Begin typing your search above and press return to search.

అమెరికాలో తెలుగు విద్యార్థి మృతి... హత్య..? ఆత్మహత్యా..?

అమెరికాలో మృత్యువాత పడుతున్న తెలుగు విద్యార్థుల జాబితాలో మరో పేరు యాడ్ అయ్యింది.

By:  Tupaki Desk   |   24 Dec 2024 5:25 AM GMT
అమెరికాలో తెలుగు విద్యార్థి మృతి... హత్య..? ఆత్మహత్యా..?
X

అమెరికాలో మృత్యువాత పడుతున్న తెలుగు విద్యార్థుల జాబితాలో మరో పేరు యాడ్ అయ్యింది. ఈ అత్యంత విషాదకరమైన ఘటన అమెరికాలోని మిన్నెసోటాలో జరిగింది. అతడు నివాసముంటున్న అపార్ట్ మెంట్ బేస్ మెంట్ లో పార్క్ చేసిన కారులోనే అతడు అనుమానాస్పద స్థితిలో మరణించినట్లు చెబుతున్నారు.

అవును... మెన్నెసోటాలోని తన అపార్ట్ మెంట్ కాంప్లెక్స్ బేస్ మెంట్ లో పార్క్ చేసిన కారులో బండి వంశీ (25) అనే యువకుడు అనుమానాస్పద స్థితిలో చనిపోయినట్లు గుర్తించారు. మాగ్నోలియా ట్రైల్ ఈడెన్ ప్రైరీ అపార్ట్ మెంట్ లోని రు.206లో నివాసం ఉంటున్న అతడు డిసెంబర్ 21న మృతి చెందినట్లు చెబుతున్నారు.

అయితే... ప్రాథమిక నివేదికలు అతడు ఆత్మహత్య చేసుకుని చనిపోయినట్లు చెబుతున్నారని అంటున్నప్పటికీ.. ఆ మృతదేహం చుట్టుపక్కల ఉన్న పరిస్థితులు మాత్రం అధికారులు, అతని కుటుంబ సభ్యుల్లో అనుమానాలు పెంచాయని అంటున్నారు.

హుజూరాబాద్ నియోజకవర్గం కమలాపూర్ మండలం మాదన్నపేట్ గ్రామానికి చెందిన వంశీ.. అమెరికాలోని కంకోర్డియా సెయింట్ పాల్ యూనివర్శిటీలో ఎంఎస్ చదివేందుకు వెళ్లాడు. ఈ సమయంలో ఈ నెల 21న అపార్ట్ మెంట్ కాంప్లెక్స్ లో మృతి చెందినట్లు నివాసితులు గుర్తించి, వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.

ఈ సందర్భంగా స్పందించిన గ్రామ మాజీ సర్పంచ్... వంశీ తండ్రి రాజయ్య కల్లుగీత, రైతు అని.. అతడు తన కుమారుడి చదువుతో పాటు విదేశాల్లో భవిష్యత్తుపైనా ఎన్నో ఆశలుపెట్టుకున్నారని తెలిపారు. ఈ వార్త రాజయ్య కుటుంబంలో తీవ్ర విషాదం నింపిందని అంటున్నారు.

ఈ ఘటనపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్, హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ ఛార్జ్ ప్రణవ్ బాబుకు తెలియజేసిన కుటుంబ సభ్యులు... వంశీ మృతదేహాన్ని భారత్ కు తరలించేందుకు, కేసుపై సమగ్ర దర్యాప్తు జరిగేలా సహకరించేందుకు విజ్ఞప్తి చేశారని అంటున్నారు.