సరిపోదా శనివారం
Date of Release: 2024-08-29
Vivek Athreya
Directer
Nani
Star Cast
SJ Suryah
Star Cast
Priyanka Arul Mohan
Star Cast
Sai Kumar
Star Cast
DVV Danayya
Producer
Jakes Bejoy
Music
'సరిపోదా శనివారం' మూవీ రివ్యూ
నటీనటులు: నాని-ఎస్.జె.సూర్య-ప్రియాంక మోహన్-సాయికుమార్-మురళీ శర్మ-అదితి బాలన్-అభిరామి-హర్షవర్ధన్-విష్ణు ఓయ్- అజయ్-సత్యప్రకాష్-అనిత చౌదరి-ఆలీ తదితరులు
సంగీతం: జేక్స్ బిజోయ్
ఛాయాగ్రహణం: మురళి.జి
నిర్మాతలు: డీవీవీ దానయ్య-కళ్యాణ్ దాసరి
రచన-దర్శకత్వం: వివేక్ ఆత్రేయ
గత ఏడాది దసరా లాంటి మాస్ మూవీ.. హాయ్ నాన్న లాంటి క్లాస్ చిత్రంతో ప్రేక్షకులను మెప్పించాడు నాని. ఇప్పుడు అతను మాస్-క్లాస్ మిక్స్ అయిన 'సరిపోదా శనివారం' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కథ పరంగా కొత్తగా ఉంటూనే మాస్ ఎలిమెంట్స్ కూడా ఉన్న సినిమాలా కనిపించిన 'సరిపోదా శనివారం' మంచి అంచనాల మధ్య ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఆ అంచనాలను సినిమా ఏమేర అందుకుందో చూద్దాం పదండి.
కథ:
సూర్య (నాని)కు చిన్నతనం నుంచి కోపం ఎక్కువ. దాన్ని ఎలా నియంత్రించాలో తల్లిదండ్రులకు అర్థం కాదు. ఐతే అనారోగ్యం వల్ల చనిపోవడానికి ముందు తన కోపాన్ని వారంలో ఒక్క రోజు మాత్రమే చూపించాలని సూర్య దగ్గర మాట తీసుకుంటుంది తల్లి. ఆ ప్రకారం అతను వారంలో మిగతా రోజులు ఎవరి మీద కోపం వచ్చినా దాచుకుని.. ఒక్క శనివారం మాత్రం ఆ కోపాన్ని తీర్చుకోవడం అలవాటు చేసుకుంటాడు. ఈ క్రమంలో తప్పులు చేసిన చాలామందికి శనివారాల్లో బుద్ధి చెబుతుంటాడు. ఐతే ఒక సందర్భంలో సీఐ దయానంద్ (ఎస్.జె.సూర్య) మీద సూర్యకు కోపం వస్తుంది. కానీ పరమ రాక్షసుడిగా పేరున్న దయను ఢీకొట్టడంతో సూర్య తీవ్ర ఇబ్బందుల్లో పడతాడు. మరి ఆ ఇబ్బందులేంటి.. వాటిని అధిగమించి దయ మీద సూర్య పైచేయి సాధించగలిగాడా అన్నది మిగతా కథ.
కథనం-విశ్లేషణ:
కొత్త కథ.. కమర్షియల్ సినిమా.. ఇవి రెండూ ఒక ఒరలో ఒదగని రెండు కత్తుల్లాంటివి. చాలా కొత్తగా.. క్రేజీగా అనిపించే కాన్సెప్ట్ తీసుకుంటే దానికి సూటయ్యే శైలిలోనే చెప్పాలి. అలా కాకుండా దానికి మాస్ టచ్ ఇచ్చి కమర్షియల్ స్టైల్లో చెప్పాలని చూస్తే ఇంటెన్సిటీ దెబ్బ తినొచ్చు. ఆ కథకు.. దాని నడతకు పొంతన కుదరక మొత్తంగా సినిమా చెడిపోయే ప్రమాదం ఉంటుంది. కానీ అరుదుగా మాత్రం కొందరు దర్శకులు కొత్త ఐడియాలను కమర్షియల్ స్టయిల్లో చెప్పి.. ప్రేక్షకుల ఆమోదం పొందుతారు. 'గజిని' లాంటి సినిమాలు ఈ కోవకే చెందుతాయి. అందులో మనం చూసింది పూర్తిగా కొత్త కథ. ఐతే ఆ కథను కమర్షియల్ మీటర్లోనే మంచి బిగితో చెప్పి ఘనవిజయాన్నందుకున్నాడు మురుగదాస్. మరీ 'గజిని' స్థాయి క్రేజీ స్టోరీ అనలేం. అందులో ఉన్నంత బిగీ కనిపించకపోవచ్చు. కానీ 'సరిపోదా శనివారం ' కూడా దాంతో పోల్చగల కొత్తదనం ఉన్న కమర్షియల్ సినిమా. ఒక కొత్త ఐడియాను మాస్ కూడా మెచ్చేలా ప్రెజెంట్ చేయడంలో వివేక్ ఆత్రేయ విజయవంతమయ్యాడు.
నా పేరు సూర్య.. అర్జున్ రెడ్డి.. డియర్ కామ్రేడ్ లాంటి చిత్రాల్లో యాంగర్ ఇష్యూస్ ఉన్న హీరో పాత్రలను చూశాం. 'సరిపోదా శనివారం'లో కూడా హీరోకు అలాంటి సమస్యే ఉంటుంది. కానీ ఆ చిత్రాలతో పోలిస్తే ఇక్కడ హీరో పాత్ర ఎంటర్టైనింగ్ గా సాగడం.. ఆ కోపంలో ఒక ట్విస్ట్ ఉండడమే దీన్ని ప్రత్యేకంగా నిలబెడుతుంది. అమ్మకిచ్చిన మాట కోసం వారంలో ఆరు రోజులు కోపాన్ని అణుచుకుని ఉంటూ ఒక్క శనివారం రోజు మాత్రం చెలరేగిపోయే హీరో కథ ఇది. వినడానికి క్రేజీగా అనిపించినా.. దీని మీద మూడు గంటల కథను నడిపించడం అంటే కత్తి మీద సాము లాంటి వ్యవహారమే. ఈ పాయింటుని కన్విన్సింగ్ గా చెప్పడం అంత తేలిక కాదు. దీని మీద కాసేపు కామెడీ చేయించి.. ఆ తర్వాత వేరే కథలోకి వెళ్లిపోవడం అంటే ఓకే కానీ.. మూడు గంటల నిడివితో ఓ కథను నడిపించడం.. అందులో వినోదం పండిస్తూనే ఇంటెన్స్ డ్రామాను కూడా వర్కవుట్ చేయడం అంత తేలిక కాదు. కానీ వివేక్ ఆత్రేయ ఈ పనిని సమర్థంగా చేయగలిగాడు. హీరో అలా శనివారం నియమం ఎందుకు పెట్టుకున్నాడు అనే విషయాన్ని ఆరంభంలోనే చాలా బలంగా.. ఎమోషనల్ టచ్ తో చెప్పడం ద్వారా ప్రేక్షకులను ఈ కథకు బాగా ప్రిపేర్ చేయగలిగాడు. ఆ తర్వాత ఓవైపు వినోదం పండిస్తూనే ఇంటెన్స్ డ్రామాతో ప్రేక్షకులను చాలా వరకు ఎంగేజ్ చేశాడు. పాటలు కూడా లేకుండా 2 గంటల 54 నిమిషాల నిడివితో సినిమా సాగడం వల్ల కొంత సాగతీతగా అనిపించడం ఒక్కటే 'సరిపోదా శనివారం'లో సమస్య.
హీరో శనివారం మాత్రమే తన కోపాన్ని చూపించడం వెనుక కథేంటి.. ఈ విషయంలో తనెంచుకున్న పద్ధతేంటి.. ఈ అంశాలను చూపించడానికే తొలి అర్ధగంటను ఉపయోగించుకున్నాడు వివేక్ ఆత్రేయ. ఇది కొంచెం లెంగ్తీగా అనిపించినా.. ఎక్కడా ఆసక్తి తగ్గనీయకుండా హీరో పరిచయ సన్నివేశాలను క్రేజీగా డిజైన్ చేశాడతను. తెలుగులో చాలా కొత్తగా అనిపించే ఇంట్రో సీన్లలో ఇది ఒకటిగా నిలుస్తుంది. కథనం కొంచెం నెమ్మదిస్తున్న సమయంలో సీఐ దయాగా విలన్ పాత్రలో పరిచయమయ్యే ఎస్.జె.సూర్య తర్వాతి కథనాన్ని నడిపించే బాధ్యతను తాను తీసుకుంటాడు. సూర్య-మురళీ శర్మ మధ్య పెట్టి అన్నదమ్ముల గొడవ ట్రాక్ ను అసలు కథకు ముడిపెట్టిన తీరు బాగుంది. సూర్య పాత్రను భలేగా డిజైన్ చేయడం.. అతను తనదైన స్క్రీన్ ప్రెజెన్స్.. వెరైటీ నటనతో మెప్పించడంతో కథనం మరింత రసవత్తరంగా మారుతుంది. తిక్క క్యారెక్టర్లంటే చెలరేగిపోయే సూర్యకు.. నప్పే పాత్ర పడడంతో తన సీన్లు చాలా ఎంటర్టైనింగ్ గా మారాయి. హీరో-విలన్ తొలిసారి ముఖాముఖి ఎదురుపడే సీన్ భలేగా అనిపిస్తుంది. ఐతే తర్వాత వచ్చే రొమాంటిక్ ట్రాక్ దగ్గర మాత్రం 'సరిపోదా శనివారం' కొంచెం నెమ్మదిస్తుంది. అలాగే సోకులపాలెం ఊరికి సంబంధించిన వ్యవహారంలో కొంచెం నాటకీయత ఎక్కువైనట్లు అనిపిస్తుంది. హీరో.. విలన్ మధ్య క్లాష్ మొదలవడంతో ఇంటెర్వెల్ ముంగిట 'సరిపోదా శనివారం' ఊపందుకుంటుంది. ఇంటర్వెల్ బ్యాంగ్ బాగుంది. మాస్ కు గూస్ బంప్స్ ఇస్తుందా సీన్.
విరామం దగ్గర వచ్చే మలుపుతో ద్వితీయార్ధం మీద ఆసక్తి పెరగడం.. తీరా చూస్తే సినిమా రెండో అర్ధంలో డౌన్ అయిపోవడం చాలా సినిమాల్లో చూస్తుంటాం. కానీ 'సరిపోదా శనివారం' ఆ కోవకు చెందదు. సెకండాఫ్ మొదలయ్యాక ఓ 40 నిమిషాలు రేసు గుర్రంలా పరుగెడుతుంది కథనం. విలన్ని దెబ్బ కొట్టడానికి హీరో వేసే స్కెచ్.. దీని చుట్టూ డ్రామాతో సన్నివేశాలు ఆసక్తికరంగా నడుస్తాయి. తర్వాత ఏం జరుగుతుందనే క్యూరియాసిటీని పెంచేలా ఉంటాయి సీన్లు. విలన్ని చిక్కుల్లో పడేయాలనుకుంటే.. హీరోను చిక్కుల్లో పడడం డ్రామాను మరింత రసవత్తరంగా మారుస్తుంది. ఇంత వరకు బాగానే అనిపించినా.. ప్రి క్లైమాక్సులో 'సరిపోదా శనివారం' ఉన్నట్లుండి నెమ్మదించి.. డీవియేట్ అవుతున్న భావన కలుగుతుంది. నేరుగా క్లైమాక్సుకు వెళ్లిపోకుండా కొన్ని అనవసర సీన్లతో దర్శకుడు కాలయాపన చేశాడనిపిస్తుంది. క్లైమాక్స్ కూడా కొంచెం లెంగ్తీగానే నడుస్తుంది కానీ.. అది ఆకట్టుకుంటుంది. మామూలుగా సాగిపోతున్న క్లైమాక్సులోకి సాయికుమార్ ఎంట్రీ ఇచ్చి దానికో కొసమెరుపు ఇచ్చాడు. దీంతో పతాక సన్నివేశం రసవత్తరంగా మారింది. ఓవరాల్ గా సినిమా కొంచెం లెంగ్తీగా.. కొన్ని చోట్ల నెమ్మదిగా అనిపించినా.. వాటిని మరిపించే పాజిటివ్ విషయాలు 'సరిపోదా శనివారం'లో చాలానే ఉన్నాయి. కొత్తదనాన్ని.. మాస్ అంశాలను బ్యాలెన్స్ చేస్తూ సాగిన ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులనూ మెప్పిస్తుంది.
నటీనటులు:
క్లాస్ పాత్రలు అలవోకగా చేసేసే నాని.. మాస్ పాత్రలను మోయగలడా అనే సందేహాలుండేవి ఒకప్పుడు. 'ఎంసీఏ'లో ఆ ప్రయత్నం చేసినా అంతగా కుదిరినట్లు అనిపించలేదు. కానీ 'దసరా'తో మాస్ పాత్రల్లో కూడా ఒదిగిపోగలనని రుజువు చేసుకున్నాడు. ఇప్పుడు 'సరిపోదా శనివారం'లో అంత ఊర మాస్ లేకపోయినా.. క్లాస్ గా కనిపిస్తూనే మాస్ పండించాల్సిన క్యారెక్టర్లో నాని ఆకట్టుకున్నాడు. ఎక్కువ హడావుడి చేయకుండా.. తన స్టయిల్లో సటిల్ గానే ఈ పాత్రను పండించాడు. వీలైనంత మేర ప్రశాంతంగానే కనిపిస్తూ.. అవసరమైనపుడు ఉగ్రరూపం చూపించాల్సిన పాత్రలో నాని కరెక్ట్ మీటర్లో పెర్ఫామ్ చేశాడు. సూర్య పాత్రలో నాని చూపించిన స్టైల్ కూడా ఆకట్టుకుంటుంది. ఇక పెర్ఫామెన్స్ పరంగా నానిని ఎస్.జె.సూర్య డామినేట్ చేశాడు. కొంచెం తేడాగా ప్రవర్తించే.. సైకో లక్షణాలున్న పాత్రల్లో సూర్య తన ప్రత్యేకతను చాటుకుంటాడు. తనకు వివేక్ ఆత్రేయ అలాంటి పాత్రనే ఇవ్వడంతో ఇవ్వడంతో చెలరేగిపోయాడు. సినిమాలో హీరోను మించి గుర్తుండే పాత్ర సూర్యదే అంటే అతిశయోక్తి కాదు. తన పాత్ర కనిపించినపుడల్లా ప్రేక్షకుల్లో ఒక అటెన్షన్ వస్తుంది. అంత బాగా చేశాడు సూర్య. మరో కీలక పాత్రలో మురళీ శర్మ కూడా భలేగా చేశాడు. కొన్ని సీన్లలో కనిపించినా.. ప్రతిసారీ తన ముద్ర చూపించాడు. హీరో తండ్రి పాత్రలో సాయికుమార్.. అక్క క్యారెక్టర్లో అదితి బాలన్ కూడా పర్ఫెక్ట్ అనిపిస్తారు. తల్లి పాత్రలో అభిరామి కొన్ని నిమిషాలే కనిపించినా.. తన పాత్ర-నటన గుర్తుండిపోతాయి. హర్షవర్ధన్.. ఆలీ.. శివాజీ రాజా.. విష్ణు వీళ్లంతా తమ పరిధిలో బాగానే చేశారు.
సాంకేతిక వర్గం:
టెక్నికల్ గా 'సరిపోదా శనివారం' సౌండ్ ఫిలిమే. జేక్స్ బిజోయ్ బ్యాగ్రౌండ్ స్కోర్ తో మోత మోగించేశాడు. అక్కడక్కడా కొంచెం లౌడ్ అనిపిస్తుంది కానీ.. చాలా వరకు సన్నివేశాలను పరుగెత్తించడంలో తన బీజీఎం ముఖ్య పాత్ర పోషించింది. హీరో ఎలివేషన్ సీన్లు.. యాక్షన్ ఘట్టాల్లో స్కోర్ మంచి ఊపుతో సాగింది. సినిమాలో పూర్తి స్థాయి పాట ఒక్కటీ లేదు కానీ.. బిట్ సాంగ్స్ ఓకే అనిపిస్తాయి. మురళి.జి ఛాయాగ్రహణం కూడా చాలా బాగుంది. హీరో ఇంట్లో నడిచే ఫైట్ల.. క్లైమాక్స్ సీక్వెన్సులో కెమెరాతో సరికొత్త విన్యాసాలు చూస్తాం. అవి ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచుతాయి. నిర్మాణ విలువలు బాగున్నాయి. ఇక రైటర్ కమ్ డైరెక్టర్ వివేక్ ఆత్రేయ.. తనను తాను ఈ చిత్రంతో కొత్తగా ఆవిష్కరించుకున్నాడు. ఇప్పటిదాకా తన కథలు కొత్తగా ఉన్నా.. వినోదం పంచినా.. వాటిలో కమర్షియాలిటీ తక్కువగా కనిపించేది. కానీ ఈసారి ఓ కొత్త ఐడియాకు మాస్ మసాలా జోడించి సినిమాను జనరంజకంగా మార్చాడు. ప్రధాన పాత్రలను డిజైన్ చేసుకున్న తీరు.. స్క్రీన్ ప్లే.. ఆసక్తికరంగా అనిపిస్తాయి. ప్రథమార్ధంలో కొన్ని చోట్ల.. ప్రి క్లైమాక్సులో కథనం కొంచెం నెమ్మదించిన భావన కలుగుతుంది తప్ప.. ఓవరాల్ గా వివేక్ పనితనానికి వంక పెట్టడానికి లేదు. రచయితగా.. దర్శకుడిగా అతడికి మంచి మార్కులు పడతాయి.
చివరగా: సరిపోదా శనివారం.. సరిపడా వినోదం
రేటింగ్- 3/5