Begin typing your search above and press return to search.

భారతీయ అమెరికన్ షాపులను వణికిస్తోన్న సాయుధ దోపిడీలు.. తాజాగా మరొకటి!

తాజాగా రెడ్ మండ్ లోని 7-ఎలెవెన్ లో జరిగిన ఘటన తీవ్ర భయాందోళనలు కలిగించింది.

By:  Tupaki Desk   |   18 Oct 2024 2:30 PM GMT
భారతీయ అమెరికన్  షాపులను వణికిస్తోన్న సాయుధ దోపిడీలు.. తాజాగా మరొకటి!
X

యూఎస్ లో భారతీయ అమెరికన్ కన్వినియన్స్ స్టోర్ యజమానులు సరికొత్త సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రధానంగా వాషింగ్టన్ లోని కింగ్ కౌంటీలో వరుస సాయుధ దోపిడీలు సరికొత్త టెన్షన్ ను క్రియేట్ చేస్తున్నాయి. తాజాగా రెడ్ మండ్ లోని 7-ఎలెవెన్ లో జరిగిన ఘటన తీవ్ర భయాందోళనలు కలిగించింది.

అవును... వాషింగ్టన్ లోని కింగ్ కౌంటీలో ఇటీవల వరుస సాయుధ దోపిడీలు భారతీయ అమెరికన్ కన్వినియన్స్ స్టోర్ యజమానులు, వారి కమ్యునిటీలకు ఎక్కువ హాని కలిగిస్తున్నాయి. తాజాగా ముగ్గురు యువకులు ముసుగులు ధరించి రాత్రి 11:30 గంటల ప్రాంతంలో 148 అవెన్యూ నార్త్ ఈస్ట్ లోని షాపులో ప్రవేశించారు.

అనంతరం ఆ షాపులోని క్లర్క్ కి తుపాకీ ఎక్కుపెట్టి నగదు డిమాండ్ చేశారు. ఇదే సమయంలో కస్టమర్లనూ లక్ష్యంగా చేసుకున్నట్లు చెబుతున్నారు. అనంతరం.. కిర్క్ ల్యాండ్ లోని మరో 7-ఎలెవెన్ షాపుకు దోపిడికి వెళ్లారు. అయితే... అక్కడ పోలీసులు వీరిని అడ్డుకున్నారు. ఈ దోపిడీకి తుక్విలాలో దొంగిలించబడిన వాహనాన్ని వాడినట్లు చెబుతున్నారు!

ఈ సమయంలో కేసు నమోదు చెసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ సందర్భంగా భయం లేకుండా పనిచేసుకుంటు బ్రతకగల భవిష్యత్తు కోసం భారతీయ కమ్యునిటీ ఆశిస్తోంది.

కాగా... ఇటీవల కింగ్ కౌంటీ అంతటా సుమారు 80 హింసాత్మక దోపిడీలకు పాల్పడినట్లు చెబుతున్న ఓ వ్యక్తి, ముగ్గురు యువకులను సీటెల్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ మేరకు సీటెల్ పోలీస్ డిపార్ట్మెంట్ ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ ముగ్గురు యువకులు.. 15, 16, 18 ఏళ్ల వారని అధికారులు తెలిపారు.

గ్యాస్ స్టేషన్లు, దుకాణాలు, అర్థరాత్రి నడిచే పలు పాస్ట్ ఫుడ్ రెస్టారెంట్లలో వీరు దోపిడీలకు పాల్పడినట్లు చెబుతున్నారు. వీరి నేరాల్లో దొంగతనాలతో పాటు కాల్పులు కూడా ఉన్నాయని అంటున్నారు. కింగ్ కౌంటీ అంతటా 78, సీటెల్ నగరంలో కనీసం 22 కేసులు ఉన్నట్లు చెబుతున్నారు.