోస్తూ వచ్చాయి. కానీ ఇప్పడు రైట్ భావజాలాన్ని గొప్పగా చూపించే ట్రెండ్ నడుస్తోంది. దేశం.. ధర్మం.. జాతీయ వాదం.. అంటూ జనాలకు మరో రకమైన ఐడియాలజీని ప్రభోదించే సినిమాల సంఖ్య ఇప్పుడు చాలా పెరిగింది. 'జితేందర్ రెడ్డి' కూడా ఇలా నాణేనికి మరో వైపు చూపించే ప్రయత్నమే. నక్సలైట్ల రాజ్యం నడుస్తున్న సమయంలో వారికి ఎదురెళ్లి జనాల్లో జాతీయ వాదం పెంచడానికి.. వారిని అభివృద్ధి దిశగా నడిపించడానికి ప్రయత్నం చేసిన వ్యక్తి కథ ఇది. కథానాయకుడికి ఇలాంటి భావజాలం ఉన్నపుడు.. అదే గొప్పదని చూపించాలనుకున్నపుడు మరో భావజాలాన్ని చెడుగా చూపించడం సహజమే. ఐతే ఎన్నో ఏళ్ల నుంచి చూస్తున్న సినిమాలతో కలిగిన ఒక అభిప్రాయాన్ని తప్పు అని చూపించే ప్రయత్నంగా 'జితేందర్ రెడ్డి' కనిపిస్తుంది. నక్సలైట్లను హీరోలుగా చూపించే కథలు వన్ సైడెడ్ గా అనిపించినట్లే.. రైట్ భావజాలం ఉన్న హీరోగా కథగా 'జితేందర్ రెడ్డి' కూడా ఒక వైపే సాగుతున్నట్లు అనిపిస్తుంది. కాబట్టి ఈ సినిమా కొందరికి రుచించకపోవచ్చు. కొందరికి మాత్రం భేష్ అనిపించవచ్చు. ఈ ఐడియాలజీ సంగతి పక్కన పెడితే జితేందర్ రెడ్డి జీవిత విశేషాలను దర్శకుడు నీట్ గా తెరపై ప్రెజెంట్ చేశాడు. పిల్లాడిగా ఉన్నపుడు తనకో భావజాలం ఏర్పడడానికి దారి తీసిన సంఘటనలను చక్కగా తీర్చిదిద్దాడు దర్శకుడు. ఆపై తన విద్యార్థి జీవితాన్ని.. స్టూడెంట్ లీడర్ గా ఎదుగుదలను కూడా ఆసక్తికరంగానే మలిచాడు. ఐతే నక్సలైట్లకు తనకు మధ్య పోరు.. ఆపై రాజకీయ జీవితం.. ఈ అంశాలన్నీ రొటీన్ అనిపిస్తాయి. సన్నివేశాలు మరీ మందగమనంతో సాగడం కూడా ఇబ్బంది పెడుతుంది. ముందే అన్నట్లు పేలిపోయే సంఘటనలు లేకపోవడం వల్ల కథనం బోరింగ్ గా అనిపిస్తుంది. ముగింపు సన్నివేశాలను మాత్రం దర్శకుడు బాగా తీర్చిదిద్దాడు. ఓవరాల్ గా చూస్తే జితేందర్ రెడ్డి అనే వ్యక్తి కథలో సినిమాకు అవసరమైన డ్రామా కనిపించదు. కానీ ఆ వ్యక్తి జీవితాన్ని తెరపై నీట్ గా ప్రెజెంట్ చేశారు. సినిమాటిక్ హై కోరుకోకుండా చరిత్రలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న ఓ వ్యక్తి జీవితాన్ని ఓపికతో చూడాలనుకుంటే 'జితేందర్ రెడ్డి'పై ఓ లుక్కేయొచ్చు.
నటీనటులు:
సహాయ పాత్రల్లో కనిపించిన రాకేష్ వర్రే హీరోగా తన ప్రత్యేకతను చాటుకున్నాడు. జితేందర్ రెడ్డి పాత్రలో అతను సిన్సియర్ పెర్ఫామెన్స్ ఇచ్చాడు. తన నటనలో పరిణతి కనిపిస్తుంది. పాత్రకు అవసరమైన గాంభీర్యాన్ని తీసుకురావడంలో రాకేష్ విజయవంతం అయ్యాడు. తన లుక్ కూడా బాగుంది. చాలా సన్నివేశాల్లో సటిల్ గా పెర్ఫామ్ చేసి రాకేష్ తన ప్రత్యేకతను చాటుకున్నాడు. హీరోకు జోడీగా నటించి వైశాలి ఓకే అనిపిస్తుంది. రియా సుమన్ పర్వాలేదు. నక్సలైట్ పాత్రలో ఛత్రపతి శేఖర్ తన ముద్ర వేశాడు. రవిప్రకాష్ కూడా బాగానే చేశాడు. కీలక పాత్రలో సుబ్బరాజు రాణించాడు. మిగతా ఆర్టిస్టులంతా కూడా తమ పరిధిలో బాగానే నటించారు.
సాంకేతిక వర్గం:
సాంకేతికంగా 'జితేందర్ రెడ్డి'లో మంచి ప్రమాణాలు కనిపిస్తాయి. గోపీసుందర్ నేపథ్య సంగీతంతో సినిమాను డ్రైవ్ చేశాడు. ఆర్ఆర్ ఇంటెన్స్ గా సాగింది. పాటలు ఓకే. జ్ఞానశేఖర్ ఛాయాగ్రణం సినిమాలోని మేజర్ హైలైట్లలో ఒకటి. నాలుగైదు దశాబ్దాల కిందటి వాతావరణాన్ని తెరపైకి తీసుకురావడంలో ఆయన కెమెరా పనితనం కీలక పాత్ర పోషించింది. నిర్మాణ విలువలకు సినిమాకు అవసరమైన స్థాయిలో ఉన్నాయి. దర్శకుడు విరించి వర్మ.. తన చేతికి ఇచ్చిన కథకు వీలైనంత మేర న్యాయం చేశాడు. సినిమా నీట్ గా తీశాడు. కానీ మరీ నెమ్మదిగా సాగే తన నరేషన్ స్టైల్ అందరికీ రుచించకపోవచ్చు. ఈ కథకు ఆ శైలే కరెక్ట్ అయినా సరే.. ప్రేక్షకులను ఎంగేజ్ చేయడం కష్టం. బేసిగ్గా సినిమాగా చెప్పేంత బలం కథలో లేకపోవడం ఇందులో లోపం కావచ్చు కానీ.. ఈ కథకు దర్శకుడిగా విరించి మాత్రం న్యాయం చేశాడు.
చివరగా: జితేందర్ రెడ్డి.. మెరుపులు తగ్గిన మంచి ప్రయత్నం
రేటింగ్-2.5/5