Begin typing your search above and press return to search.

అమెరికాలో మరో విషాదం.. ఈసారి తెలుగు విద్యార్థి!

ఇలా అగ్ర రాజ్యం అమెరికాలో భారతీయుల వరుస మరణాలను మరిచిపోకముందే మరో విషాదం చోటు చేసుకుంది.

By:  Tupaki Desk   |   12 March 2024 7:57 AM GMT
అమెరికాలో మరో విషాదం.. ఈసారి తెలుగు విద్యార్థి!
X

అమెరికాలో వరుసగా చోటు చేసుకుంటున్న భారతీయుల మరణాలు కలకలం రేపుతున్నాయి. ప్రమాదాల్లో మరణిస్తున్నవారితోపాటు ఇటీవల కాలంలో హత్యలు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. గత నెలలో భారతీయ కుటుంబం హత్యకు గురయింది. ఇటీవల ఒక భారతీయ సంగీతకారుడిని కాల్చిచంపారు. అలాగే ఒక విద్యార్థిని ఆశ్రయం ఇవ్వనందుకు ఒక దేశదిమ్మరి దారుణంగా కొట్టి హత్య చేశాడు. కొద్ది రోజుల క్రితం ప్రముఖ భరతనాట్య, కూచిపూడి కళాకారుడు అమర్‌ నాథ్‌ ఘోష్‌ ను గుర్తు తెలియని దుండగులు కాల్చిచంపారు.

ఇలా అగ్ర రాజ్యం అమెరికాలో భారతీయుల వరుస మరణాలను మరిచిపోకముందే మరో విషాదం చోటు చేసుకుంది. పిట్టల వెంకట రమణ అనే విద్యార్థి ఒక ప్రమాదంలో కన్నుమూయడం అందరిలో విషాదాన్ని నింపింది. పిట్టల వెంకట రమణ తెలుగు మూలాలకు చెందిన వ్యక్తి. ఆయన ప్రస్తుతం ఇండియానాపోలీస్‌ లోని ఇండియానా యూనివర్సిటీ పర్డ్యూ యూనివర్సిటీలో మాస్టర్స్‌ చదువుతున్నాడు. భార్య, పిల్లలు ఉన్నారు.

ఈ క్రమంలో మార్చి 9న ఫ్లోరిడాలో జరిగిన ఒక ప్రమాదంలో పిట్టల వెంకట రమణ ప్రాణాలు కోల్పోయాడు. ఫ్లోరిడా కీస్‌ లోని విస్టేరియా ద్వీపం సమీపంలో రెండు జెట్‌ స్కీలు ఢీకొన్న ప్రమాదంలో అతడు మృత్యువాత పడ్డాడు. ఈ విషయాన్ని ఫ్లోరిడా ఫిష్‌ అండ్‌ వైల్డ్‌ లైఫ్‌ కమిషన్‌ తెలిపింది. మార్చి 9న మధ్యాహ్నం 12:30 గంటలకు ప్రమాదం జరిగిందని పేర్కొంది.

ఈ ప్రమాదంలో వాటర్‌ క్రాఫ్ట్‌ ఆపరేటర్లలో ఒకరైన పిట్టల వెంకటరమణ తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటనలో మరెవరికైనా హాని జరిగిందా లేదా అనేది తెలియాల్సి ఉంది. అలాగే పిట్టల వెంకట రమణ స్వగ్రామం ఎక్కడో కూడా తెలియాల్సి ఉంది.

ఈ హృదయవిదారక ఘటన నేపథ్యంలో పిట్టల వెంకట రమణ కుటుంబం దాతల సహాయాన్ని కోరుతోంది. అతడి మృతదేహాన్ని భారత్‌ కు తరలించడానికి కావాల్సిన ఆర్థిక మద్దతు కోసం సహాయాన్ని అర్థిస్తోంది. అతడి భార్య, పిల్లల తరఫున అతడి స్నేహితులు ఫండ్‌ రైజింగ్‌ చేపట్టారు.

పిట్టల వెంకట రమణ తన మాస్టర్స్‌ డిగ్రీని ఈ ఏడాది పూర్తి చేయబోతున్నాడు. మాస్టర్స్‌ పూర్తయితే మంచి ఉద్యోగం లభిస్తుందనే ఆశతో అతడు ఉండగా జరిగిన ప్రమాదం అతడిని పొట్టనపెట్టుకుంది. దీంతో అతడి భార్య, పిల్లలు తల్లడిల్లుతున్నారు.