Begin typing your search above and press return to search.

కెనడాతో కాలు దువ్వుతున్న ఈడీ.. మానవ అక్రమ రవాణా..కాలేజీలపై నిఘా

ప్రపంచంలోనే రెండో అతిపెద్ద దేశమైన కెనడాతో భారత్ కు గతంలో మంచి స్నేహ సంబంధాలు ఉండేవి.

By:  Tupaki Desk   |   25 Dec 2024 10:30 AM GMT
కెనడాతో కాలు దువ్వుతున్న ఈడీ.. మానవ అక్రమ రవాణా..కాలేజీలపై నిఘా
X

ప్రపంచంలోనే రెండో అతిపెద్ద దేశమైన కెనడాతో భారత్ కు గతంలో మంచి స్నేహ సంబంధాలు ఉండేవి. అయితే, ఎప్పుడైతే జస్టిన్ ట్రూడో కెనడా ప్రధాని అయ్యారో అప్పటినుంచి బంధం బీటలు వారింది. గత ఏడాది కాలంగా మరింత లోతుల్లోకి వెళ్లిపోయాయి. మరీ ముఖ్యంగా కెనడాలో ఖలిస్థానీల హత్య వెనుక భారత్ ఉందంటూ ట్రూడో ప్రభుత్వం ఆరోపణలు చేయడం పరిస్థితులను దిగజార్చింది. ఇక ట్రూడో భారత్ లో సదస్సుకు వచ్చి తిరుగు ప్రయాణంలో ఇబ్బందులు ఎదుర్కొనడం నుంచి మన దేశ రాయబారులను బహిష్కరించడం వరకు ఓ సమరమే జరిగింది.

కాలుదువ్వినదెవరు?

కెనడా కేంద్రంగా ఖలిస్థానీలు కొన్నేళ్లుగా తమ స్వరాన్ని గట్టిగా వినిపిస్తున్నారు. వారు బహిరంగంగానే తమ నిరసనలను వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో భారత్ తగు విధంగా స్పందించింది. అయితే, తాజాగా కెనడా తమ దేశంలో శాశ్వత నివాసితులు (పీఆర్-పర్మినెంట్ రెసిడెంట్స్) విధానాన్ని కఠినం చేసింది. ఇది ప్రధానంగా భారతీయ విద్యార్థులను మనసులో ఉంచుకునే అనేది తెలిసిపోతోంది.

కాలేజీలపై ఈడీ నిఘా

ఇరు దేశాల సంబంధాలు అత్యంత కనిష్ఠ స్థాయికి పడిపోయిన నేపథ్యంలో కెనడా సరిహద్దు మీదుగా భారతీయులను అమెరికాకు అక్రమంగా తరలిస్తున్న వ్యక్తులు, సంస్థలపై ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దర్యాప్తు మొదలుపెట్టింది. ఇందుకు సంబంధించి డబ్బు చేతులుమారిన వైనంపై దర్యాప్తు చేస్తోంది. కెనడాలోని కొన్ని కాలేజీలు, భారత సంస్థల పాత్రపై విచారణ చేపట్టింది

కదిలించిన ఆ కేసే మూలం..

సరిగ్గా మూడేళ్ల కిందట.. 2022 జనవరి 19న గుజరాత్‌ కుటుంబం కెనడా సరిహద్దు నుంచి అమెరికాలోకి ప్రవేశించబోయి తీవ్రమైన మంచు కారణంగా చనిపోయింది. ఈ కేసును ఆధారంగా చేసుకొని ఈడీ దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఈ ఘటనలో ప్రధాన నిందితుడు భవేష్‌ పటేల్‌తో పాటు మరికొందరిపైనా ఈడీ కేసు నమోదు చేసింది. నిందితులు మానవులను అక్రమంగా తరలించే సంస్థలతో కలిసి కుట్ర పన్ని.. భారత ప్రజలకు మాయమాటలు చెప్పి వారిని దేశ సరిహద్దులు దాటిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. అలాంటివారిని కెనడా మీదుగా అమెరికాకు అక్రమంగా తరలిస్తున్నారని తెలిపారు. కెనడా, అమెరికా విశ్వవిద్యాలయాల్లో ఉన్నత విద్యను అభ్యసించాలని, విదేశాల్లో స్థిరపడాలని కోరుకునే భారతీయులను ట్రాప్‌ చేస్తున్నట్లు తమ దర్యాప్తులో కనుగొన్నట్లు చెప్పారు. వ్యక్తి నుంచి రూ.55 - రూ.60 లక్షల వరకు వసూలుచేసినట్లు వెల్లడించారు.

విద్యార్థి వీసాపై కెనడా వెళ్లినవారు అక్కడి విశ్వవిద్యాలయాల్లో చేరట్లేదన్నారు. దీంతో కాలేజీలు వారి నుంచి తీసుకున్న అడ్మిషన్‌ ఫీజును తిరిగి ఆయా వ్యక్తుల ఖాతాల్లో జమ చేసేవారని తెలిపారు. అలా వెళ్లినవారు చట్టవిరుద్ధంగా కెనడా యూఎస్‌ సరిహద్దును దాటుతున్నారని తెలిపారు. విదేశాల్లోని యూనివర్శిటీల్లో భారతీయులకు ప్రవేశం ఇప్పించడానికి ముంబయి, నాగ్‌పుర్‌ ఉన్న రెండు సంస్థలు పని చేస్తున్నట్లు గుర్తించామని అధికారులు పేర్కొన్నారు. వీరు ఏటా దేశంలోని వివిధ కళాశాలల నుంచి సుమారు 35వేల మంది విద్యార్థులను దేశం దాటిస్తున్నారని తెలిపారు.