Begin typing your search above and press return to search.
అర్ధమయ్యిందా అరుణ్ కుమార్ (వెబ్ సీరీస్)
![అర్ధమయ్యిందా అరుణ్ కుమార్ (వెబ్ సీరీస్) అర్ధమయ్యిందా అరుణ్ కుమార్ (వెబ్ సీరీస్)](https://content.tupaki.com/twdata/2023/0723/reviews/Ardhamaindha-Arun-Kumar-Review-1688194107-132.jpg)
Date of Release: 2023-07-01
సినిమాటోగ్రఫీ: అమర్ దీప్ గుత్తుల
సంగీత దర్శకుడు: అజయ్ అరసాడ
దర్శకులు : జొనాథన్ ఎడ్వర్డ్స్
నిర్మాతలు: నరేష్ రెడ్డి
ప్రతి వీకెండ్ థియేటర్ లో సినిమాలు ఎలా రిలీజ్ అవుతాయో.. ప్రతి వీకెండ్ ఆహా ఓటీటీలో కూడా ఏదో ఒక సినిమానో వెబ్ సీరీసో రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. తెలుగు ఆడియన్స్ కు కంప్లీట్ ఎంటర్టైన్మెంట్ అందించే విషయంలో ఆహా ప్రతి వారం సరికొత్త రిలీజ్ లతో వస్తుంది. ఈ వారం అర్ధమయ్యిందా అరుణ్ కుమార్ వెబ్ సీరీస్ తో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమైంది. అర్ధమయ్యిందా అరుణ్ కుమార్ సీజన్ 1 ఐదు ఎపిసోడ్ లతో ఈ వెబ్ సీరీస్ రిలీజైంది. మరి ఈ సీరీస్ ఎలా ఉందో సమీక్షలో చూద్దాం.
కథ :
అమలాపురం నుంచి ఒక స్టార్టప్ కంపెనీలో ఇంటర్న్ గా జాయిన్ అవుతాడు అరుణ్ కుమార్ (హర్షిత్ రెడ్డి). ఊరి నుంచి వచ్చాడు కాబట్టి సర్దుకుపోయే మనస్థత్వం అతనిలో ఉంటుంది. ఇంటర్న్ గా వచ్చిన అరుణ్ కుమార్ ఫస్ట్ జై కింద పనిచేస్తుండగా అక్కడ నుంచి అతన్ని షాలిని (తేజస్వి) తన టీం లోకి తీసుకుంటుంది. ఇంటర్న్ గా వచ్చిన అరుణ్ కుమార్ ని ఆఫీస్ అసిస్టెంట్ డ్యూటీ చేయిస్తుంటారు. ఈ టైం లోనే పల్లవి (అనన్య) అరుణ్ కుమార్ కష్టాలు చూసి కాస్త సపోర్ట్ గా ఉంటుంది. తన దగ్గర పనిచేస్తున్న అరుణ్ కి కాస్త క్లోజ్ అవుతుంది షాలిని. ఓ పక్క అరుణ్ ని ఇష్టపడిన పల్లవి అతనికి దూరమవుతుంది. అరుణ్ కుమార్ నుంచి దూరంగా వెళ్లాలని పల్లవి జాబ్ మానేయాలని అనుకుంటుంది. ఈ విషయాలన్నీ తెలిసిన అరుణ్ కుమార్ ఏం చేశాడు అన్నది వెబ్ సీరీస్ కథ.
కథనం - విశ్లేషణ :
విలేజ్ నుంచి వచ్చిన హీరో ఒక స్టార్టప్ కంపెనీలో ఇంటర్న్ గా జాయిన్ అవ్వడం అక్కడ సీనియర్స్ అతన్ని ఆఫీస్ అసిస్టెంట్ గా పని చేయించడం లాంటి కథలు చాలా వచ్చాయి.. ఈ సీరీస్ లో జై పాత్ర అరుణ్ కుమార్ తో ఫ్లష్ కొట్టించే సీన్ చూస్తే ఏంటి కొత్త వాళ్లని సాఫ్ట్ వేర్ ఆఫీస్ లో ఇలా ట్రీట్ చేస్తారా అన్న డౌట్ మాత్రం వస్తుంది. అఫ్కోర్స్ సినిమాటిక్ లిబర్టీ ఉంటుంది కాబట్టి బహుశా దాన్ని కాస్త పెద్దగా చేసి చూపించొచ్చు.
రాముడు మంచి బాలుడు అనే టైప్ లో అరుణ్ కుమార్ పాత్ర డిజైన్ చేసిన దర్శకుడు ఈ కాలంలో అందరు డ్రింక్ చేయడం సహజమని చూపించాడు. ఇక కథ డిమాండ్ మేరకు షాలినితో లిప్ లాక్ లాంటివి కూడా చూపించాడు. మరి ఎంత తాగినా సరే హీరో అలా కమిటవడం అంత కరెక్ట్ గా అనిపించదు. మరోపక్క తనకి మోరల్ సపోర్ట్ గా ఉన్న పల్లవితో పొడిపొడి మాటలతోనే సరిపెట్టుకుంటాడు అరుణ్ కుమార్.
తీరా ఎండ్ కి వచ్చే సరికి పల్లవి తనని ప్రేమిస్తుందని తెలుసుకుని పల్లవిని ప్రేమిస్తాడు. అరుణ్ కుమార్ పల్లవిల మధ్య ఇంకాస్త బలమైన సీన్స్ పడి ఉంటే బాగుండేదని అనిపిస్తుంది. ఇంకోటి అరుణ్ కుమార్ షాలినితో లిప్ లాక్ చేసేంత కెమిస్ట్రీ ఎలా వర్క్ అవుట్ అయ్యింది అన్నది కూడా అర్థం కాదు. అఫ్కోర్స్ ఇదంతా జై మీద షాలినికి ఉన్న కోపం వల్లే అన్న హింట్ కూడా ఇస్తాడు.
అర్ధమయ్యిందా అరుణ్ కుమార్ వెబ్ సీరీస్ ఐదు ఎపిసోడ్ లు ఒక్కొక్కటి 25 నిమిషాల డ్యూరేషన్ తో అలా సాగిపోతుంది. పెద్దగా ఎంటర్టైన్ అవలేరు కానీ ఓ ఇన్నోసెంట్ గాయ్ జీవితం మీద ఎన్నో ఆశలతో ఒక జాబ్ లో జాయిన్ అయితే అక్కడ ఆఫీస్ అట్మాస్పియర్ ఎలా ఉంటుంది.. వాటిని ఎలా దాటి విజయం సాధించాలి అన్నది చూపించారు.
అమ్మకి హార్ట్ ఎటాక్ వచ్చినా సరే అరుణ్ కుమార్ ఆఫీస్ లో పని ఉందని ఆగిపోవడం లాంటివి అంత యాక్సెప్టెన్సీ అనిపించవు. తన కంపెనీ ఎం.డి అని తెలియక టెర్రస్ మీద అభినవ్ గోమటం ఇచ్చిన ఆఫర్ ను రిజెక్ట్ చేసి అతని దగ్గర మంచి మార్కులు కొట్టేసి తన జాబ్ పర్మినెంట్ చేసుకుంటాడు అరుణ్ కుమార్. ఫైనల్ గా అర్ధమయ్యిందా అరుణ్ కుమార్ నో హై మూమెంట్స్, నో ట్విస్ట్, అలా అలా వెళ్లిపోతుంది. అయితే సీరీస్ ను ఆసక్తికరంగా మలచడంలో దర్శకుడు విఫలమయ్యాడు. సాఫ్ట్ వేర్ జాబ్ లో కొత్త వారి కష్టాలు కొంతమేరకు చూపించినా లవ్ స్టోరీ విషయంలో ఆకట్టుకోలేకపోయాడు. ఫైనల్ గా మరీ బోర్ కొడితే ఒకసారి అలా చూసేలా అర్ధమయ్యిందా అరుణ్ కుమార్ ఉంది. సీజన్ 1 ఎండింగ్ ని కూడా ఏమంత ఆసక్తిగా పూర్తి చేయలేదు. ముఖ్యంగా సీజన్ 2 గురించి ఎదురుచూసేలా చేయడంలో కూడా దర్శకుడు విఫలమయ్యాడు.
నటీనటులు :
అరుణ్ కుమార్ పాత్రలో హర్షిత్ రెడ్డి మెప్పించాడు. విలేజ్ నేటివిటీకి తగిన లుక్స్, సిటీ లైఫ్ తో ఇబ్బంది పడే క్యారెక్టరైజేషన్.. ఇచ్చిన పాత్రకు తన వరకు బాధ్యతగా చేశాడని అనిపిస్తుంది. అనన్యా పాత్రకు అంత ప్రాముఖ్యత లేదు. ఉన్న సీన్స్ లో అయితే ఆమె తన నటనతో మెప్పించింది. ఇక తేజస్వి మడివాడ కూడా షాలిని పాత్రలో తన మార్క్ చూపించింది. హర్షిత్ తో లిప్ లాక్ ఆమె ఫ్యాన్స్ కి ట్రీట్ అందిస్తుంది. వాసు ఇంటూరి, జై ఇలా పాత్రధారులంతా కూడా తమ పాత్రలకు న్యాయం చేశారు.
సాంకేతిక వర్గం :
అర్ధమయ్యిందా అరుణ్ కుమార్ కు అజయ్ మ్యూజిక్ అందించారు. కూల్ గోయింగ్ మ్యూజిక్ తో సీరీస్ ను ఆహ్లాదకరంగా మార్చడానికి సంగీతం కాస్త హెల్ప్ అయ్యింది. కెమెరా మెన్ అమరదీప్ కూడా నీట్ గా చేశారు. సీరీస్ అంతా కూడా చాలా తక్కువ లొకేషన్స్ లోనే పూర్తయినట్టు అనిపిస్తుంది. లైటింగ్ కూడా సీరీస్ కు ఎంత కావాలో అంత పెట్టారు. దర్శకుడు జొనాథన్ ఎడ్వర్డ్స్ ఇదివరకు ప్రయాణీకుడు సినిమా తీశాడు. అర్ధమయ్యిందా అరుణ్ కుమార్ సీజన్ 1 మొత్తం అతని చెప్పాలనుకున్న పాయింట్ ని పూర్తిగా చెప్పలేకపోయాడని అర్థమవుతుంది. అరుణ్ కుమార్, పల్లవి, షాలిని వీరి మధ్య ఇంకాస్త ఇంట్రెస్టింగ్ సీన్స్ రాసుకుని ఉంటే బాగుండేది. ఈ వెబ్ సీరీస్ 2016లో హిందీలో వచ్చిన అఫీషియల్ చుక్యాగిరి కి రీమేక్ గా వచ్చింది. రీమేక్ చేయాల్సినంత ఏముంది ఈ కథలో అన్నట్టుగా సీరీస్ ఉంది. ఎడిటింగ్ విషయంలో కూడా ఇంకాస్త జాగ్రత్త పడితే బాగుండేది అనిపిస్తుంది. ఎడిటింగ్ విషయంలో కొంత డిజప్పాయింట్ చేస్తుంది. అర్ధమయ్యిందా అరుణ్ కుమార్ కథనం ఇంకాస్త గ్రిప్పింగ్ గా.. స్పీడ్ గా ఉంటే బాగుండేది అనిపిస్తుంది. నరేష్ రెడ్డి నిర్మాతగా వెబ్ సీరీస్ కు ఎంత బడ్జెట్ కావాలో అంత పెట్టారని చెప్పొచ్చు.
చివరగా : అర్ధమయ్యిందా అరుణ్ కుమార్.. పూర్తిగా అర్థం కాలేదు..!