కొడుకు కూతురు విషయంలో బైడెన్ కీలక నిర్ణయం!
గతకొంతకాలంగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కుమారుడు హంటర్ బైడెన్ కుమార్తెకు సంబంధించిన వ్యవహారం హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. ఆమె సంరక్షణ బాధ్యతలకు సంబంధించి గతకొన్ని రోజులుగా చర్చ జరుగుతునే ఉంది.
By: Tupaki Desk | 30 July 2023 5:24 AM GMTగతకొంతకాలంగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కుమారుడు హంటర్ బైడెన్ కుమార్తెకు సంబంధించిన వ్యవహారం హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. ఆమె సంరక్షణ బాధ్యతలకు సంబంధించి గతకొన్ని రోజులుగా చర్చ జరుగుతునే ఉంది. ఇదే సమయంలో ఇంతజరుగుతున్నా కూడా ఇప్పటివరకూ బైడెన్ నోరు మెదపలేదు. అయితే తాజాగా ఈ విషయంపై స్పందించారు.
అవును... గత కొన్నాళ్లుగా చర్చనీయాంశమవుతున్న కుటుంబ వ్యవహారంపై అమెరికా అధ్యక్షుడు బైడెన్ ఎట్టకేలకు స్పందించారు. నేవీ జాన్ రాబర్ట్స్ అనే నాలుగేళ్ల చిన్నారి తన కుమారుడు హంటర్ బైడెన్, లండెన్ రాబర్ట్స్ దంపతులకు కలిగిన సంతానమేనని అంగీకరించారు. ఆమె తన మనవరాలేనని స్పష్టం చేస్తూ... తనకు ఆమె ఏడో మనవరాలని ప్రకటించారు.
వివరాళ్లోకి వెళ్తే... నేవీ రాబర్ట్స్ పెంపక బాధ్యతలపై ఆమె తల్లి లండెన్ రాబర్ట్స్ కోర్టులో దావా వేయడంతో హంటర్ బైడెన్ - లండెన్ రాబర్ట్స్ ల వ్యవహారం వెలుగులోకి వచ్చింది. దీంతో కోర్టు స్పందించింది. డీ.ఎన్.ఏ పరీక్షకు ఆదేశించింది. పరీక్షల అనంతరం ఆ చిన్నారికి హంటర్ బైడెనే తండ్రి అని నిర్ధారించారు. ఈ సందర్భంగా... చిన్నారి పోషణ బాధ్యతను ఇద్దరూ తీసుకోవాలని న్యాయస్థానం ఆదేశించింది.
ఈ సందర్భంగా... హంటర్ బైడెన్ తాను రాసుకున్న 2021 జ్ఞాపకాలు పుస్తకంలో లండెన్ రాబర్ట్స్ గురించి ప్రస్తావించారు. తాను మద్యానికి, డ్రగ్స్ కు బానిసైన సమయంలో ఆమె తన జీవితంలోకి వచ్చిందని.. కానీ, ఆ తర్వాత ఆమెను మర్చిపోయినట్లు రాసుకొచ్చారు. కానీ, కోర్టు ఆదేశాల మేరకు చిన్నారి బాధ్యతను మాత్రం తీసుకుంటున్నట్లు చెప్పారు.
ఆ సమయంలో బైడెన్ మాత్రం ఆ చిన్నారిని తన మనవరాలిగా స్వీకరిస్తున్నట్లు ఎలాంటి ప్రకటన చేయలేదు. దీంతో... ఇటు డెమొక్రాట్లు, ప్రతిపక్ష రిపబ్లికన్ల నుంచి కూడా వ్యతిరేకత వ్యక్తమైంది. న్యాయపోరాటం ముగిసిన తర్వాత కూడా చిన్నారిని తన మనవరాలిగా స్వీకరించకపోవడం అన్యాయమని విమర్శలు పెరిగాయి.
ఈ నేపథ్యంలో బైడెన్ తాజాగా ప్రకటన చేశారు. ఇది కేవలం కుటుంబ పరమైన అంశమేనని, ఇందులో విమర్శలకు తావులేదని స్పష్టం చేశారు. తన ఆరుగురు మనవలు, మనవరాళ్లతో ఆడుకోవడమంటే చాలా సరదా అని వ్యాఖ్యానించారు. వాళ్లతో రోజూ మాట్లాడుతుంటానని చెప్పుకొచ్చారు. దీంతో ఈ వ్యవహారం సద్దుమణిగినట్లేనని అంటున్నారు!