కెనడాలో పర్మిట్లు ముగిసే మనోళ్ల సంగతేంటి?
గడిచిన కొద్దికాలంగా తమ దేశంలో తాత్కాలిక పర్మిట్లతో ఉండే వారి విషయంలో కెనడా వ్యవహరిస్తున్న తీరు తెలిసిందే.
By: Tupaki Desk | 3 Dec 2024 5:34 AM GMTగడిచిన కొద్దికాలంగా తమ దేశంలో తాత్కాలిక పర్మిట్లతో ఉండే వారి విషయంలో కెనడా వ్యవహరిస్తున్న తీరు తెలిసిందే. అంతేకాదు..కొత్తగా వీసాలు ఇచ్చే వారికి చుక్కలు చూపిస్తోంది. అదేమంటే.. దేశంలో వలసలు పెద్ద ఎత్తున పెరిగిపోవటంతో మౌలిక వసతులు.. ఇళ్ల కొరతను ఎదుర్కోవటంతో పాటు హెల్త్ కేర్ రంగం తీవ్రంగా ప్రభావితం అవుతున్నట్లుగా పేర్కొంటున్నారు. ఈ క్రమంలో కొత్త పాలసీని తీసుకొచ్చిన అక్కడి ప్రభుత్వం తాత్కాలిక పర్మిట్లతో ఉండే వారితో పాటు.. శరణార్థుల విషయంలోనూ కటువుగా వ్యవహరిస్తోంది. దీంతో.. వారు తమ పర్మిట్లు ముగిసిన తర్వాత దేశాన్ని విడిచి వెళ్లాల్సి ఉంటుంది.
వచ్చే ఏడాది (2025) చివరి నాటికి కెనడాలో ఉన్న 50 లక్షల మంది తాత్కాలిక పర్మిట్ల గడువు తీరనుంది. ఇందులో వర్కు పర్మిట్లు మీద వచ్చిన వారు.. స్టడీ పర్మిట్ల మీద ఉన్న వారున్నారు. మరి.. వీరి సంగతేంటి? వీరి ఫ్యూచర్ మాటేమిటి? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. ఇదిలా ఉంటే.. వలస వచ్చిన వారు స్వచ్ఛందంగా తిరిగి వెళతారని కెనడా ప్రభుత్వం చెబుతోంది. ఇదే విషయాన్ని తాజాగా కామన్ ఇమిగ్రేషన్ కమిటీ మీటింగ్ లోనూ ఆ శాఖా మంత్రి మార్క్ మిల్లర్ చెబుతున్నారు.
తాత్కాలిక పర్మిట్లతో దేశంలో ఉంటున్న వారికి సంబంధించిన అంశాల్ని కన్జర్వేటివ్ ఎంపీ టామ్ కిమియెక్ లేవనెత్తారు. ఈ సందర్భంగా దేశంలో తాత్కాలిక పర్మిట్లపై ఉన్న 49 లక్షల మందికి సంబంధించి కీలక అంశాలు చర్చకు వచ్చాయి. దేశంలో ఉన్న 49 లక్షల మందిని పంపించేస్తున్నారా? అని ప్రశ్నిస్తే మంత్రి బదులిస్తూ.. వలస చట్టాల్ని అమలు చేయటంలో కెనడియన్ బోర్డర్ సర్వీసెస్ ఏజెన్సీ చురుకుగా పని చేస్తుందని పేర్కొన్నారు.
స్టూడెంట్ వీసా మీద ఉన్న సుమారు 7.66 లక్షల మంది గడువు డిసెంబరు 2025 నాటికి ముగియనుంది. ఇలాంటి వారి విషయానికి వస్తే.. కొంతమంది విద్యార్థులు పర్మిట్లు రెన్యువల్ చేసుకోవటం లేదంటే పీజీ కోసం అప్లికేషన్ చేసుకుంటారని.. ఇలా చేస్తే వారి పర్మిట్ల గడువు పెంచుకునే వీలుందని చెబుతున్నారు. ఇక.. కెనడాలోని భారతీయుల విషయానికి వస్తే.. వలసల్లో మనోళ్లు ఎక్కువ మందే ఉన్నారు. పర్మినెంట్ రెసిడెంట్స్ లో 2022లో మొత్తం భారతీయులు 27 శాతం ఉన్నారు. అయితే.. తాత్కాలిక పర్మిట్ల మీద కెనడాలో ఉన్న భారతీయులకు సంబంధించిన లెక్కలు అందుబాటులో లేవు. దీంతో.. వారెంత మంది అన్న దానిపై స్పష్టత రావటం లేదు. మొత్తంగా చూస్తే.. పర్మినెంట్ రెసిడెంట్స్ కు ప్మిట్లను 2025 నాటికి 5 లక్షల నుంచి 3.95 లక్షలకు తగ్గించాలని కెనడా ఇమిగ్రేషన్ కొత్త పాలసీ చెబుతోంది.
కెనడా కొత్త ఇమ్మిగ్రేషన్ పాలసీని చూస్తే.. తాత్కాలిక వర్కర్ల విద్యార్థుల పర్మిట్లను భారీగా తగ్గించనున్నారు. 2026 నాటికి కెనడాలో నివసిస్తున్న తాత్కాలిక విదేశీ వర్కర్ల సంఖ్యలో 40 శాతం.. విదేశీ విద్యార్థుల సంఖ్యలో పది శాతం కోత పడే పరిస్థితి ఉంటుందని అంచనా వేస్తున్నారు. కొత్త పాలసీతో దేశంలోని జనాభాను నియంత్రించాలని కెనడా భావిస్తోంది. ఈ పరిస్థితుల్లో విదేశాల్లో చదువుకోవాలనుకునే భారతీయ విద్యార్థులు కెనడా వైపు చూసే కన్నా.. వేరే దేశాల మీద ఫోకస్ పెడితే మంచిదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.