Begin typing your search above and press return to search.

యూఎస్ లో భారత విద్యార్థి బలి... ఏమిటీ "బ్లూవేల్ ఛాలెంజ్"?

అనేక రకాల కారణాలతో, ప్రమాదాలతో విదేశాల్లో మృత్యువాత పడుతున్న భారతీయ విద్యార్థుల సంఖ్య రోజు రోజుకీ పెరుగుతున్న సంగతి తెలిసిందే

By:  Tupaki Desk   |   21 April 2024 6:06 AM GMT
యూఎస్ లో భారత విద్యార్థి బలి... ఏమిటీ బ్లూవేల్ ఛాలెంజ్?
X

అనేక రకాల కారణాలతో, ప్రమాదాలతో విదేశాల్లో మృత్యువాత పడుతున్న భారతీయ విద్యార్థుల సంఖ్య రోజు రోజుకీ పెరుగుతున్న సంగతి తెలిసిందే. అందుకు రోడ్డు ప్రమాదాలు, జాత్యహంకార దాడులు, మగ్గింగ్, గన్ కల్చర్ మొదలైనవి కారణాలు అని ఇంతకాలం చెప్పుకుంటున్న దశలో వాటిలో ఒక ఆన్ లైన్ గేం కూడా కొత్త కారణంగా ఎంట్రీ ఇచ్చింది. దీంతో ఈ విషయం ఇప్పుడు వైరల్ గా మారింది.

అవును... అమెరికాలో చదువుకుంటున్న భారతీయ, భారత సంతతి విద్యార్థులు వరసగా ప్రాణాలు కోల్పోతుండటం కలకలం రేపుతోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో... గత నెల మొదట్లో మసాచుసెట్స్‌ యూనివర్సిటీకి చెందిన ఇండియన్ స్టూడేంట్ శవమై కనిపించాడు. అయితే... అతడి ఆత్మహత్యకు "బ్లూవేల్‌ ఛాలెంజ్‌" అనే ఆన్ లైన్ గేమ్‌ కారణమని దర్యాప్తు అధికారులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారని తెలుస్తుంది.

ఈ క్రమంలో ఒక గేమ్‌ కారణంగా ఆ విద్యార్థి మృతి చెంది ఉంటాడా? అనే ప్రశ్నకు... ఆ విషయంపై ప్రస్తుతానికి తమవద్ద ఎలాంటి సమాచారం లేదు.. కానీ... దీనిని ఆత్మహత్య కోణంలో విచారిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఇదే సమయంలో... ఈ కేసును మూసివేయడానికి ముందు వైద్య పరీక్షల తుది ఫలితాల కోసం ఎదురు చూస్తున్నట్లు వెల్లడించారు.

మరోపక్క... అతడు చనిపోవడానికి ముందు ఆ విద్యార్థి రెండు నిమిషాల పాటు ఊపిరి బిగపట్టినట్లు తెలుస్తోందంటూ మీడియా పేర్కొంది. ఈ తరుణంలో ఈ సూసైడ్‌ గేమ్‌ గురించిన చర్చ మరోసారి మొదలైంది. ఇందులో భాగంగా అసలు ఈ గేమ్ ఏమిటి.. ఎక్కడ మొదలైంది.. ఎలా మొదలైంది.. ఈ గేమ్ లో రూల్స్ ఏమిటి మొదలైన విషయాలు చర్చకు వస్తున్నాయి.. నెట్టింట ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ గా మారిందని అంటున్నారు.

ఏమిటీ బ్లూవేల్‌ ఛాలెంజ్‌..?:

ఆటగాళ్లను ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపించే ఆన్‌ లైన్‌ గేమే బ్లూవేల్‌ ఛాలెంజ్‌! ఇది తొలుత రష్యాల్లో ప్రారంభమైంది. ఈ గేమ్ వల్ల చాలా మంది ప్రాణాలు కోల్పోయినట్లు కథనాలు వెలువడ్డాయి. అయితే ఆ కేసులు అధికారిక ధృవీకరణకు నోచుకోకపోవడం గమనార్హం. అయినప్పటికీ... ఈ గేమ్ పై పలు దేశాలు నిషేధం విదించాయి. ఈ ఆటలో భాగంగా సుమారు 50 రోజుల పాటు ఒక క్యూరేటర్‌ ఆటగాళ్లకు పలు ప్రమాదకర టాస్క్‌ లను ఇస్తుంటాడని చెబుతున్నారు. .

ఇందులో భాగంగా... మొదటి టాస్క్‌ ల్లో మధ్య రాత్రిలో నిద్ర లేవడం, భయానక వీడియోలు వీక్షించడం వంటివి ఉండొచ్చని చెబుతున్నారు. ఆ తర్వాత క్రమ క్రమంగా ఆ టాస్క్‌ ల తీవ్రత పెరుగుతూ... ఎత్తైన టవర్ల అంచున నిల్చోవడం, గాయాలు చేసుకోవడం వంటివీ ఉంటాయని అంటున్నారు. ఇది పీక్స్ కి చేరి, చివరిగా ఆటగాళ్లను ఆత్మహత్య చేసుకోమని కూడా అడగొచ్చని చెబుతున్నారు.

ఎవరైనా ఒకసారి ఈ గేమ్‌ లోకి ఎంటరైతే... దాని నుంచి బయటపడటం దాదాపు అసాధ్యం అని... ఒక వేళ బయటపడదామన్న... బెదిరించి, మానసికంగా తప్పుదోవ పట్టించి టాస్క్‌ లు పూర్తిచేసేలా చూస్తుంటారని చెబుతున్నారు. 2015 చివర్లో రష్యా టీనేజర్‌ ఆత్మహత్యతో ఇది బాగా ప్రచారంలోకి వచ్చింది!!